Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికా పెత్తనాన్ని నిలువరిస్తున్న సోషలిస్ట్‌ దేశాలు

అమెరికా పెత్తనాన్ని నిలువరిస్తున్న సోషలిస్ట్‌ దేశాలు

- Advertisement -

సదస్సులో ప్రముఖ పాత్రికేయులు ప్రబీర్‌ పురకాయస్థ
తిరుపతి :
ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని, అమెరికా పెత్తనాన్ని సోషలిస్ట్‌ దేశాలు నిలువరిస్తున్నాయని ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ తెలిపారు. అన్ని దేశాలలో డాలర్‌ పెత్తనం కొనసాగించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇక సాగవన్నారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభను పురస్కరించుకొని తిరుపతి యశోదనగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్‌ నండూరి ప్రసాద్‌రావు స్మారక సెమినార్‌లో భాగంగా ‘ప్రజాస్వామిక హక్కులపై దాడి’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పురకాయస్థ మాట్లాడుతూ.. ట్రంప్‌కు వ్యతిరేకంగా 70 దేశాలలో నిరసనలు తెలిపారన్నారు. తన అహంకారాన్ని తగ్గించుకొని చైనాతో అమెరికా చర్చలు జరిపిందని, చివరికి చైనా మాట అమెరికా వినక తప్పలేదన్నారు. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాల వల్ల కార్మిక హక్కులపై దాడి పెరుగుతోందని వివరించారు. అమెరికాకు కేంద్ర ప్రభుత్వం జూనియర్‌ భాగస్వామిగా మారిందని విమర్శించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బిజెపికి లొంగిపోయాయని విమర్శించారు. ఇదే వైఖరి కొనసాగితే నేపాల్‌, శ్రీలంకలో మాదిరి కార్మికవర్గం తిరగబడే రోజులు వస్తాయని, ఈ విషయాన్ని పాలకవర్గాలు గుర్తుపెట్టుకొని వ్యవహరించాలన్నారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని, టిటిడిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యతరగతి ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ కెఎన్‌ .ఎన్‌ ప్రసాద్‌ రావు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎస్‌. జయచంద్ర, టి.సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -