Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్మార్ట్‌ ఫోన్ల వినియోగం పిల్లల భవిష్యత్‌కు ముప్పు

స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పిల్లల భవిష్యత్‌కు ముప్పు

- Advertisement -

హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

వేసవి సెలవుల వేళ పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియా, స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరిగితే వారి భవిష్యత్‌కు ముప్పుగా మారుతుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువుగట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం ఉండేదని, నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్‌ ఫోన్‌ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరమని అన్నారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగమై పిల్లలకు సమయాన్ని కేటాయించలేకపోవడం వల్లే వారు డిజిటల్‌ మాయాజాలంలో చిక్కుకుంటున్నారని అన్నారు. దీనివల్ల పిల్లలు తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారని తెలిపారు. పిల్లలు సోషల్‌ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రీల్స్‌ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారని చెప్పారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల నగరంలో వెలుగులోకి వస్తున్నాయని, ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయని అన్నారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో వారికి కొండంత భరోసానిస్తూ, ప్రతి కదలికనూ గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు. తల్లిదండ్రుల అప్రమత్తతే బిడ్డల బంగారు భవిష్యత్‌కు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -