ఐదేండ్లుగా కారాగారంలోనే..
న్యూఢిల్లీ : 2020 ఎల్గర్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో సామాజిక కార్యకర్త జ్యోతి జగతప్‌కి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ చంద్రశర్మ ప్రసాద్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. జ్యోతి జగతప్ గత ఐదేండ్లుగా జైలులోనే ఉన్నారని ఆమె తరపున సీనియర్ న్యాయవాదులు అపర్ణా భట్, కరిష్మా మరియాలు కోర్టుకు తెలిపారు. కబీర్ కళా మంచ్ (కేకేఎం) గ్రూపులో జ్యోతి జగతప్ చురుకుగా వ్యవహరిస్తున్నారని, 2017 డిసెంబర్ 31న పూణెలో జరిగిన ఎల్గార్ పరిషద్ సదస్సులో స్టేజీపై ప్రదర్శనివ్వడమే కాకుండా రెచ్చగొట్టే నినాదాలు చేశారని ఆరోపిస్తూ హైకోర్టు ఆమెకు గతంలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆమె ఉగ్రవాద చర్యకు కుట్రపన్నారని, యత్నించారని, సమర్థించారని, ప్రోత్సహించారంటూ ఎన్‌ఐఏ చేసిన ఆరోపణలు వాస్తవమనేందుకు సహేతుకమైన కారణాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త జ్యోతి జగతప్ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.



