నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం గాలికుంటు (ఫుట్ అండ్ మౌత్) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి పశువులకు టీకాలు వేశారు.
ఈ సందర్భంగా రైతులు, పశుపోషకులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. టీకాలు వేయించుకోకపోతే పశువులకు కలిగే నష్టాలను వివరించారు. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి 50 నుంచి 80 శాతం వరకు తగ్గిపోతుందని, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోతుందని తెలిపారు. అలాగే నోరు, నాలుక, పెదవులపై పుండ్లు రావడం వల్ల పశువులు ఆహారం తినలేక బలహీనపడతాయని చెప్పారు.
అదేవిధంగా కాళ్లలో పుండ్లు రావడం వల్ల పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయని, చిన్న దూడలకు ఈ వ్యాధి చాలా ప్రమాదకరమై హృదయ సంబంధిత సమస్యలతో అకస్మాత్తుగా మరణించే ప్రమాదం ఉంటుందని వివరించారు. ఒక పశువుకు వ్యాధి సోకితే గొలుసులో ఉన్న మిగతా పశువులకు కూడా వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి తగ్గడం, చికిత్స ఖర్చులు పెరగడం వల్ల రైతులకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొత్తం 50 గేదెలకు, 35 గోజాతి పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్, డాక్టర్ ధీరజ్, పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, కిషన్, సుల్తానాబేగం పాల్గొన్నారు.



