Monday, November 17, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. ఈరోజు కూడా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) గాలి నాణ్యత ‘చాలా ప్రమాదకరం’ నుంచి ‘తీవ్ర’ స్థాయిలోనే కొనసాగుతోంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పివేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇవాళ‌ ఉదయం 6 గంటలకు ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 360గా నమోదైంది. అయితే, బవానా (427), జహంగీర్‌పురి (407), నరేలా (406) సహా ఆరు పర్యవేక్షణ కేంద్రాల్లో AQI 400 మార్కును దాటి ‘తీవ్ర’ కేటగిరీలో నమోదైంది. ఆనంద్ విహార్, చాందినీ చౌక్, ఐటీఓ వంటి అనేక ఇతర ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉంది.

ఈ తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు సోమవారం తిరిగి విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. పంట వ్యర్థాల దహనం, నిలకడగా ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల కాలుష్యం పెరుగుతున్నందున ఈ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ నెల‌ 12న జరిగిన గత విచారణలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలులో ఉన్నప్పటికీ గాలి నాణ్యత క్షీణించడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రమాదకర పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులు కొనసాగడంపై సీనియర్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ విషపూరిత గాలి శాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని, న్యాయవాదులు వర్చువల్ విచారణలకు హాజరు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -