Wednesday, October 8, 2025
E-PAPER
Homeమానవిఇంట్లో చిరుతిళ్లు ఎంతో ముఖ్యం

ఇంట్లో చిరుతిళ్లు ఎంతో ముఖ్యం

- Advertisement -

మనం పెద్దగా పట్టించుకోముగానీ పిల్లలు తరచుగా దుకాణాల్లోని జంక్‌ ఫుడ్‌ ఎక్కువగానే ఖాళీ చేసేస్తుంటారు. దీనివల్ల పెద్దలు డబ్బు, పిల్లలు ఆరోగ్యం కోల్పోతుంటారు. అందుకే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం పిల్లలు దుకాణం వైపు వేలు చూపించకముందే మీరు వారి చేతికి స్నాక్స్‌ అందివ్వాలి. అలాంటి వాటిలో రాగితో చేసినవి ఎంతో రుచిగా ఉంటాయి. రాగి ఫైబర్‌తో నిండి ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాగిలో ఉండే ఐరన్‌ శరీరంలో రక్తం తయారీకి సహాయపడుతుంది. కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. అలాంటి రాగులతో చేసే చిరుతిళ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం…

లడ్డూ
కావాల్సిన పదార్థాలు: పల్లీలు – కప్పు, పచ్చి కొబ్బరి – రెండు చెక్కలు, నెయ్యి – నాలుగు స్పూన్లు, రాగి పిండి – మూడు కప్పులు, బెల్లం – కప్పు, ఖర్జూరాలు – అర కప్పు, యాలకులు – నాలుగు, డ్రై ఫ్రూట్స్‌.
తయారీ విధానం: ముందుగా పల్లీలు ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద అదే పాన్‌ పెట్టి అందులో స్పూన్‌ నెయ్యి వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత తురుముకున్న పచ్చికొబ్బరిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిందనుకున్న తర్వాత మొత్తం ఒక బేసిన్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి పాన్‌ పెట్టుకొని అందులో స్పూన్‌ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత రాగి పిండి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కలిసిపోయేలా పిండిని గరిటతో కలుపుతూ ఉండాలి. పిండి కాస్త రంగు మారే వరకు వేయించి దించుకొని అందులో పల్లీ పొడి, కొబ్బరి తురుము కలపాలి. మరోసారి పాన్‌ స్టౌ మీద పెట్టుకొని స్పూన్‌ నెయ్యి వేసుకోవాలి. కరిగిన తర్వాత అందులో సన్నగా కట్‌ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే కిస్‌ మిస్‌ మాత్రం డ్రై నట్స్‌ వేగిన కాసేపటి తర్వాత అందులో వేయాలి. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా రాగిపిండిలో వేసుకొని గరిటతో కలుపుకోవాలి. చేత్తో పట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడే పిండిని చక్కగా మిక్స్‌ చేసుకొని లడ్డూలుగా తయారు చేసుకోవాలి. అంతే.. ఎంతో హెల్దీగా ఉండే రాగి పిండి లడ్డూలు సిద్ధమైపోతాయి. రాగుల్లో కావాల్సినంత ఐరన్‌ ఉంటుంది. ఇంకా బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు, డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఈ లడ్డూలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతుంటారు. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా రోజూ ఒకలడ్డూ తింటే చాలా మంచిది.

రొట్టె
కావల్సిన పదార్థాలు: రాగి పిండి – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఉల్లి తరుగు – కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్‌ – స్పూను, పచ్చిమిర్చి తరుగు – టేబుల్‌ స్పూను, అల్లం వెల్లుల్లి – స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర – చిన్న కట్ట, ఇంగువ – పావు టీ స్పూను, మెంతి ఆకులు – కట్ట లేదా ఏదైనా ఆకు కూర, పచ్చి శనగపప్పు – టేబుల్‌ స్పూను.
తయారీ విధానం: ఒక మిక్సింగ్‌ బౌల్‌లోకి పిండి తీసుకోవాలి. అందులోనే ఉప్పు, ఉల్లి తరుగు, చిల్లీ ఫ్లేక్స్‌, పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి తురుము, కరివేపాకు, కొత్తిమీర, పావు టీ స్పూన్‌ ఇంగువ కలపాలి. ఇపుడు మెంతి ఆకులు వేసుకోవాలి వాటి బదులు ఏదైనా మీకు నచ్చిన ఆకు కూర కూడా సన్నగా కట్‌ చేసుకుని కలపాలి. ఇపుడు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. పదిహేను నిమిషాలు పిండి నానబెట్టుకుని ఆ తర్వాత రొట్టెలు వత్తుకుని సన్నటి సెగపై కాల్చుకోవాలి. బటర్‌ పేపర్‌ లేదా తడి క్లాత్‌పై కాస్త పల్చగా వత్తుకుని పెనానికి కొద్దిగా నూనె రాసి రెండు వైపులా కాల్చుకుని తీసుకుంటే చాలు. ఈ రాగి రొట్టెలు బ్రేక్‌ ఫాస్ట్‌, ఈవెనింగ్‌ స్నాక్‌ లేదా డిన్నర్‌లోకి కూడా ఎంతో రుచిగా ఉంటాయి.

మురుకులు
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి-రెండు కప్పులు, బియ్యం పిండి-కప్పు, పుట్నాల పొడి- అర కప్పు, కారం-టీస్పూను, ఉప్పు- రుచికి సరిపడా, వాము-టీస్పూను, తెల్ల నువ్వులు- పావు కప్పు, చిటికెడు ఇంగువ, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై ఓ ప్యాన్‌ పెట్టి సన్నని మంటపై రాగి పిండిని వేయించుకోవాలి. తర్వాత రాగి పిండిని ఓ పెద్ద గిన్నెలో వేసుకోవాలి. రాగి పిండి, పుట్నాల పొడిని కలపాలి. నెయ్యిని ఓ ప్యాన్‌లో వేడి చేయాలి. వేడి చేసిన నెయ్యిని పిండిలో వేసి బాగా కలపాలి. పిండికి కారం, ఉప్పు, వాము, నువ్వులు, ఇంగువ వేసి బాగా కలపాలి. తగినంత నీళ్లు పోసి మృదువైన పిండి చేసుకోవాలి. మురుకుల గొట్టంలో పిండిని నింపి నూనెలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత వడకట్టి తీసి పెట్టుకోవాలి.

స్వీట్‌ బోండాలు
కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, రాగి పిండి – రెండు కప్పులు, గోధుమపిండి – మూడు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, ఉప్పు – చిటికెడు, బేకింగ్‌ సోడా – పావు టీస్పూను.
తయారీ విధానం: స్టవ్‌ ఆన్‌ చేసి పాన్‌ పెట్టి బెల్లం తురుము, నీరు పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సింగ్‌ బౌల్‌లోకి రాగి పిండిని జల్లించి తీసుకోవాలి. ఆపై అందులోకి బెల్లం నీటిని వడకట్టి పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. బెల్లం వాటర్‌ పిండిలో పూర్తిగా కలిసిన తర్వాత బైండింగ్‌ కోసం గోధుమపిండి యాడ్‌ చేసుకుని మరోసారి ఉండలు లేకుండా మిక్స్‌ చేసుకోవాలి. పిండి బోండాలు వేసుకునేందుకు సరిపడేలా కలుపుకోవాలి. చివరగా అందులో ఉప్పు, బేకింగ్‌ సోడా, యాలకుల పొడి వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు బీట్‌ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి కొద్దిసేపు పక్కనుంచాలి. ఈ లోపు స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్‌ కాగిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాల మాదిరి వేసుకోవాలి. కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండువైపులా గోల్డెన్‌ కలర్‌ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బోండాలు సరిగా వేగిన తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా కావాల్సినన్నీ బోండాలు వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి స్వీట్‌ బోండాలు రెడీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -