నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని 700, 107 సర్వేనెంబర్ లలో పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించడంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 29న భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ తెలిపారు. గురువారం గుడిస వాసులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు నాలుగు నెలల క్రితం గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. భువనగిరి ఆర్డిఓ తహసిల్దార్ పోలీసుల సమక్షంలో నెలరోజుల్లో సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఆ స్థలాన్ని సర్వే చేసి నెల 15 రోజులు అవుతున్నా ఇంతవరకు స్థలాలు చూపించడం లేదన్నారు. అట్టి స్థలంలో 100 గజాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి సర్వే చేసి అందరికీ ఇల్లు మంజూరు చేసి కట్టివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యవర్గ సభ్యురాలు కల్లూరు నాగమణి, పట్టణ నాయకులు వోల్దాస్ అంజయ్య, గుడిసె వాసుల సంఘం నాయకులు పిట్టల చంద్రశేఖర్, నాగరాజు, లింగం, కళమ్మ, నాగలక్ష్మి, రేణుక, సుజాత, అనిత పాల్గొన్నారు.



