మంత్రి వాకిటి శ్రీహరికి టీఎంకేఎంకేఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫెడరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మత్స్య వృత్తిపై ఆధారపడి సుమారు పది లక్షల మత్స్యకార కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని తెలిపారు. 5,500 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4 లక్షల 90 వేల మంది సభ్యులున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగిపోవడం వల్ల భూ దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియా పెద్ద ఎత్తున చెరువులు కుంటలు జల వనరులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పట్టణాల నుంచి వస్తున్న రసాయనిక డ్రైయినేజీ నీరు మొత్తం చెరువులు కుంటల్లో కలువడం వల్ల మత్స్య సంపద అంతరించిపోతున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలవనరులు చెరువులు కుంటలు నదీ పరివాహక ప్రాంతాల భూములను సాటిలైట్ ద్వారా సర్వే చేయించి పూడికలు తీయించి ఫెన్సింగ్ వేయించాలనీ, జలవనరులను కబ్జాలు, కాలుష్యం నుండి కాపాడలనీ, మత్స్య వృత్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల మత్స్యకారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తం 18డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. మంత్రి ఈ మేరకు స్పందిస్తూ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



