బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రజలు ఆయనపై ప్రేమతో ”బాబు జీ” అని పిలుస్తారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషిచేసిన మహానుభావుడు. భారత పార్లమెంటులో నలభై ఏళష్ట్రaపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.
1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని చంద్వా గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్ చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొన్నారు. అణగారిన వర్గానికి చెందిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయనలో ఉన్న ధైర్యం, పట్టుదల వల్ల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.బాబుజీ చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందారు. ఆయన గ్రామ పాఠశాలలో చదువు ప్రారంభించి, తరువాత ఉన్నత విద్య కోసం బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. అక్కడ కూడా కుల వివక్షను ఎదుర్కొని తన విద్యను కొనసాగించారు. అనంతరం ఆయన యూనివర్సిటీ అఫ్ కలకత్తాలో చేరి ఉన్నత విద్యను పూర్తిచేశారు. విద్యార్థి దశలోనే ఆయన సమాజంపై అవగాహన పెంచుకొని దేశభక్తి భావనలు బలపరుచుకున్నారు. మహాత్మాగాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలను చైతన్యపరిచారు. అణగారిన వర్గాల సమస్యలను స్వాతంత్య్ర పోరాటంతో కలిపి ముందుకు తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత. సమానత్వం, న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాబు జగ్జీవన్ రామ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కార్మిక శాఖ, రవాణా కమ్యూనికేషన్ శాఖ, ఆహార, వ్యవసాయ శాఖ, రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. ఈ పదవుల్లో పనిచేసేటప్పుడు ఆయన ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు.1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ వార్ సమయంలో 1971 సమయంలో బాబుజీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సైన్యానికి ధైర్యం నింపుతూ దేశ రక్షణలో పాల్గొన్నారు.
1977-1979 కాలంలో భారత దేశ ఉప ప్రధానిగా సేవలందించారు. తరువాత మొరార్జీ దేశారు నాయకత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. ఈ కాలంలో దేశంలో ‘అత్యవసర’పరిస్థితి అనంతరం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమైన పని. బాబుజీ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. ప్రభుత్వ వ్యవస్థను బలపరచడంలో ఆయన కృషి ఎంతో గొప్పది. బాబుజీ సామాజిక సేవ, దళితుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేశారు. సమాన హక్కులు, విద్య, ఉపాధి అవకాశాల కోసం పోరాడారు. అణగారిన వర్గాలకు ప్రోత్సాహమిచ్చి, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేశారు.ఆయన నాయకత్వం వల్ల దళితులు, వెనుకబడిన వర్గాలకు కొత్త ఆశలు కలిగాయి. ఆయన్ను సామాజిక సంస్కర్తగా కూడా భావిస్తారు.కష్టపడి పనిచేయడం, ధైర్యం,పట్టుదల, సమానత్వ భావన, సేవా దృక్పథం నిజాయితీ గల లక్షణాలు ఆయన్ను ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి. బాబుజీ 1986 జూలై 6న మరణించారు. ఆయన మరణం భారతదేశానికి పెద్దలోటు. అయినప్పటికీ, ఆయన చేసిన సేవలు, ఆలోచనలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయి.ఆయన జీవితం మనకు కష్టపడితే ఏదైనా సాధ్యమని, సమాజానికి సేవ చేయడం గొప్ప ధర్మమని నేర్పుతుంది. ఈ సందర్భంగా బాబూజీని స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత.
-డా.ఎర్ర కనకరాజు, 9618555512
సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



