నవతెలంగాణ-ఝరాసంగం
మండల పరిధిలోని బిడకన్య గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ… మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే. చంద్రన్న గ్రామస్తులతో కలిసి వినతి పత్రం అందించారు. గ్రామంలో మురికి కాలువలు ఎక్కడికక్కడ నిండిపోయి, చెత్తాచెదారం రోడ్ల పైన చిందరవందరగా పడి ఉందని తెలిపారు. దీంతో దోమలు విపరీతంగా వృద్ధి చెంది ప్రజలు రోగాల బారినపడుతున్న పరిస్థితులు నెలకొంటున్నయని పేర్కొన్నారు. వీధిలైట్లు వెలగక, మంచినీటి బోరు బావులు పనిచేయడం లేదని, దీనికి తోడు మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదన్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ ను కూడా చల్లలేని పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కండ్లకు అద్దం పట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం గ్రామంలో ప్రత్యేక అధికారిని నియమించి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో మండల కేంద్రాన్ని గ్రామస్తులతో పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో పెంటప్ప, నర్సింలు,శివప్ప,చంద్రయ్య,అశోక్ తదితరులు ఉన్నారు.
బిడకన్య గ్రామంలో సమస్యలను పరిష్కరించండి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES