ఐద్వా జిల్లా అధ్యక్షురాలు గద్వాల సాయిలీల
ఐద్వా ఆధ్వర్యంలో సర్వే
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా పీర్లగుట్టలో డబుల్ బెడ్ రూమ్ పేరుకే మిగిలిపోయిందని, అక్కడి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు గద్వాల సాయిలీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఆదివారం సమస్యలపై సర్వే నిర్వహించారు. స్థానికంగా నివాసం ఉంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు. కాలనీలో చెట్లు, పొదలు పెరిగి పందుల బెడవ ఏర్పడటం, తాగునీటి సమస్యలు, రోడ్లు సరిగా లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. కాలనీకి వెళ్లే దారిలో కరెంటు స్తంభాలు లేకపోవడం, మొత్తం కాలనీకే రెండు స్తంభాలు మాత్రమే ఉండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
“ఉచిత కరెంటు అంటున్నారు గానీ మాకు కరెంటే అందడం లేదన్నారు. పిల్లల భద్రత గురించి మేము భయపడుతున్నాం” అని వారు వాపోయారని పేర్కొన్నారు. స్కూల్ దూరంగా ఉండటం వల్ల చిన్న పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.“ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలనీకి పక్కా రోడ్లు వేయించాలన్నారు. అంగన్వాడి, ఆరోగ్య కేంద్రం, రేషన్ షాప్ కాలనీ దగ్గరలోనే ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపట్టాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. సర్వేలో జిల్లా ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, కాలనీ ప్రజలు బషీర్, మహమ్మద్ కాజా, రజిత, చంద్రమౌళి, కళావతమ్మ, సరోజ ,నూర్జహాన్, కౌసల్య, ప్రవీణ్ ,లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
