అక్కడ అడుగు పెడితే చాలు మనసు పులకించి పోతుంది. కళా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆనందంతో హృదయం పొంగిపోతుంది. సాహిత్య వాతావరణం మనల్ని రారామ్మంటూ ఆహ్వానిస్తుంది. భారతీయ కళారూపాలు, ఆ పాత మధురాలతో తనువు నిండి పోతుంది. హైదరాబాద్ మహానగరంలో సాహిత్య వేదికలు అంటే వెంటనే గుర్తుకొచ్చే కొన్ని అరుదైన ప్రదేశాలలో శ్రీ త్యాగరాయ గానసభ ఒకటి. రవీంద్ర భారతితో సమానంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అద్భుతమైన వేదిక ఇది. ఒక విధంగా చెప్పాలంటే కళలకు కాణాచీగా చెప్పుకోవచ్చు. ఎన్నో కళలకు, మరెందరో కళాకారులకు పుట్టినిల్లు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఉన్నన్నాళ్లు ఇక్కడ జరిగే ప్రతి సాహిత్య కార్యక్రమానికి తప్పక హాజరయ్యేవారు. అటువంటి గానసభ ద్విగ్విజయంగా అరవై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ అరుదైన వేదిక చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి…
త్యాగరాయ గానసభ ను 1966లో నిర్మించారు. అప్పట్లో పౌరాణిక, సాంఘిక నాటకాలు ఎక్కువగా రవీంద్ర భారతిలో జరుగుతుండేవి. ఆ కాలంలో చిక్కడపల్లి నుండి అంత దూరం వెళ్లేందుకు కళాభిమానులు కొంత వ్యయప్రయాసలతో కూడి ఉండేది. అది అర్థం చేసుకున్న కళా సుబ్బారావు, చిక్కడపల్లి ప్రాంతంలోనే ఒక థియేటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. ఆయనకు చిన్నతనం నుండి కళల పట్ల మక్కువ ఎక్కువ. ఆయనతో పాటు గుండవరపు హనుమంతరావు, చెరువు పార్థసారధి, దయానంద్ వంటి పెద్దలు దీని ఏర్పాటు కోసం నడుం బిగించారు. అహర్నిశలూ శ్రమించి ఐదేండ్ల పాటు కృషి చేసి, ఎంతోమంది సహకారంతో ఓ భవనాన్ని నిర్మించారు.
కళల పట్ల మక్కువతో…
కళా సుబ్బారావు సొంత ఊరు కైకలూరు దగ్గర కలదిండి. ఈయన ప్రముఖ వ్యాపార వేత్త. తన వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 1948 నుండి రాణిగంజ్‌లో వ్యాపారిగా వుండేవారు. అప్పట్లో క్లాస్ 1 కాంట్రాక్టర్‌గా ఉంటూ గవర్నమెంట్‌తో కూడా కలిసి అనేక కాంట్రాక్టులు చేస్తుండేవారు. త్యాగరాయ గానసభ ఏర్పాటు కోసం ఆయన తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టారు. అప్పట్లోనే ఆయన తన ఆదాయంలో చాలా వరకు కళలు, కళాకారులను ప్రోత్సహించడం కోసమే ఖర్చు చేశారు. డబ్బుతో పాటు సమయాన్ని సైతం వెచ్చించిన గొప్ప కళాభిమాని ఆయన. అలాంటి అభిమానంతోనే తన మిత్రులతో కలిసి గాన సభకు ప్రధాన వ్యవస్థాపకులుగా ఉన్నారు. దీన్ని నిర్మించిన అతి తక్కువ కాలంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి, భారత రత్న బిస్మిల్లా ఖాన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, హేమమాలిని వంటి గొప్ప గొప్ప దిగ్గజాలతో ప్రదర్శనలు ఇప్పించారు. ఇలా అప్పట్లోనే విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరింత మంది కళాకారులకు గానసభ చేరువయ్యేలా చేశారు కళా సుబ్బారావు.
స్నేహితుల సహకారంతో…
ప్రారంభంలో కళా సుబ్బారావు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి త్యాగరాయ గానసభ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. స్నేహితుల సహాయ సహకారాలతో కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక హాలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒకటే వేదిక ఉండేది. అయితే మొదట్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, కళ్యాణ మండపం కూడా ఉండేది. కళ్యాణ మండపం కమర్షియల్ యాక్ట్ కిందకు రావడంతో నిర్వహణ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దాంతో కళ్యాణ మండపం తీసివేసి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించడం మొదలుపెట్టారు.
ఎన్నో త్యాగాలు చేసి…
కళా సుబ్బారావు గానసభ నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. అన్నింటినీ భరించి దృఢ సంకల్పంతో తన మానస పుత్రికలా త్యాగరాయ గానసభను ఇష్టంగా నిర్మించారు. కళలపట్ల ఆయనకున్న అభిరుచికి ఇదొక నిదర్శనం. పౌరాణిక, సాంఘిక నాటకాలు, కర్నాటక సంగీతం… ఇలా అన్ని రకాల కళలు నగర ప్రజలకు పరిచయం చేయాలనే బలమైన కోరికతోనే ఈ చారిత్రక ప్రదేశం నిర్మితమైనదని. ఏ లక్ష్యంతో అయితే ఆయన దీన్ని నిర్మించారో అదే లక్ష్యంతో తన తుది శ్వాస విడిచే వరకూ కృషి చేశారు. తర్వాత ఆయన కుమారులు సైతం అదే బాటలో నడుస్తున్నారు. తమ వ్యాపారాలు చూసుకుంటూనే గానసభ కార్యక్రమాలను ఎలాంటి విరామం లేకుండా కొనసాగిస్తున్నారు. తండ్రి కోరికను, ఆశయాన్ని కొనసాగించాలన్నదే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు.
కళాకారులకు మాతృసంస్థగా…
ఇక్కడ తమ మొదటి ప్రదర్శన ఇవ్వగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంతో మంది కళాకారులు తపించే స్థాయికి నేడు త్యాగరాయ గాన సభ ఎదిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కళాకారులు ఎవరైనా తమకు మంచి గుర్తింపు రావాలంటే రవీంద్ర భారతితో పాటు గానసభను కూడా ఒక సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా స్థాపించిన నాటి నుండి దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మంది కళాకారులకు మాతృసంస్థగా ఇది మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు నుండి కూడా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా గానసభలో జరిగే కార్యక్రమాలకు తప్పక హాజరవుతుంటారు. కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఎంతో మంది గవర్నర్లు కూడా హాజరయ్యారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు సైతం గానభలో జరిగే కార్యక్రమాలకు వచ్చి కళాకారులను ప్రోత్సహించేవారు.
కళా దీక్షితులు అందించిన సేవలు
1966 నుండి అనేక కమిటీలు దీని నిర్వహణా బాధ్యతలు చూస్తున్నాయి. 1996లో కళా సుబ్బారావు కన్నుమూసిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు కళా దీక్షితులు గానసభ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన 21 ఏండ్లు దీనికి అధ్యక్షులుగా పని చేసి కళా రంగానికి ఎనలేని సేవలు అందించారు. తండ్రి ఆశయాలను ముందుకు కొనసాగించడమే కాకుండా విభిన్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గానసభ ప్రాంగణంలో మొదట్లో ఒకటే హాలు మాత్రమే ఉండేది. తండ్రి సేవకు గుర్తుగా ‘కళా సుబ్బారావు కళా వేదిక’ పేరుతో ఒక ఏసీ హాల్‌ను ఏర్పాటు చేశారు.
ఏడు వేదికలతో…
కళా దీక్షితులు మరణించిన తర్వాత ఆయన తమ్ముడు 2017లో కళా జనార్థన్ మూర్తి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అన్నదమ్ములిద్దరూ తండ్రికి తగ్గ తనయులుగా కళలకు, కళాకారులకు విశేష సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కళా జనార్ధన్ మూర్తి గానసభను ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొత్తం ఏడు ఏసీ వేదికలు ఏర్పాటు చేశారు. మొయిన్ హాల్‌తో పాటు కళా సుబ్బారావు కళావేదిక, కళా లలిత కళా వేదిక, కళా వెంకట దీక్షితులు కళా వేదిక, గుండవరపు హనుమంతరావు కళా వేదిక, కళా మారుతి కళా వేదిక, కళా సంగీత నాట్య వేదిక ఉన్నాయి. ఏడాదిలో 365 రోజులు సినీ గీతాలకు, పురస్కారాలకు మినహాయించి మిగిలిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ హాళ్లను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే మార్క్సిం గోర్కి ‘అమ్మ’ నవలను నాటకంగా రూపొందించి అనేక సార్లు ప్రదర్శించారు. ఎంతో గొప్పదైన ఈ నవలను కండ్లకు కట్టినట్టు చూపించి ఎందరిలోనే స్ఫూర్తి నింపారు. ఇంకా హరిశ్చంద్ర నాటక ప్రదర్శనకు గానసభను మారుపేరుగా చెప్పుకోవచ్చు.
ఎందరో మహానుభావులు
శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షునిగా ‘ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో’ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతృప్తినిచ్చిన అంశంగా కళా జనార్థన్ భావిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి ఎంతో సేవ చేసిన మహనీయులైన డా.సి.నారాయణరెడ్డి, కాళోజీ, గుర్రం జాషువ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దివాకర్ల వెంకట అవధాని, మఖ్దూం మొహినుద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య, సర్వేపల్లి రాథాకృష్ణ, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహనీయుల జయంతి సందర్భంగా 365 రోజులు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని రాబోయే తరాల వారికి అందించాలని, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ‘ఎందరో మహానుభావులు’ కార్యక్రమం ప్రారంభించారు. దీని ఆధ్వర్యంలో 130 కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పుట్టపర్తి నారాయణా చార్యులు, ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, భీస్మిల్లాఖాన్, రఘుపతి వెంకయ్య, ఎస్.వి.రంగారావు, మహానటి సావిత్రి, లాల్ బహదూర్ శాస్త్రి, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖుల జయంతులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. గానసభ ప్రతినెలా సంయుక్తంగా 70 కార్యక్రమాలు, స్వతంత్రంగా 30 కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కాలెండర్ ఆఫ్ ఈవెంట్స్
ప్రతి ఏడాది జనవరిలో త్యాగరాయ ఆరాధనా దినోత్సవాల సప్తాహం, ఫిబ్రవరిలో కె.వి.రమణాచారి జన్మదినం సందర్భంగా ఏడు రోజులు సప్తాహం, మార్చిలో సాహిత్య సభలు, ఏప్రిల్‌లో పౌరాణిక డ్రామాల సప్తాహం, మే నెలలో అష్టావధానం, జూన్‌లో గ్రంథావిష్కరణలు, జూలైలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ జన్మదినోత్సవం సందర్భంగా ఏడు రోజులు సప్తాహం, ఆగస్టులో హరికథ సప్తాహం, సెప్టెంబర్‌లో బుర్రకథ సప్తాహం, అక్టోబర్ నెలలో మరో సారి సంగీత సప్తాహం, నవంబర్‌లో ప్రముఖ దర్శకులు బాపుగారి జన్మదినోత్సవ వేడుకలు చేస్తున్నారు. ఇక డిసెంబర్‌లో మిమిక్రి కళాకారులు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ జన్మదినోత్సవం సందర్భంగా మిమిక్రి ఫెస్టువల్ చేస్తున్నారు.
ప్రపంచ రికార్డు సాధించింది
2005లో కళా జనార్థన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్రీ త్యాగరాయ గానసభ ప్రాంగణంలో 32 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం స్థాపనలో చురుకుగ్గా పాల్గొన్నారు. ఈయన పర్యవేక్షణలో గుండవరపు హనుమంతరావు ఏసీ హాల్‌లోని 1వ అంతస్తులో కార్యక్రమానికి హాజరు కావడానికి మెట్లు ఎక్కలేని వృద్ధుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. 2018 నుండి ప్రతి ఏడాది త్యాగరాయ ఆరాధనోత్సవాలును విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ రికార్డు సాధించిన ఆడిటోరియం శ్రీ త్యాగరాయ గానసభ. కళా సుబ్బారావు కళా వేదిక ఏసీ హాల్‌ల్లో ప్రదర్శించడానికి ప్రముఖ శాస్త్రీయ గాయకులను ఆహ్వానిస్తున్నారు. ‘వసంత నవరాత్రులు’, ‘నృత్యోత్సవాలు’, ‘హరికథ సప్తహాలు’ కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచారి జయంతి వంటి ప్రముఖ సాహిత్యవేత్తల జయంతుల సందర్భంగా ‘చిందు యక్షగాన మహోత్సవం’ నిర్వహిస్తున్నారు. సాహిత్యానికి, కళలకు సేవ చేసే అవకాశం దక్కడం పట్ల ఆయనకు దొరికిన మంచి అవకాశంగా భావిస్తున్నారు.
సప్తాహాలు
శీ త్యాగరాయ గానసభ మాజీ అధ్యక్షులు దివంగత శ్రీ కళా వెంకట దీక్షితులు జయంతి సందర్భంగా 2019 నుండి ఏప్రిల్ నెలలో 7 రోజుల పాటు ‘హరికథా సప్తాహం’ విజయవంతంగా నిర్వహిస్తున్నాను. 2019 నుండి నేను శ్రీ త్యాగరాయ గానసభ వ్యవస్థాపక సభ్యురాలు, లలిత కళా ప్రపూర్ణ శ్రీ కళా సుబ్బారావు జయంతి సందర్భంగా మే నెలలో ‘అష్టావధానం సప్తహం’ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మే నెలలో కళా సుబ్బారావుగారి పుట్టిన రోజు సందర్భంగా ‘వాగ్గేయ కారుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1997 నుండి నవంబర్ 5న కళా సుబ్బారావు వర్థంతి సందర్భంగా సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అలాగే నలుగురు ప్రముఖ వ్యక్తులకు అవార్డులతో సత్కరిస్తున్నారు.
ఉచిత శిక్షణ
గానసభలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలతో పాటు ప్రతి బుధవారం ఉచితంగా ఫ్లూటు నేర్పిస్తున్నారు. అలాగే ప్రతి గురువారం మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. ఇది చుట్టుపక్కల బస్తీ ప్రజలకు, కళాకారులకు, అభిమానులకు ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇంకా ప్రతి శని, ఆదివారాలు సాయంత్రం 4 నుండి ఆరు గంటలకు వరకు ఉచితంగా కూచిపూడి నృత్యం, ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నారు. ఈ విధంగా కళలను భావి తరానికి అందించేందుకు కూడా త్యాగరాయ గానసభ కృషి చేస్తోంది.
ఉచిత వివాహ వేదిక
సాహిత్య, కళా సేవ మాత్రమే కాకుండా పేదలకు అండగా నిలిచేందుకు కూడా కళా జనార్దన్ మూర్తి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద పిల్లలకు సాయం చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి పేరుతో ‘లలిత కళా ప్రూపుర్ణ’ కళా సుబ్బారావు మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో పేద పిల్లలకు చదువు కోసం సహాయం చేస్తున్నారు. అలాగే ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారికి ఉచితంగా వివాహాలు చేస్తున్నారు. వివాహాలంటే సామూహిక వివాహాలు కాదు. ఒక జంట ఆర్థిక ఇబ్బందితో పెండ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, పెద్దలు వారి వివాహానికి ఒప్పుకుంటే పెండ్లికి కావల్సిన ఏర్పాట్లన్నీ వీరే చూసుకుంటారు. పెండ్లి మండపం, టెంట్, క్రాకర్స్, టేబుల్స్, పెండ్లి పీఠలు అన్నీ ఏర్పాటు చేస్తారు. తెల్లరేషన్ కార్డు ఉండి వారి పరిస్థితి బాగోలేదు అంటే కళా జనార్థన్ కుటుంబం తరపును పెండ్లి కూతురికి బంగారు మంగళసూత్రం, కాలిమట్టెలు, చీర బహుకరిస్తున్నారు. అలా తమ ఇంటి ఆడపిల్లకు పెండ్లి చేసినట్టు భావిస్తున్నారు. అదే విధంగా 150 మంది వరకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 97 పెళ్లిళ్లు జరిపించారు. ఈ కార్యక్రమాన్ని వీరు 2022 మే 9న కళా సుబ్బారావు జయంతి సందర్భంగా మొదలుపెట్టారు. అప్పటి నుండి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
కళలు వర్థిల్లాలి
కళల వల్ల మానసిక ఉల్లాసం, మనశ్శాంతి దొరకుతుంది. ప్రతి మనిషి అనేక సమస్యలతో సతమతమవుతుంటాడు. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, సమాజ పరంగా అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాం. అలాంటి వారికి కళలు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయి. సంగీతం, నాటకం, నృత్యం మనసుకు హాయిని, మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మన చరిత్రను పరిశీలిస్తే కళలను ఎవరైతే పోషించారో, ప్రోత్సహించారో ఆ రాజ్యాలు ఎంతో సుభిక్షంగా సాగాయి. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను పోషించారు. కనుకనే ఆ రాజ్యం అంత విజయవంతంగా వర్థిల్లింది. కనుక ఏ ప్రభుత్వాలైనా కళలను ప్రోత్సహించాలి. కళాకారులను ఆదరించాలి. అప్పుడే సమాజం ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధి చెందుతుంది. అందుకే గానసభలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరిగేలా చూస్తున్నాం. కళాకారులను ప్రోత్సహిస్తున్నాం. గాన సభలో మేము చూస్తున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలను చూసి ఇటీవలె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఎయిడ్ మంజూరు చేసింది. దీని ద్వారా పది లక్షల రూపాయలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకునే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళా వి.ఎస్ జనార్థన్ మూర్తి, త్యాగరాయ గానసభ అధ్యక్షులు
కళా ఖండాన్ని నిలబెట్టుకోవాలి
‘మా నాన్న, అన్నయ్య దీని కోసం ఎంతో చేశారు. అలాగే నేను కూడా సాధ్యమైనంత వరకు త్యాగరాయ గానసభ సాహిత్య, కళాకారులకు విస్తృతమైన సేవలు అందించేలా చూస్తున్నాను. గానసభను కాపాడుకోవడం అనేది కళాసుబ్బారావు కోరిక. ఆయన కోరిక తీర్చడమే కొడుకులుగా నా లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే దీన్ని నడుపుతున్నాము. దీని కోసం నాన్న ఎంతో త్యాగం చేశారు. వేల కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా కళల కోసమే బతికారు. ఇప్పుడు నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. నేను లేకపోతే ఎలా అనే సమస్య రాకుండా చూసుకోవాలి. అందుకే దీన్ని ఎలా నిర్వహించాలో నా తర్వాతి తరం వారికి తెలిసేలా ఒక పుస్తకం కూడా రాసి పెట్టాను’ అంటూ కళా జనార్థన్ పంచుకున్నారు.
దాతలు ముందుకు వస్తే…
‘కొందరు త్యాగరాయ గానసభను తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఈ స్థలాన్ని వారి వ్యాపారాలకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారు. ఇలాగే ఖాళీగా ఉంటే ఎవరైనా భవిష్యత్తులో దోచుకునే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని కాపాడుకునేందుకు నా శక్తిమేర కృషి చేస్తున్నాను’ అంటున్నారు కళా జనార్ధన్ మూర్తి. ప్రస్తుతం గానసభలో సినీ గీతాల కార్యక్రమాలకు, పురస్కార ప్రధాన కార్యక్రమాలకు మినహాయించి మిగిలిన అన్ని కార్యక్రమాలకు హాళ్లను ఉచితంగా ఇస్తున్నారు. ఒక మెయిన్ హాల్‌కు మాత్రమే చార్జ్ చేస్తున్నారు. అది కూడా ఎవరైనా దాత ముందుకు వస్తే ఉచితంగా ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. గానసభ బిల్డింగ్, థియేటర్ గుడ్ కండీషన్‌లో ఉన్నాయని ఇటీవలె జేఎన్‌టీయూ సివిల్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. లాభాపేక్ష లేకుండా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన ఎంతో సంతృప్తిగా ఉన్నారు.
సలీమ
94900 99083