Thursday, December 11, 2025
E-PAPER
Homeజాతీయంపరిమాణం తక్కువే అయినా విలువ ఎక్కువే

పరిమాణం తక్కువే అయినా విలువ ఎక్కువే

- Advertisement -

బియ్యం ఎగుమతులపై ట్రంప్‌ హెచ్చరిక ప్రభావం
న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనపు సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మన బియ్యంపై దృష్టి సారించారు. అమెరికాకు భారత్‌ నుంచి చౌకగా దిగుమతి అవుతున్న బియ్యంపై టారిఫ్‌ విధించే విషయాన్ని పరిశీలిస్తానంటూ ఆయన బాంబు పేల్చారు. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయిన సమయంలో ట్రంప్‌ ఈ బెదిరింపులకు దిగడం గమనార్హం. దీంతో అమెరికాకు భారత్‌ నుంచి కొనసాగుతున్న బియ్యం ఎగుమతులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న పలు వస్తువులపై ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్‌ యాభై శాతం వరకూ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ చేపట్టిన ఆ వాణిజ్య చర్యల కారణంగా బియ్యంపై సుంకాలు ఇప్పటికే పెరిగాయి.

పతనమవుతున్న వాటాల విలువ
ట్రంప్‌ తాజా ప్రకటన నేపథ్యంలో మన దేశం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ప్రముఖ సంస్థల వాటాల విలువ బాగా పడిపోయింది. ఎల్టీ ఫుడ్‌ సంస్థ రాయల్‌, దావత్‌ బ్రాండ్ల పేరుతో ఉత్తర అమెరికాకు బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ట్రంప్‌ ప్రకటన తర్వాత ఆ సంస్థ వాటా విలువ ఆరున్నర శాతం పడిపోయింది. కోహినూర్‌ ఫుడ్స్‌ సంస్థ వాటా విలువ 9.9 శాతం పతనమైంది. ఇండియా గేట్‌ బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కేఆర్‌బీఎల్‌ సంస్థ వాటా విలువ 1.14-2.7 శాతం మధ్య పడిపోయింది. తమపై ట్రంప్‌ విధించిన సుంకాల భారాన్ని ఆయా కంపెనీలు సహజంగానే అమెరికాలోని వినియోగ దారులపై మోపుతాయి. ఫలితంగా అక్కడి వినియోగదారులు అధిక రేటుతో మన బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం తక్కువ ధర ఉన్న బాస్మతియేతర బియ్యాన్నే లక్ష్యంగా చేసుకొని డంపింగ్‌ నిరోధక సుంకాలు విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే సాధారణ రకాలను ఎగుమతి చేసే వారి పైనే సుంకాల ప్రభావం ఉంటుంది.

బాస్మతి ఎగుమతులే అధికం
బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ప్రపంచ దేశాలలో మనదే అగ్రస్థానం. ప్రపంచ బియ్యం వ్యాపారంలో భారత్‌ వాటా 40 శాతానికి పైగా ఉంది. అమెరికా ప్రస్తుతం బాస్మతి వంటి అధిక ధర కలిగిన బియ్యం రకాలనే మన దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచ దేశాలకు భారత్‌ ఎగుమతి చేస్తున్న బియ్యం పరిమాణంలో అమెరికా వాటా కేవలం రెండు శాతమే. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే మన దేశం బాస్మతి బియ్యానికి నాలుగో అతి పెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యం విలువలో బాస్మతిది ఎనభై ఐదు శాతం వరకూ ఉంది.

పరిమాణం తక్కువే అయినా…
మన బియ్యాన్ని మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్‌ దేశాలు అతి పెద్ద కొనుగోలుదారులు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి ప్రపంచ దేశాలకు 20.1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. ఇందులో అమెరికా మార్కెట్‌ వాటా 3.34 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ట్రంప్‌ హెచ్చరికలపై భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్‌ఈఎఫ్‌) ఉపాధ్యక్షుడు దేవ్‌ గార్గ్‌ స్పందిస్తూ మన బియ్యం ఎగుమతుల మార్కెట్‌ ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుంటుందని, అంతర్జాతీయంగా పోటీ పడే సత్తా దానికి ఉన్నదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి అమెరికాకు 337.10 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతి అయింది. బాస్మతి ఎగుమతులకు అమెరికా నాలుగో అతి పెద్ద మార్కెట్‌గా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతి అయిన బాస్మతియేతర బియ్యం రకాల విలువ 54.64 మిలియన్‌ డాలర్లు మాత్రమే. అమెరికాలో పండిస్తున్న బియ్యం భారతీయ బియ్యానికి ప్రత్యామ్నాయం కాజాలదని, అమెరికా రకాలు గల్ఫ్‌, దక్షిణాసియా ప్రాంతాల సంప్రదాయ వంటకాల అవసరాలను తీర్చలేవని ఐఆర్‌ఈఎఫ్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -