Friday, January 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం'స్మార్ట్‌'గా సేద్యం

‘స్మార్ట్‌’గా సేద్యం

- Advertisement -

ఆధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్న చైనా
శాస్త్ర-సాంకేతిక పురోగతి వాటా 64శాతం దాటింది : చైనా వ్యవసాయ శాఖ

బీజింగ్‌ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవటంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు దానిని వ్యవసాయంలోనూ మరింత ప్రభావవంతంగా ఉపయోగిస్తున్నది. 2025లో చైనా వ్యవసాయ ఆధునీకరణ గణనీయంగా వేగం పుంజుకున్నది. వ్యవసాయ ఉత్పత్తిలో శాస్త్ర-సాంకేతిక పురోగతి వాటా 64 శాతం దాటింది. చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉప మంత్రి జాంగ్‌ జింగ్‌వాంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశీయ విత్తన పరిశ్రమకు బలమైన ఊతం
దేశంలో విత్తన పరిశ్రమ పునరుజ్జీవన చర్యలు స్థిరంగా ముందుకు సాగుతున్నాయని జాంగ్‌ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన పంట రకాలతో సాగు చేస్తున్న విస్తీర్ణం 95 శాతం దాటిందని వివరించారు. పలు రంగాల్లో దేశీయ విత్తనాల మార్కెట్‌ వాటా గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇది పశుపోషణ, కోళ్ల పెంపెకం (80 శాతం), అక్వాటిక్‌ ప్రొడక్ట్స్‌ (86 శాతం), కూరగాయలు (91 శాతం) వంటి రంగాల్లో చక్కని పెరుగుదలను నమోదు చేసిందని ఆయన చెప్పారు.

మూడు లక్షలకు పైగా డ్రోన్లు
వ్యవసాయ యంత్రాల పరిశోధన, అభివృద్ధి, వినియోగం వేగంగా పెరుగుతోందని చైనాలోని అధికారులు తెలిపారు. పంటల సాగు, నాట్లు, కోతల్లో సమగ్ర యాంత్రీకరణ రేటు 76.7 శాతానికి చేరింది. ప్రస్తుతం చైనాలో మూడు లక్షలకు పైగా వ్యవసాయ డ్రోన్లు ఉన్నాయని వెల్లడించారు. ఏడాదికి సుమారు 3.06 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో డ్రోన్ల ద్వారా కార్యకలాపాలు నడుస్తున్నాయని చెప్పారు.

ఏఐ+అగ్రికల్చర్‌
అగ్రశ్రేణి పరిశోధనల్లో భాగంగా ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)+వ్యవసాయం (అగ్రికల్చర్‌)’ అమలు వేగవంతమైందని అధికారులు తెలిపారు. స్మార్ట్‌ అగ్రికల్చర్‌కు సంబంధించిన పెద్ద ఏఐ మోడళ్లను నిరంతరం అభివృద్ధి చేస్తూ, క్షేత్రస్థాయిలో వినియోగంలోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు.

కొత్త ఇంధన యంత్రాలు, రోబోల వినియోగం
ఇక కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో సరైన వ్యవసాయ యంత్రాలు లభించకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు కొత్త ఇంధనంతో పని చేసే వ్యవసాయ యంత్రాల పరిశోధనలో గణనీయమైన పురోగతి సాధించామని అధికారులు చెప్పారు. వ్యవసాయ రోబోల అభివృద్ధి, వినియోగం కూడా పుంజుకుంటోందోని వివరించారు. ఈ రంగంలో ఆశించిన విజయాలు దశలవారీగా సాధ్యమవుతున్నాయని చెప్పారు. ”ఆధునిక సాంకేతికతలు వ్యవసాయ రంగంలో మరింత విస్తృతంగా ఉపయోగంలోకి వస్తున్నాయి. డ్రోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోలు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలను మరింత విస్తరించి, వ్యవసాయ ఉత్పత్తిని కచ్చితమైనదిగా, సమర్థవంతమైనదిగా మార్చడమే మా లక్ష్యం” అని వ్యవసాయ శాఖ ఉప మంత్రి జాంగ్‌ తెలిపారు.

శాస్త్రవేత్తల కీలక పరిశోధనలు
వ్యవసాయ మంత్రిత్వ శాఖ శాస్త్ర-సాంకేతిక విభాగ అధికారి జౌ యున్‌ లాంగ్‌ మాట్లాడుతూ.. ఒకే ఒక్క శరీర కణం (సోమాటిక్‌ సెల్‌) పూర్తి మొక్కగా మారే ప్రక్రియపై శాస్త్రవేత్తలు కీలక రహస్యాన్ని ఛేదించారని తెలిపారు. ఇది పంటల జన్యు మెరుగుదలకు, సమర్థవంతమైన పునరుత్పత్తికి కొత్త సిద్ధాంత ఆధారాలను అందిస్తుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -