Wednesday, November 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిజయబాటలో న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు మమ్దానీ!

విజయబాటలో న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు మమ్దానీ!

- Advertisement -

భారతీయ కాలమానం ప్రకారం మంగళ వారం సాయంత్రం నాలుగున్నర గంటలకు న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. మనకు న్యూయార్క్‌ నగరానికి పదిన్నర గంటలు ఆలస్యంగా తెల్లవారుతుంది.పోలింగ్‌ ఉదయం ఆరుగంటలకు మొదలై రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. పోలింగ్‌కు కొద్ది గంటల ముందు వెల్లడైన సర్వేలన్నీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి సోషలిస్టును అని సగర్వంగా ప్రకటించుకున్న జోహ్రాన్‌ మమ్దానీ గెలుపు బాటలో ఉన్నట్లు ప్రకటించాయి. ఎమర్సన్‌ కాలేజి చివరి సర్వేలో జోహ్రాన్‌కు 50శాతం, సమీప ప్రత్యర్ధి ఆండ్రూ కుమోకు 25, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు 21శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో జరిగే ఎన్నికల సర్వేల్లో కూడా తేడాలు ఉంటాయి, అయితే ఎక్కువ భాగం వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ పూర్వరంగంలోనే నవంబరు ఒకటవ తేదీన జరిపిన మరొక సర్వే ప్రకారం జోహ్రాన్‌కు 41శాతం, కుమోకు 34శాతం, కర్టిస్‌కు 24శాతం మంది మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.అయితే ఇదే సంస్థ మూడవ తేదీన జరిపిన సర్వేలో మద్దతు శాతాలను వరుసగా 43.9 – 39.4- 15.5 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నది. బహుశా ఈ కారణంగానే స్వంత పార్టీని పక్కన పెట్టి ట్రంప్‌ స్వతంత్ర అభ్యర్ధి ముసుగులో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదారుకు మద్దతు ప్రకటించాడా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రకటిత సమయానికి ముందే 7,35,000 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో యువత ఎక్కువగా ఉన్నట్లు, అత్యధికులు జోహ్రాన్‌కే ఓటు వేసినట్లు మీడియా పేర్కొన్నది. యాభై సంవత్సరాల లోపు వయస్సున్న ఓటర్లలో 69శాతం మద్దతు ఇస్తున్నట్లు, ఆఫ్రో-అమెరికన్‌ ఓటర్ల మొగ్గు కూడా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువని, దీన్ని బట్టి ఓటర్లు ఎంత ఆసక్తిగా ఉన్నారో వెల్లడైందని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇప్పుటికే ఓటు వేసిన వారిలో 58శాతం మమ్దానీకి వేసినట్లు, వేయాల్సివారిలో 45శాతం మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. మొత్తం నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య 47లక్షలు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ పోటీ నుంచి మధ్యలో తప్పుకొని అదే పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి ఆండ్రూ కుమోకు మద్దతు ప్రకటించాడు.

జోహ్రాన్‌ గెలిస్తే ఆర్థిక, సామాజిక విపత్తు సంభవిస్తుందని, అతను గెలిస్తే తాను నిబంధనల మేరకు తప్ప అదనపు నిధులు విడుదల చేసేది లేదని, తన మద్దతు డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమోకు ఇస్తున్నట్లు సోమవారం రాత్రి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. కమ్యూనిస్టు జోహ్రాన్‌, చెడ్డ అభ్యర్థి కుమోలలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి గనుక తాను కుమోనే ఎందుకున్నట్లు చెప్పాడు.’వ్యక్తిగతంగా అతనంటే మీకు అభిమానం ఉందా లేదా అని కాదు, మరొక మార్గం లేదు గనుక కుమోను బలపరచాలి. మమ్దానీని ఓడించగలిగేది అతనే’ అని ట్రంప్‌ పేర్కొన్నాడు. ‘ఒక అధ్యక్షుడిగా అదనంగా నిధులు ఇవ్వటం కష్టం, ఎందుకంటే మీరు గనుక కమ్యూనిస్టును ఎన్నుకుంటే నగరానికి ఇచ్చే నిధులన్నింటినీ మీరు వృధా చేసినట్లే’ అని ఒక టివీలో ట్రంప్‌ చెప్పాడు. అంతేకాదు, ‘వేయి సంవత్సరాలుగా విఫల మైన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మమ్దానీ అనుసరిస్తున్నాడని’ అన్నాడు.జోహ్రాన్‌ అభ్యర్ధిగా ఎన్నికైనప్పటి నుంచి అతను కమ్యూనిస్టు అని పదే పదే చెబుతూ ట్రంప్‌ ఓటర్లను ఆకర్షించేందుకు చూశాడు. అతగాడికి కొమ్ము కాసే మీడియా యాజమాన్యాలు, వాటిలో పనిచేసే యాంకర్లు రాజును మించిన రాజభక్తిపరులుగా మారారు. ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌ ఊగిపోతూ జోహ్రాన్‌ మమ్దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు. వారిని దెబ్బతీసేందుకు జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు. కొంతమంది తీవ్రవాదులను న్యూయార్క్‌ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదని, నగరాన్ని నాశనం కానివ్వకూడదంటూ జోహ్రాన్‌ మీద విరుచుకుపడ్డాడు. ‘తను కమ్యూనిస్టును కాదని, ప్రజాస్వామిక సోషలిస్టును అని చెప్పుకుంటున్నాడు, అది ఏ తరహా ప్రజాస్వామ్యం? అతను ఎన్నిక కావటాన్ని సహించకూడు. ఏదో విధంగా అడ్డుకోవాలి. జోహ్రాన్‌ గడ్డం ఉన్న కమలాహారిస్‌ అని’ నోరు పారేసుకున్నాడు. ‘ప్రచ్చన్నయుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికిందని, దాంతో విశ్వవిద్యాలయాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చిందన్నాడు. అందువలన వలస వచ్చేవారిని, సిద్ధాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి, కమ్యూనిస్టుకు ఓటు వేయాలనుకునేవారిని, నగర నాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి’ అన్నాడు. ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే. అమెరికా తిరోగామి మీడియాలో ఇలాంటి వారు కోకొల్లలు.

కుమో పోటీకి దిగాలని నిర్ణయించినపుడే అతగాడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాను ట్రంప్‌ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని, పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్‌ ఇంట్లో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదార్లు చర్చించి కుమో ఎలా పోటీ ఇవ్వగలడో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్‌ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమో అని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు. తరువాత అదే జరిగింది. కుమోను ట్రంప్‌ బలపరుస్తున్నాడని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ కొద్దినెలల ముందే ఒక ప్రకటనలో హెచ్చరించారు. అందుకే సర్వేలు విజయం గురించి చెప్పినప్పటికీ ఎంతకైనా తెగించే డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నందున ఫలితాలు వెలువడే వరకు ఏం జరిగేదీ ఊహించలేము.

ట్రంప్‌ ప్రకటన తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత ఆండ్రూ కుమో స్పందిస్తూ రిపబ్లికన్‌ ఓటర్లు అధ్యక్షుడి మాట వింటారని భావిస్తున్నానని, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచే మేయర్‌ మనకు కావాలని, న్యూయార్క్‌ నగరానికి నేషనల్‌ గార్డ్స్‌(మిలిటరీ) పంపే ముప్పు ఉన్నందున తాను సరైన అభ్యర్ధినని, మమ్దాని గనుక గెలిస్తే వెన్నలో వేడికత్తిని దింపినట్లు ట్రంప్‌ వ్యవహరిస్తాడని ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు. ఒక కమ్యూనిస్టును గాక న్యూయార్క్‌ ఒక చెడు డెమోక్రాట్‌ను ఎన్నుకోవాలని చెప్పటం సరైంది కాదని, తాను చెడ్డవాడిని కాదు, జోహ్రాన్‌ కమ్యూనిస్టు కాదని, ఒక సోషలిస్టు మాత్రమే అని అయితే నగరానికి సోషలిస్టు పనికి రాడని కుమో చెప్పుకున్నాడు. ప్రపంచ ధనికుల్లో ముందున్న ఎలన్‌ మస్క్‌ కూడా కుమో వైపు నిలిచినట్లు వెల్లడించాడు. అయితే ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ సిల్వా తాను పోటీనుంచి తప్పుకోవటం లేదని ప్రకటించాడు. ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల కమ్యూనిస్టు, సోష లిస్టు వ్యతిరేక ప్రచారంతో పాటు ముస్లిం, పాలస్తీనా వ్యతిరేకతను కూడా రెచ్చగొట్టేందుకు ప్రత్యర్ధులు, మీడియా శతవిధాలా ప్రయత్నించాయి. ఇన్ని చేసినా ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రతిపక్ష అభ్యర్ధుల కంటే ఎక్కువ మంది మద్దతు జోహ్రాన్‌కు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ స్తంభన కారణంగా పేదలు, సబ్సిడీ ఆహారం మీద ఆధారపడిన వారందరూ ఆకలితో మాడుతున్నట్లు వచ్చిన వార్తలను చూసిన తరువాత వారందరూ కూడా జోహ్రాన్‌కు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

జోహ్రాన్‌ పక్కా కమ్యూనిస్టు అని ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుట్రచేసి ఫలితాలను తారుమారు చేస్తే తప్ప ప్రపంచ పెట్టుబడిదారుల కుంభస్థలం మీద తొలిసారిగా ఒక సోషలిస్టు గద్దెనెక్కటం ఖాయం అని చెప్పవచ్చు. మతకళ్లద్దాలతో చూసిన వారు తొలి ముస్లిం మేయర్‌ అవుతారంటూ చెప్పారు.ఒక పురోగామివాదిగా జోహ్రాన్‌ అసలు డెమోక్రటిక్‌ అభ్యర్ధిగా ఎన్నిక అవకుండా మొగ్గలోనే తుంచేందుకు ఆ పార్టీలోని మితవాద, పురోగామివాద వ్యతిరేకశక్తులు అన్ని విధాలుగా ప్రయత్నించాయి. డెమోక్రటిక్‌ పార్టీలోని మితవా దులతో సహా ప్రతిపక్షం అంతా ఒక్కటి, జోహ్రాన్‌ ఒక్కడిగా రంగంలో ఉన్నాడు.ట్రంప్‌ చివరికి ఎంతగా దిగజారాడంటే తమ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు వేసే ఓటు జోహ్రాన్‌కు వేసినట్లుగానే పరిగణించాలన్నాడు. కొన్ని సమయాల్లో కొందరు అన్నట్లుగా ఒక సోషలిస్టు విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు మిగతా సమయాలలో దెబ్బలాడుకొనే రిపబ్లికన్లు, డెమాక్రాట్లు ఎప్పుడైనా తమకే ఎసరు వస్తుందని భావిస్తే ఇద్దరు కలసిపోతారనేందుకు తాజా పరిణామం తార్కాణం.ఈ అంశం అనేక మందిలో భ్రమలను పోగొట్టి తామెటో నిర్ణయించుకొనేందుకు పనికి వస్తుందని, రానున్న రోజుల్లో డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగలటం అనివార్యమని చెప్పవచ్చు.ఆఫ్రికాలో జన్మించిన 34 ఏండ్ల జోహ్రాన్‌ గెలిస్తే ఒక దక్షిణాసియా సంతతి, ముస్లిం సామాజిక తరగతికి చెందటమే గాక తొలి సోషలిస్టు మేయర్‌గా చరిత్రకెక్కనున్నాడు. ప్రచారంలో డెమోక్రటిక్‌ సోషలిస్టును అని చెప్పుకున్నాడు తప్ప ఇతర అంశాలకు చెందిన మనోభావాలను ముందుకు తెచ్చేందుకు ప్రయతించకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని చెప్పవచ్చు. అతన్ని సోషలిస్టుగా వర్ణించినా తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అనేక మంది చెప్పటం అమెరికా సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనం.

డోనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంటా బయటా అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటిలో ఒక ప్రధాన అంశంగా న్యూయార్క్‌ నగర మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికను అడ్డుకోవటం కూడా ఉందని చెప్పవచ్చు. బహుశా అమెరికా అధ్యక్షుల చరిత్రలో గడచిన శతాబ్ది కాలంలో మరొకరెవరికీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమై ఉండదని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితం, పర్యవసానాలు వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు మధ్యం తర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు అని చెబుతున్నారు. ఆ కారణంగానే ట్రంప్‌ స్వంత పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టటమే కాదు, అతగాడికి ఓటేస్తే జోహ్రాన్‌కు ఓటేసినట్లే అని చెప్పేంతవరకు వెళ్లాడు.చిత్రం ఏమిటంటే ట్రంప్‌ను వ్యతిరేకించిన ఎలన్‌మస్క్‌ కూడా ఇదే చెప్పాడు. మహాభారతంలో అభిమన్యుడిని అంతం చేసేందుకు చూసినట్లు జోహ్రాన్‌ ఓటమికి అన్ని రకాల శక్తులు ఏకమైనా సర్వేలు అతనికి అనుకూలంగా చెప్పాయి, ముందే చెప్పుకున్నట్లు ఎంతకైనా తెగించే ట్రంప్‌ ఉన్నందున ఫలితాన్ని తారుమారు చేస్తాడా? చూద్దాం!
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -