దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు
పాల్గొన్న రైతులు, వ్యవసాయ-గ్రామీణ కార్మికులు, శ్రామిక ప్రజలు
ఎన్డీఏ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కారు రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చిన అఖిల భారత ప్రతిఘటన దినోత్సవం విజయవంతం అయింది. శుక్రవారం జరిగిన ఈ నిరసనలో దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ-గ్రామీణ కార్మికులు, శ్రామిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, గుజరాత్, రాజస్తాన్, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ తదితర అనేక రాష్ట్రాల్లో గ్రామ, జిల్లా స్థాయిలో ప్రతిజ్ఞా కార్యక్రమాలు, నిరసన, సమావేశాలు, ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను కొనసాగించడానికి రైతులు, కార్మికులు సమిష్టిగా నూతన సంవత్సర ప్రతిజ్ఞ చేశారు. జీవనోపాధి, ఆహార భద్రత, ఉపాధి హామీ, కార్మికుల హక్కులను బెదిరించే సీడ్స్ బిల్లు-2025, విద్యుత్ బిల్లు-2025, వీబీ-జీ రామ్ జీ చట్టం, నాలుగు కార్మిక కోడ్‌లను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే సమాఖ్య సూత్రాలపై దాడిని ఖండించారు.
రాష్ట్రాలలో విస్తృతమైన భాగస్వామ్యం దేశంలోని శ్రామిక ప్రజలు తమ హక్కులు, జీవనోపాధిని కాపాడుకోవడానికి పెరుగుతున్న ఐక్యత, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఎస్కేఎం పేర్కొంది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఒత్తిడి చేయడానికి, హామీ ఇవ్వబడిన పంట సేకరణ, ఉపాధి భద్రత, సామాజిక న్యాయం, సమాఖ్య హక్కులతో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని పొందేందుకు ఐక్యమైన, దేశవ్యాప్త ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో అఖిల భారత ప్రతిఘటన దినోత్సవం ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని వివరించింది. మోడీ ప్రభుత్వ దురాగత విధానాలను తిప్పికొట్టడానికి, రాబోయే కాలంలో కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, దేశంలోని ప్రజాస్వామ్య సంఘాలతో కలిసి సంయుక్త కిసాన్ మోర్చా విశ్వాసం, ఆశతో పోరాటాలను తీవ్రతరం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నది.



