వాటితో ప్రజలపై పెను భారం
ప్రజా వ్యతిరేక విద్యుత్ సంస్కరణలపై పోరాటం :
బషీర్‌బాగ్ అమరవీరుల సంస్మరణ సభలో బీవీ రాఘవులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కార్పొరేట్ లాభాల కోసమే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. స్మార్ట్ మీటర్లతో ప్రజలపై పెనుభారం పడనుందన్నారు. బషీర్‌బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విద్యుత్ సంస్కరణలపై పోరాటాన్ని నిర్మించాలన్నారు. గురువారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో బషీర్‌బాగ్ కాల్పుల ఘటన అమరులకు సీపీఐ(ఎం) నేతలు నివాళులర్పించారు. అమరవీరులు బాలస్వామి, రామకష్ణ, విష్ణువర్థన్ రెడ్డి చిత్ర పటాలకు పూలమాలలేసి స్మరించుకున్నారు. అనంతరం బీవీ రాఘవులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారన్నారు. ప్రపంచ బ్యాంకు షరతుల ఒత్తిడితో ప్రజా వ్యతిరేక విద్యుత్ రంగ సంస్కరణలను విధించడానికి ప్రయత్నించిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో బషీర్‌బాగ్ కాల్పులు జరిగాయన్నారు. ప్రజల ప్రతిఘటనను అణచివేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో క్రూరత్వాన్ని ఆయన గుర్తుచేశారు. నయా ఉదారవాద సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పెద్ద ప్రతిఘటనలో ఈ ఉద్యమం ఎలా భాగమైందో గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ రైతు ఉద్యమాన్ని సైతం గుర్తుచేసుకున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు తీసుకువచ్చిన చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంభరించుకునేలా చేసిన లక్షలాది మంది రైతుల పోరాటాన్ని వివరించారు. నేడు విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లను విధించడంతో కార్పొరేట్ ఆధారిత ఎజెండాను తిరిగి ప్రవేశపెడుతున్నారని, ఇది ప్రజలపై మరింత భారం పడుతుందని వివరించారు. బషీర్ బాగ్ అమరవీరుల నుంచి స్ఫూర్తి పొందుతూ సామాజిక న్యాయం, విద్యుత్, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటాల్లో సీపీఐ(ఎం) తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు. మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) సీనియర్ నేత పి. మధు మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణలో అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్‌కుమార్, పార్టీ నాయకులు ఎం. సాయిబాబు, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తెలుగు రాష్ట్రాల సీపీఐ(ఎం) నాయకులు వై.వి. రావు, ఎన్. నర్సింహారెడ్డి, పి. మురళీ కృష్ణ, రామరాజు, స్వరూపరాణి, సోమయ్య, దయాకర్ రెడ్డి, సీఐటీయూ నాయకులు క్లింట్ పాల్గొన్నారు.
కార్పొరేట్ లాభాల కోసమే స్మార్ట్ మీటర్లు
- Advertisement -
- Advertisement -