ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ కుమారి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ కుమారి అన్నారు.ఆలేరు మండలం శారాజిపేట మండల ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు,మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఆసక్తి చూపకుండా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఆమె కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాాభివృద్ధికి ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ.. క్రమశిక్షణతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి విద్య ప్రాముఖ్యతను వివరించి, పాఠశాలల్లో చేరికలను పెంచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం జ్యోతి రాజ్, పిడి మధు, శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ చారి, నరేష్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



