Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలకు అవకాశమిస్తేనే సమాజ అభివృద్ధి

మహిళలకు అవకాశమిస్తేనే సమాజ అభివృద్ధి

- Advertisement -

మంత్రి దనసరి సీతక్క
నిజామాబాద్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-కంఠేశ్వర్‌
మహిళలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతామని మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్థానిక విజయలక్ష్మి గార్డెన్‌లో నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై అవగాహనా సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1911లో కమ్యూనిస్టు నాయకురాలు క్లారాజెట్లిన్‌ ఆధ్వర్యంలో మహిళల అసమానత్వాన్ని నివారించుటకు పోరాటం చేశారని, దాన్ని పురస్కరించుకొని మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతేడాది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, అందులో భాగంగా 2026 సంవత్సరానికి ‘గివ్‌ టు గైన్‌’ అన్న నినాదాన్ని తీసుకుందని తెలిపారు.

మహిళలకు సమాన అవకాశాలను ఇస్తే వారి నుంచి సమాజ అభివృద్ధికి ఎంతో పొందుతామని అర్ధాన్నిస్తుందని, దానికనుగుణంగానే మనందరం మహిళలకు ఆ అవకాశాలను ఇవ్వటమే కాకుండా వారికి బాసటగా నిలుద్దామని అన్నారు. మహిళా సాధికారత సాధించడంలో లింగ విభేదాన్ని వీడనాడాలని తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చెబుతూ.. తనను తాను ఆదర్శవంతమైన మహిళగా తీర్చిదిద్దుకొనుటకు చదువు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మహిళా అభ్యున్నతికి విద్య ఎంతో తోడ్పడుతుందని, చదువు విజ్ఞానాన్ని ఇస్తుందని, ఈ విజ్ఞానంతో సమాజంలో రాణిస్తామని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా తన జీవితాన్ని గొప్పస్థాయిలో మలుచుకోగలిగానని అన్నారు. పదవ తరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన తాను ఒక నక్సలైట్‌గా ఏ కోర్టులో నిలుచున్నానో అదే కోర్టులో నేను అడ్వకేట్‌గా నిలిచానని చెప్పారు. మహిళగా సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే సమస్యలను అధిగమించేలా ఉండాలని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

ఓటమి అనేది విజయానికి నాంది అన్న నానుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నేడు మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా కృషి చేస్తున్నదని తెలిపారు. జీరో వడ్డీతో రుణాలు అందిస్తూ అనేక మందిని గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నామని, కోటి మందిని మహిళా వ్యాపారవేత్తలుగా చేయటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు.
నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చైర్మెన్‌, పోలీస్‌ కమిషనర్‌ పి.సాయిచైతన్య మాట్లాడుతూ.. సమాజంలోని మహిళల విజయాలను యువతకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ బ్రోచర్లను విడుదల చేశారు. సురక్ష దీప్‌ అన్న భద్రతా బోర్డులను ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఏర్పాటు చేయాలని, మహిళల సమస్యల పరిష్కారానికి ఒక భద్రతను కల్పించే దిశగా ఇది పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్‌ మేయర్‌ కె.ఉమారాణి, నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కన్వీనర్‌ డీసీపీ(అడ్మిన్‌) జి.బస్వారెడ్డి, ట్రెజరర్‌ కె.సంతోష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి కవితారెడ్డి, ఎన్‌ఎస్‌సీ సభ్యులు కాకతీయ కాలేజ్‌ రజినీకాంత్‌, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి డీఎఫ్‌ఓ నిఖిత, నుడా చైర్మెన్‌ కేశ వేణు, వివిధ కళాశాలకు చెందిన విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -