పెరగనున్న టీవి, ల్యాప్‌టాప్ ధరలు
చిప్స్‌కు డిమాండ్ ప్రభావం
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. స్మార్ట్‌ఫోన్, టివి, ల్యాప్‌టాప్ తదితర ఉత్పత్తుల ధరలు వచ్చే రెండు నెలల్లో భారీగా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి మెమొరీ చిప్స్‌కు భారీగా డిమాండే పెరగడమే ఇందుకు కారణం. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు పెరిగాయి. టెలివిజన్ (టివి) కంపెనీలు కూడా ధరలు పెంచే కసరత్తులో ఉన్నాయని ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచురించింది. 2025 డిసెంబర్ త్రైమాసికంలో మెమొరీ చిప్స్ ధరలు ఏకంగా 50 శాతం మేరకు ఎగిశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో మరో 40-50 శాతం పెంపు ఉంటుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది.
ఏప్రిల్-జూన్‌లో మరో 20 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేసింది. ‘వివో, నథింగ్ వంటి సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్ ధరలను రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పెంచాయి. సామ్‌సంగ్ వంటి కంపెనీలు పరోక్షంగా ఖర్చులు తగ్గించుకోవడానికి క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను నిలిపివేశాయి. మెమొరీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఆ మేరకు ధరల పెంపు చేపట్టవచ్చు.’ అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పథక్ పేర్కొన్నారు. మెమరీ చిప్‌ల ధరలు 2026లో మరియు ఆ తర్వాతి ఏడాది కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఆవిష్కరించే ఫోన్‌లలో ఆయా కంపెనీలు ఈ ధరల పెరుగుదలను సర్దుబాటు చేసినప్పటికీ.. ధర పెంచకుండా ఉండటానికి డిస్‌ప్లే వంటి ఇతర భాగాల నాణ్యతలో కంపెనీలు రాజీ పడవచ్చని తరుణ్ తెలిపారు.
రిపబ్లిక్‌డే డిస్కౌంట్‌లు తగ్గొచ్చూ..
‘మెమరీ చిప్‌ల సరఫరా ఒక సవాలుగా మారిందని ఫోన్ తయారీదారులు చెబుతున్నారు. కోడాక్, థామ్సన్, బ్లౌపంక్ట్ బ్రాండ్‌ల పేర్లతో టెలివిజన్‌లను విక్రయించే ‘సూపర్ ప్లాస్ట్రానిక్స్ సంస్థ తమకు అవసరమైన మెమరీ చిప్‌ల ఆర్డర్లలో ప్రస్తుతం కేవలం పదో వంతు మాత్రమే పొందగలుగుతోందని ఫోన్ తయారీదారులు పేర్కొంటున్నారు. ”మేము నవంబర్‌లో ధరలను 7 శాతం పెంచాము, ఈ నెలలో మరో 10 శాతం పెంచుతున్నాము. ఫిబ్రవరిలో ఇంకొక 4 శాతం పెంచాలని ప్లాన్ చేస్తున్నాము. నిజానికి, రాబోయే రిపబ్లిక్ డే సేల్స్‌లో డిస్కౌంట్లు గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉంటాయి.” అని సూపర్ ప్లాస్టోనిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవ్‌నీత్ సింగ్ మార్హా పేర్కొన్నారు. త్వరలో తాము విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచనున్నట్లు నథింగ్ సిఇఒ కార్ల్ పై ఇప్పటికే ప్రకటించారు. మరిన్ని బ్రాండ్లు ఇదే బాటలో నడవనున్నాయన్నారు.
స్మార్ట్‌ఫోన్స్ ధరలు 30 శాతం పెరగొచ్చు..
నవంబర్ – డిసెంబర్ నెలల్లో స్మార్ట్‌ఫోన్ ధరలు కనిష్ఠంగా 3 శాతం నుంచి 21 శాతం మేర పెరిగాయని.. రాబోయే రోజుల్లో మరో 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ పేర్కొంది. మెమొరీ చిప్స్ కొరతనే ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ల్యాప్‌టాప్ ధరలు ఇప్పటికే 5-8 శాతం మేర పెరగ్గా.. మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నాయి. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. 4జిబి ఆర్‌డిఐఎంఎం(సర్వర్ గ్రేడ్ మెమరీ) ధరలు 2025 సెప్టెంబర్ త్రైమాసికంలో 255 డాలర్లు (సుమారు రూ.21,000) ఉండగా, డిసెంబర్ త్రైమాసికం నాటికి వీటి ధరలు 450 డాలర్లు (సుమారు రూ.37,500)కు పెరిగాయి. ఈ ధరలు 2026 మార్చి నాటికి 700 డాలర్లు (సుమారు రూ.58,000)కు చేరే అవకాశం ఉందని అంచనా.
స్మార్ట్‌ఫోన్‌లు మరింత ప్రియం…!
- Advertisement -
- Advertisement -



