Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ తవ్వకాలు ప్రారంభం

ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ తవ్వకాలు ప్రారంభం

- Advertisement -

రెండు వైపులా కొనసాగుతున్న పనులు
ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ఇన్‌లెట్‌ తవ్వకాలు మొదలయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్‌లెట్‌ పనులు ప్రారంభం కాగా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో పనులు చేపట్టినట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబెడ్కర్‌ సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పధకం, అచ్చంపేట బ్రాంచ్‌ కెనాల్‌ పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా నిలువనున్న ఈ ప్రాజెక్ట్‌ తవ్వకాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించారు.

తవ్వకాల సమయంలో సొరంగ మార్గం చివరికంటూ గాలి, వెలుతురు ప్రసారం అయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇన్‌లెట్‌ వైపు పనులు పున్ణప్రారంభం కావడానికి ముందే 20 మీటర్ల దూరం ఓపెన్‌ కట్‌ చేయడంతో పాటు అదనపు భద్రతా చర్యలను చేపట్టినట్లు వివరించారు. ఔట్‌ లెట్‌ తవ్వకాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి 20 మీటర్ల దూరం పూర్తి చేశామని తెలిపారు. ఏడేండ్లుగా ఔట్‌ లెట్‌ పనులు నిలిచి పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 43.93 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం శ్రీశైలం ఎడమ కాలువ భాగం నుండి తమ ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. నిపుణుల అభిప్రాయాలు, ఉన్నత స్థాయి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని అన్ని జాగ్రత్తలు చేపట్టినట్టు వివరించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్‌, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీ కే.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -