Wednesday, April 30, 2025

మందగమనం

‘మోడీ 3.0 పాలనలోనే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకుపోగలదు. దేశాన్ని ప్రగతి పథంలో పరిగెత్తించగలిగేది బీజేపీ మాత్రమే’ ఇవి వారి ప్రగల్బాలు. కానీ వాస్తవాలు దీనికి పూర్తి విరుద్దంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కలు కుండ బద్దలు కొట్టాయి. పాలకులు చెప్పేదానికి ఆ లెక్కలకు అస్సలు పొంతన లేకుండా పోయింది. దేశ అభివృద్ధికి కీలంగా భావించే పారిశ్రామిక రంగ ఉత్పత్తి ప్రమాదంలో పడబోతోందని తేల్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పారిశ్రామిక ఉత్పత్తి మందగిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల నాలుగు శాతానికి పరిమితమైందని కేంద్ర గణాంకాల శాఖ(ఎన్‌ఎస్‌ఓ) తాజాగా విడుదల చేసిన లెక్కలు స్పష్టపరిచాయి.
ఈ లెక్కలను లోతుగా అధ్యయనం చేస్తే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. ఉపాధి రహిత భారతంలో ప్రజల ఆదాయం రోజురోజుకూ తగ్గిపోతోంది. దానికి తోడు ఆకాశాన్ని తాకుతున్న అధిక ధరలతో సామన్యుల కొనుగోలు శక్తి చాలావరకు పడిపోయింది. ఈ కారణాలతో దేశంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుబడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదంలో పడే అవకాశం వుంది. మన పాలకులు దేశాన్ని మతతత్వ రాజ్యంగా మార్చడానికి పడుతున్న తపనలో ఒక్కశాతమైనా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంపై పెట్టి ఉంటే కచ్చితంగా పరిస్థితి ఇలా ఉండేది కాదు.అయినా కార్పొరేట్లకు దాసోహమైన మోడీ పాలనలో పేదల బాగు చూడడం జరిగే పని కాదనేది క్రమంగా అర్థమవుతోంది.
ప్రస్తుతం దేశంలో ప్రధాన రంగాలన్నీ ఉత్పత్తిలో వెనుకబడిపోయాయి. కోవిడ్‌ తర్వాత ఇంతతక్కువ వృద్ధి నమోదు కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. అంటే ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. గడిచిన ఆర్థిక ఏడాదిలో ముఖ్యంగా తయారీ రంగం అత్యంత పేలవంగా ఉంది. ఇక 2024-25 ఆర్థిక ఏడాది చివరి నెలలోనూ పారిశ్రామికోత్పత్తిలో పెద్ద పురోగతి కానరాలేదు. ఇటీవల స్వల్ప పెరుగుదల కనిపించే సరికి పాలకులు సంకలు గుద్దుకున్నారు. కానీ ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సరిపోదని గుర్తించాలి.
2025 మార్చిలో తయారీ రంగం సగానికి పతనమై మూడు శాతంగా నమోదైంది. గనులు, విద్యుత్‌ రంగాలు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇక వాహనాలు, గృహోపకరణాల లాంటి కన్స్యూమర్‌ డ్యూరెబుల్స్‌ ఉత్పత్తి సైతం మందగించింది. దేశవ్యాప్తంగా సాధరణ వస్తువుల కొనుగోలుకు ప్రజానీకం తటపటాయించే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఎన్‌ఎస్‌ఓ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాస్మోటిక్స్‌, ఆహారం, పానీయాలు, పెట్రోల్‌, డీజిల్‌, బట్టలు, చెప్పులు వంటి సరుకుల ఉత్పత్తి 2.1 శాతానికి పడిపోవడం దీనికి నిదర్శనం. రోజువారీ అవసరాల్లో అత్యంత సాధారణమైన వీటి వినియోగానికి కూడా ప్రజలు వెనకాడుతున్నారంటే ఇది దేశ ఆర్థిక తిరోగమనానికి కాకపోతే ఇక దేనికి సంకేతమో పాలకులే చెప్పాలి. దీనికితోడు ఇటీవల అమెరికా పెంచిన టారిఫ్‌లతో దేశంలోని టెక్స్‌టైల్స్‌, ఆభరణాలు, కెమికల్స్‌ రంగాల ఎగుమతులు పడిపోయి భవిష్యత్తులో వీటి ఉత్పత్తీ తగ్గనుంది. ఇది కూడా ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం చూపబోతోంది.
బడ్జెట్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వ అట్టహాస ప్రకటనల నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ ఏడాది ప్రారంభంలో భారీ అంచనాలు వ్యక్తం చేశాయి. వీరి అంచనాలకు తగ్గట్టు జనవరిలో వృద్ధి కాస్త ప్రారంభమైనట్టు కనిపించినప్పటికీ రెండు నెలల కాలంలోనే భారిగా పతనం కావడం గమనార్హం. దేశంలో నెలసరి వేతన జీవులకు, స్వయం ఉపాధి కార్మికులకు గత ఐదేండ్లలో నిజ వేతనాలు దిగజారిపోయాయని అనేక లెక్కలు చెబుతున్నాయి. 22 కోట్ల ప్రజల దినసరి ఆదాయం కేవలం రూ.300. మోడీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో క్షేత్రస్థాయి దినసరి కనీస వేతనం రూ.78 ఇస్తే చాలని ఉంది. ఇలాంటి విధానాల కారణంగానే దేశ ప్రజల కొనుగోలుపై పెట్టే ఖర్చుగానీ, పొదుపుగానీ తగ్గిపోయింది. ప్రజల ఆర్థిక పరిస్థితి ఇంతటి దయనీయంగా ఉంటే పారిశ్రామికాభివృద్ధి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా బలోపేతం అవుతుందో ఏలికలకే ఎరుక!
ఏది ఏమైనా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దేశంలో ఉత్పత్తులకు డిమాండ్‌ సన్నగిల్లిందనేది వాస్తవం. లెక్కలు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం చూప డమే కాకుండా.. మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనానికి దారి తీయడం ఖాయం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ధరలను అదుపు చేయడం, ఉపాధి అవకాశాలు పెంచడంపై పాలకులు దృష్టి పెట్టాలి. ఇదే ఈ సమస్యకు ఉన్న మార్గమని నిపుణులు పదే పదే చెబుతూనే ఉన్నారు. తద్వారా మాత్రమే వస్తు ఉత్పత్తికి డిమాండ్‌ పెరుగుతుంది. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తి, దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుంది. అయితే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మోడీ వల్లెవేస్తున్న ‘వికసిత్‌ భారత్‌’ మాటల్లోనే ఉంది, చేతల్లో కనిపించడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img