మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టిగారియా వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ మధుసూదన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె జనార్ధన్, ప్రధాన కార్యదర్శి ఎస్ గణేష్ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. చాలా గురుకులాల్లో మౌలిక సదుపాయాల్లేవని తెలిపారు. టైంటేబుల్ వల్ల విద్యార్థులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తొమ్మిది గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కో పాఠశాలలో ఒక్కో రకమైన సిబ్బంది విధానం ఉందని తెలిపారు. అన్నింటికీ ఒకే రకమైన సిబ్బంది ఉండేలా చూడాలని కోరారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాద్యాయులను వారి స్వస్థలాలకు బదిలీ చేయాలని సూచించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని తెలిపారు. ఎస్సీ గురుకుల సొసైటీ చైర్మెన్‌గా ఉన్న మంత్రికి గతంలో ఉన్న అధికారాలను పునరుద్ధరించాలని కోరారు. 1987 నుంచి 2014 వరకు ఉద్యోగుల సర్వీసు అంశాలతోపాటు పరిపాలనా అంశాలు చైర్మెన్‌కే ఉండేవని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ ఆమోదం లేకుండానే నాటి అధికారులు సంస్థ చైర్మెన్‌ను నామమాత్రం చేశారని పేర్కొన్నారు. అధికారాలన్నీ వైస్‌చైర్మెన్‌కు కట్ట బెట్టారని వివరించారు. దానివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గతంలో ఉన్న విధంగా సంస్థ చైర్మెన్‌కే అధికారా లుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2014, 2018లో జరిగిన ప్రిన్సిపల్ నియామకాల్లో బోగస్ సర్వీస్ సర్టిఫికెట్లు, గుర్తింపు లేని దూరవిద్య అర్హతలు పొందిన వారు ప్రధాన ఆచార్యులుగా ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. దానివల్ల 20 ఏండ్లకుపైగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులు పొందలేక పోయారని తెలిపారు. వంద శాతం పదోన్నతుల ద్వారా ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జోనల్, డిప్యూటీ సెక్రెటరీ పదోన్నతుల్లో పురుషులు, మహిళల నిష్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల అసమానతలు వస్తున్నాయని పేర్కొన్నారు. నిష్పత్తి ఉండేలా చూడాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఎస్సీ గురుకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES