నేటి నుంచి 10వరకు
సంఘీభావ నిధి వసూళ్లు : సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 6 నుంచి 15వరకు రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక వర్గ శ్రేణులు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా నేటి నుంచి పదో తేదీ వరకు సామాజిక ఉద్యమ నిధిని కార్మికుల నుండి వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదం లాంటి సామాజిక అంశాలు దేశంలో ప్రజల్ని, కార్మికవర్గాన్ని అనైక్యతకు గురిచేస్తున్నాయని తెలిపారు. కార్మికవర్గంలో సున్నితమైన ఈ అంశాలను దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. అన్నిరకాల దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాటమే సీఐటీయూ లక్ష్యమని తెలిపారు.వీటి నుంచి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సీఐటీయూ పని చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో పలు పరిశ్రమల్లో, విద్యాలయాల్లో, పని ప్రదేశాల్లో చాప కింద నీరులా కులవివక్ష కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీ ఉద్యోగులూ వివక్ష, దాడులకు గురవుతూనే ఉన్నారని తెలిపారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న లోపం వల్ల పదోన్నతులు దక్కడం లేదని పేర్కొన్నారు. దళిత ఉద్యోగులను రిజర్వేషన్ కేటగిరీ అంటూ చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో వివక్ష కొనసాగుతున్నదని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దళిత ఉద్యోగ, కార్మికులకు ఇండ్లు అద్దెకు ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని ప్రాంతాలు, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే అగ్రవర్ణ విద్యార్థులు తినకపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, కుల దురహంకార హత్యలు, సాంఘిక బహిష్కరణలు నిత్యకృత్యమయ్యాయని పేర్కొన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు.
15వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



