– నాదెండ్ల మనోహర్
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్‌కార్డులను రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక శాసనసభ్యులు, జిల్లా స్ధాయిలో మంత్రులు, రాష్ట్ర స్ధాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి ఈ స్మార్టుకార్డులను పంపిణీచేయనున్నట్లు ఆయన చెప్పారు. 96.05 శాతం మేర రేషన్ కార్డుల ఇకెవైసిని పూర్తి చేసి దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులకు ఇప్పటి వరకు 16,08,612 దరకాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందన్నారు. కేవలం 4.72శాతం దరఖాస్తులను మాత్రమే తిరస్కరించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా నూతనంగా 9,87,644మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, వీరితో కలుపుకుని లబ్దిదారుల సంఖ్య 4,29,79,897కి చేరిందన్నారు. వీరొలో 2,68,23,200మందికి కేంద్రప్రభుత్వం, 1,61,56,697మందికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత రేషన్‌కార్డుల స్ధానంలో డిజిటలైజ్డ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందన్నారు. భద్రత, జవాబుదారీ తనంతో పారదర్శకతతో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలో ఈ స్మార్ట్ కార్డులను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఎవరివీ ఉండవన్నారు. కుటుంబ పెద్దఫోటోతో పాటు సభ్యుల పేర్లు పొందుపరిచినట్లు తెలిపారు.
ఏపీలో ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
- Advertisement -
- Advertisement -