సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే చేసిన సందర్భంగా,వచ్చిన సమస్యలను పరిష్కరించాలని బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నర్సింగ రావుకు జిల్లా విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని గంజిపేట, చింతల్ పేట, మద్రాస్ పేట, వడ్డెర వీధి, ధరూర్ మండలంలోని ధరూర్ మండల కేంద్రం, దోర్నాల, నెట్టెంపాడు, నాగర్ దొడ్డి గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు.ప్రదానంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా నిర్మించకపోవడం, దోమల నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, పరిశుభ్రమైన తాగునీరు అందజేయకపోవడం, పూర్తి స్థాయిలో మంచినీరు అన్ని కుటుంబాలకు అందజేయకపోవడం,అర్హులైన వృద్ధాప్య వికలాంగుల వితంతువులకు పింఛన్లు అందజేయకపోవడం,అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోవడం, ఇంటి పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, వాటి వల్ల మూగజీవాలు చనిపోవడం, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయకపోవడం శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం, వంటి సమస్యలు ప్రధానంగా తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.
పట్టణంలో నది అగ్రహారం పాఠశాలను, పునర్ నిర్మించాలని, కందకాలకు పైకప్పులు ఏర్పాటు చేయాలని ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి నిర్మించాలని వంటి సమస్యలు ప్రధానంగా వచ్చాయని తెలిపారు. సర్వేలో వచ్చిన సమస్యలపై శాఖల వారీగా అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
డిమాండ్స్
1.ప్రతి గ్రామం లో డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
2. జిల్లాలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేయాలి, ప్రమాదకరంగా శిథిలావస్థలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలి
3. పట్టణాలు గ్రామాలలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి ఖాళీ స్థలాలు ఇండ్ల మధ్యలో ఉన్న కంప చెట్లను తొలగించాలి.
4. వారానికి ఒకసారి వాటర్ ట్యాంకులు శుభ్రపరచాలి
5. ప్రతి వీధికి సిసి రోడ్లు నిర్మించాలి.
6. పట్టణంలోని కందకాలపై పైకప్పులు నిర్మించాలి.
7. ప్రకృతి వనాల నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి.
8. పెరుగుతున్న జనాభా కనుగుణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ కార్మికులను నియమించాలి.
9. నాగర్ దొడ్డి గ్రామంలో భూములు ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి.
10. ధరూర్ మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ ను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి.
11. అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య వికలాంగుల వితంతువు పింఛన్లు వెంటనే ఇవ్వాలి.
12. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వివి నరసింహ, ఉప్పే ర్ నరసింహ, దేవదాసు, హమాలీ నర్సింహులు పాల్గొన్నారు.