Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయం'స్మార్ట్‌'గా తస్కరణ

‘స్మార్ట్‌’గా తస్కరణ

- Advertisement -

పౌరుల డేటా ప్రయివేటు చేతికి
డిజిటల్‌ సేవలతో కంపెనీలకు సమాచారం
యాప్‌లు రూపొందించేందుకు అందిస్తున్న నగర యంత్రాంగాలు
రూ.కోట్లలో ప్రజా ధనం వినియోగం
నిర్దిష్టమైన చట్టాలు లేకపోవటంతో ఈ దుస్థితి : సామాజికవేత్తల ఆందోళన

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ను తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వంద నగరాలను ఎంపిక చేసిన కేంద్రం.. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. నగరాల్లో మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సుందర నగరాలుగా తీర్చిదిద్దడం స్మార్ట్‌ సిటీ మిషన్‌ లక్ష్యం. ఈ పథకాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ ఇది ఆశించినంతస్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ పథకాన్ని ప్రారంభించి పదేండ్ల ముగిసింది. ఇప్పటికీ అనేక స్మార్ట్‌ నగరాలు ఆశించిన పురోగతిని, అభివృద్ధిని మాత్రం సాధించలేదు. పైగా ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ఆందోళన నెలకొన్నది. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ఉపయోగించిన ధనంతో సేకరించిన పౌరుల సమాచారం.. ప్రయివేటు కంపెనీల చేతులకు వెళ్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాప్‌లను రూపొందించటం కోసం నగరంలోని పౌరుల సమాచారాన్ని నగర పాలక యంత్రాంగాలు ప్రయివేటు కంపెనీలకు అందిస్తున్నాయి. ఈ డేటాను ఉపయోగించి కంపెనీలు యాప్‌లను తయారు చేస్తున్నాయి. గోప్యంగా ఉండాల్సిన పౌరులకు సంబంధించిన సున్నితమైన సమాచారం సదరు కంపెనీలు వాడుకుంటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల ఇష్టాలు, అలవాట్లు, ఆస్తుల వివరాలు వంటి ప్రతీ ఒక్క సమాచారం ప్రయివేటు కంపెనీలకు అందుతున్నది. ఉదాహరణకు.. భువనేశ్వర్‌లో బస్‌ డేటాను ఒక ప్రయివేటు కంపెనీకు అందించారు. ఆ తర్వాత ఆ కంపెనీ టికెటింగ్‌ యాప్‌ను రూపొందించింది.

పేలవంగా డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ అమలు
స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ ఒక కీలక భాగం. కానీ దీని అమలు అత్యంత పేలవంగా ఉన్నదని ఆరోపణలున్నాయి. సున్నితమైన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రయివేటు కంపెనీలకు అప్పగించటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని సామాజికవేత్తలు చెప్తున్నారు. ఒక నిర్దిష్టమైన చట్టం, విధానం వంటివి లేని కారణంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వివరిస్తున్నారు. ఈ విషయంలో స్పష్టమైన, పటిష్టమైన విధానం అవసరమనీ, లేకపోతే పౌరులకు సంబంధించిన ప్రతీ సమాచారం ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తుందనీ, అవి తమ వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే అవకాశమున్నదని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్తున్నారు.

స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా స్థానిక ప్రజలకు సర్టిపికెట్లు, ధృవీకరణ పత్రాలను నేరుగా అందించటంలో యాప్‌లు డేటాను ఉపయోగిస్తాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఆస్తి పన్నుల సేకరణ, యాప్‌ సేవల బిల్లింగ్‌లతో మునిసిపల్‌ ఆదాయాలను మెరుగుపర్చవ్చని ఈ మిషన్‌ సూచిస్తుంది. అలాగే ప్రజా రవాణా, ట్రాఫిక్‌ నియంత్రణ, వ్యర్థాల సేకరణ వంటి సేవలు డేటా విశ్లేషణ, ఆటోమేషన్‌ నుంచి ఎంతో ప్రయోజనం పొందవచ్చనే ఆలోచనను ఇది సమర్థించింది. ఈ లక్ష్యం దిశగా.. బెంగళూరు, భువనేశ్వర్‌, భోపాల్‌, సూరత్‌ వంటి నగరాలు ప్రజా రవాణా, ట్రాఫిక్‌, కొన్ని సందర్భాల్లో ఘన వ్యర్థాలపై డేటాను సేకరించటానికి వివిధ రకాల సెన్సార్లు, నెట్‌వర్క్‌లు, డేటాబేస్‌లను ఏర్పాటు చేశాయి. ఈ మిషన్‌ కోసం ఎంపిక చేసిన వంద నగరాల్లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లలోని సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగల్స్‌, వాటర్‌ సప్లై సెన్సార్స్‌, విద్యుత్‌ మీటర్లు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ వంటి డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఇవి పౌరుల సమాచారాన్ని సేకరించగలవు. ఇలా సేకరించిన సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ ద్వారా విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ ఆధారంగా నగర సేవలను మెరుగుపర్చటం వంటివి చేస్తారు.
అయితే పట్టణ పాలన (అర్బన్‌ గవర్నెన్స్‌)ను ప్రయివేటీకరణ చేయడానికి ప్రభుత్వ నిధులతో కూడిన మౌలిక సదుపాయాలు, డేటాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో పలు లోపాలు ఉన్నప్పటికీ.. డేటా ఆధారిత పాలన (డేటా బేస్డ్‌ గవర్నెన్స్‌), యాప్‌లు కొత్త పట్టణ కార్యక్రమాల్లో కీలకంగా మారాయి. 2021లో నేషనల్‌ అర్బన్‌ డిజిటల్‌ మిషన్‌ ‘ఉప్‌యోగ్‌’ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది దేశంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పౌరులకు ధృవపత్రాలు, సేవలను అందించటానికి ఉద్దేశించింది.

ఈ ఏడాది ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాలకు ఆన్‌లైన్‌ టికెటింగ్‌, రూట్‌ ప్లానింగ్‌, వాహనాలను ట్రాకింగ్‌ చేయటమే లక్ష్యంగా పబ్లిక్‌ మొబిలిటీ యాప్‌లను తీసుకురావటానికి ట్రాన్స్‌పోర్ట్‌ స్టాక్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద నిధులు అందుకున్న అనేక నగరాలు పౌరుల రికార్డులు, ఆస్తి సమాచారాన్ని డిజిటలైజ్‌ చేయటం పూర్తి చేశాయి. పౌరులు మున్సిపల్‌ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే సర్టిఫికేషన్‌లు, లైసెన్స్‌లు, పన్ను వసూలును ఆన్‌లైన్‌లో పొందేందుకు ఏకీకృత యాప్‌లను తీసుకొచ్చాయి. అయితే స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో కీలకమైన ఈ డిజిటల్‌ సేవలు ఎంత వరకు భద్రమో ప్రభుత్వాలే సమాధానం చెప్పాలని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -