Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌లతో సామాజిక న్యాయం సమాధి

లేబర్‌ కోడ్‌లతో సామాజిక న్యాయం సమాధి

- Advertisement -

– 12న సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు పాల్గొనాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– వీబీ జీ ఆర్‌ ఏఎం-జీ పథకంతో పేదల గొంతుకలపై కత్తి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు తేవడం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దయ్యేవరకు జరిగే పోరాటంలో సామాజిక, ప్రజాసంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాలులో ఆదివారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా సామాజిక ప్రజాసంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అధ్యక్షత వహించి.. తొలుత తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం భూపాల్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్టడుగు వర్గాల కార్మికులను అణగదొక్కడానికి, పెట్టుబడిదారులకు లాభాలు దోచిపెట్టడానికి 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి సంఘం పెట్టుకునే స్వేచ్ఛను, కనీస వేతనం పొందే హక్కును తొలగించిందన్నారు. ఫిక్స్‌డ్‌ అగ్రిమెంట్‌ కార్మికులు మాత్రమే మిగలనున్నారని, యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికుల జీవితాలు ఆధారపడేలా లేబర్‌ కోడ్‌లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనుస్మృతి పునాదుల మీద మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను రూపొందించిందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నారని విమర్శించారు. 12న చేపట్టనున్న సమ్మె రాజ్యాంగ హక్కుల రక్షణకు తోడ్పడుతుందన్నారు.
టి.స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని, ఈ చట్టాన్ని నీరుగార్చడానికి బీజేపీ ప్రభుత్వం క్రమంగా బడ్జెట్‌ తగ్గిస్తూ.. పని దినాలు కుదిస్తూ పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. గాంధీని హత్య చేసిన గాడ్సే వారసులే నేడు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని హత్య చేశారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం దళితులు గిరిజనులు, పేదలకు ఒక వరం లాంటిదని చెప్పారు. ఈ చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వీబీజీఆర్‌ఏఎం-జీ బిల్లు తెచ్చారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా విత్తనాల ఉత్పత్తి రాష్ట్రాల పరిధిలోనే ఉందని, 2025 విత్తన బిల్లు తెచ్చి దానిని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడం ద్వారా విత్తన రైతుల పొట్టలు కొట్టిందన్నారు. ఒకే పార్లమెంటు సమావేశంలో గ్రామీణ, పట్టణ పేదలపై ముప్పేట దాడి చేసిన మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 12న చేపట్టే సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఫిబ్రవరి రెండు నుంచి ఐదు వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి.. 2న రాష్ట్ర రాజధానిలో జరిగే ఉపాధి హామీ పరిరక్షణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.ధర్మానాయక్‌, ఆర్‌.శ్రీరాంనాయక్‌, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్‌ కోల జనార్ధన్‌, డీపీ దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, తెలంగాణ విముక్తా చిరుతల కచ్చి బీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్మిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు బి.ముత్తయ్య, ఎల్‌ఐసీ రిటైర్డ్‌ ఉద్యోగి కృష్ణయ్య, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు కొమ్ము విజరు కుమార్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రకాష్‌, శరత్‌, నగర కార్యదర్శి బి.సుబ్బారావు, కెేవీపీఎస్‌ నాయకులు మల్లికార్జున్‌, ఆంజనేయులు, అనిల్‌, సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం దశరథ్‌, నగర నాయకులు జి.రాములు, తోటి మహేందర్‌, కె.రమేష్‌, గాయకుడు గోపి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -