Tuesday, February 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో మంచు తుపాను బీభత్సం

అమెరికాలో మంచు తుపాను బీభత్సం

- Advertisement -

– విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో అంధకారం
– చీకట్లోనే 10 లక్షల మంది ప్రజలు
– 17 వేలకుపైగా విమానాలు రద్దు
– 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు ట్రంప్‌ అనుమతి
న్యూయార్క్‌:
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సష్టిస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్‌ అంతరాయాలూ తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. రాజధాని వాషింగ్టన్‌ డీసీ, టెక్సాస్‌, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లామా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. నివాసాలు, మౌలిక సదుపాయాలు, రహదారులు, చెట్లు ఇలా అన్ని మంచు దుప్పటి కప్పుకున్నాయి. భారీగా పేరుకుపోయిన మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దాదాపు లక్షల మందిపై ఈ తుపాను ప్రభావం పడింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ సరాఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. దీంతో దాదాపు పది లక్షల మంది ప్రజలు చీకట్లోనే జీవనం సాగిస్తున్నారని జాతీయ వాతావరణ సేవ-చీఔూ వెల్లడించింది. అత్యధికంగా టెన్నెస్సీలో 2 లక్షలా 90 వేల మంది, మిసిసిపి, టెక్సాస్‌, లూసియానాలలో చెరో లక్ష మందికి చొప్పున ప్రజలకు విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయిందని పేర్కొంది. కెంటకీ, జార్జియా, వర్జీనియా, అలబామా రాష్ట్రాల్లో కూడా విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించింది.

మంచు తొలగింపునకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు
మరోవైపు ఇండ్ల ముందు, రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణ్రోగ్రతలు తీవ్రంగా ఉన్నా ప్రజలు బయటకొచ్చి మరీ మంచులో ఆటలు ఆడుకుంటున్నారు. ఓక్లామా నగరంలో స్లైడింగ్‌ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే మంచు తుపాను నేపథ్యంలో ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయి ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు 20 రాష్ట్రాలకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమతినిచ్చారు. ఇప్పటికే కెంటకీ, వర్జీనియా, కాన్సస్‌, ఆర్కాన్సాస్‌, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి.

రాత్రివేళల్లో గడ్డకట్టే చలి : జాతీయ వాతావరణ సేవ హెచ్చరిక
అంతకుముందు జాతీయ వాతావరణ సేవ (ఎన్‌డబ్ల్యూఎస్‌) తూర్పు అమెరికా ప్రాంతాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని తూర్పు భాగం రెండు మూడు వంతు ప్రాంతాలను శీతకాల తుపాను కమ్మేస్తుందని వెల్లడించింది. ఉత్తర, మధ్య మైదానాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు ఉష్ణోగ్రతలు మైనస్‌ స్థాయికి పడిపోతాయని, గల్ఫ్‌ కోస్ట్‌ వరకూ రాత్రివేళ గడ్డకట్టే చలి ఉంటుందని అంచనా వేసింది.

17వేలకు పైగా విమానాలు రద్దు
మంచు తుపాను కారణంగా 17వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 8వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే శనివారం నాటి 3,200 విమాన సర్వీసులు, ఆదివారం నాటి 4,800 విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లైట్‌ అవేర్‌ వెల్లడించింది. మున్ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో పెద్దసంఖ్యలో రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడనుందని తెలిపింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -