Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంనైపుణ్యాలు.. నాణ్యత.. ఉపాధి

నైపుణ్యాలు.. నాణ్యత.. ఉపాధి

- Advertisement -

బడ్జెట్‌ నుంచి విద్యా రంగం ఆశిస్తున్నది ఇదే
కేటాయింపులు 20 శాతం పెంచాలి
మేధావులు, విద్యావేత్తల సూచన


న్యూఢిల్లీ : కేంద్రం బడ్జెట్‌-2026 వైపు అడుగులు వేస్తున్నది. ఇలాంటి తరుణంలో విద్యా రంగానికి చెందిన నిపుణులు ప్రభుత్వానికి పలు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. భవనాల నిర్మాణం, విద్యార్థుల నమోదు వంటి సంఖ్యలకు మాత్రమే పరిమితం కాకుండా.. విద్యా నాణ్యత, నైపుణ్యం గల ఉపాధ్యాయులు, విద్య- ఉపాది మధ్య బలమైన అనుసంధానం మీద దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువతకు ఇది అత్యంత అవసరమని అంటున్నారు. భారత్‌కు ఉన్న భారీ యువ జనాభాను ఆర్థిక బలంగా మార్చుకునే కీలక అవకాశం ఇదేనని నిపుణులు, విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

క్వాంటిటీ కాదు.. క్వాలిటీ కావాలి
భారత్‌లో విద్యారంగం విషయంలో ప్రభుత్వాలు గణాంకాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నాయి. నాణ్యతను మాత్రం విస్మరిస్తున్నాయి. కాలేజీలు, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకాలు, బడ్జెట్‌ కేటాయింపులు.. అనే విషయాల్లో క్వాంటిటి (పరిమాణం)ని మాత్రమే చూస్తున్నారు తప్పితే.. విద్యారంగంలో నాణ్యతను ఎంత వరకు పెంచామన్నది ప్రభుత్వాలు ఆలోచించటం లేదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ది సర్కిల్‌ వ్యవస్థాపకులు సందీప్‌ రాయ్ ఈ విషయంపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

బడ్జెట్‌-2026ని ఖర్చుగా కాకుండా దేశ భవిష్యత్‌లో పెట్టుబడిగా చూడాలని అన్నారు. ”భారత యువ జనాభాను దేశానికి ఒక నిజమైన బలంగా మార్చుకునే అవకాశం ఈ బడ్జెట్‌ ఇవ్వాలి. నాణ్యమైన విద్యా ఆవిష్కరణలను ప్రోత్సహించే ఖర్చులకు ప్రాధాన్యత కల్పించాలి. మౌలిక వసతులు మాత్రమే పెంచడం, అడ్మిషన్ల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఉండకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా ఫలితాలు రావాలంటే విధానాల్లో మార్పు అవసరమని చెప్పారు. మెరుగైన ఉపాధ్యాయ నియామకాలు పెంచాలనీ, శిక్షణను కల్పించాలని ఆయన సూచించారు. పరిశ్రమలు-పాఠశాలల మధ్య బలమైన సంబంధాలు ఉండాలని తెలిపారు.

నైపుణ్య ఆధారిత ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఒడిశాలోని సెంచూరియన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సుప్రియా పట్నాయక్‌ మాట్లాడుతూ.. ”నైపుణ్యాలతో కలిసిన ఉన్నత విద్యే దేశ నిర్మాణానికి పునాది కావాలి. భారత్‌ గ్లోబల్‌ స్కిల్స్‌ కేంద్రంగా మారాలంటే, బడ్జెట్‌ 2026లో నైపుణ్యాల ఆధారిత ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఆమె తెలిపారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి కనీసం 20 శాతం నిధుల పెంపు జరపాలనీ, లేదా రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఆమె సూచించారు. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లోని 500 సంస్థల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత పరిశ్రమలతో అనుసంధానమైన ప్రయోగ శాలలు ఏర్పాటు చేయాలన్నారు. డీప్‌ టెక్నాలజీ, వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయం, ఆరోగ్య శాస్త్రాల్లో ప్రాక్టికల్‌ శిక్షణ వంటివి విద్యలో అవసరమని ఆమె సూచించారు.

విద్య.. ఆర్థిక భారం కాకూడదు.. ఉద్యోగానికి మార్గం కావాలి
సన్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ ఆశిశ్‌ ముంజాల్‌ మాట్లాడుతూ… ”బడ్జెట్‌ 2026 యువతకు భవిష్యత్‌ ఉద్యోగాలకు తీర్చి దిద్దే ఒక అవకాశం. ఏఐ, డేటా సైన్స్‌ వంటి కొత్త సాంకేతిక రంగాల్లో ప్రాజెక్ట్‌ ఆధారిత కోర్సులకు నిధులు పెంచాలి. డిజిటల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాంలను బలోపేతం చేయాలి. విద్యలో ప్రధాన అడ్డంకి అందుబాటులో లేని ధరలే. కాబట్టి బడ్జెట్‌ దానిపై దృష్టి పెంచాలి. టైర్‌-2, టైర్‌-3 ప్రాంతాల విద్యార్థుల కోసం వడ్డీలేని లేదా సబ్సిడీతో కూడిన విద్యా రుణాలు, ఎక్కువ స్కాలర్‌షిప్‌లు అవసరం” అని సూచించారు.

విద్యతోనే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం
ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ నుంచి నిపుణులు, మేధావులు చాలానే ఆశిస్తున్నారు. విద్యారంగం ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్తున్నారు. బోధనా నాణ్యత పెంపు, నైపుణ్యాల అభివృద్ధి, ఆవిష్కరణలకు మద్దతు, విద్యను మరింత ఖరీదు వస్తువులా కాకుండా.. దానిని అందరూ భరించగలిగేలా అందుబాటులోకి తీసుకురావడం వంటి కీలక అంశాలనే విద్యా రంగం కోరుకుంటున్నదని వారు చెప్తున్నారు. ఈ చర్యలు సరిగ్గా అమలైతే.. నైపుణ్య లోటును తగ్గించి, ఉపాధిని పెంచి, భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా మార్చగలమని నిపుణులు విశ్వసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -