Thursday, October 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన హాస్టల్‌ వర్కర్ల సమస్యల్ని పరిష్కరించండి

గిరిజన హాస్టల్‌ వర్కర్ల సమస్యల్ని పరిష్కరించండి

- Advertisement -

సమ్మె విరమణకు చర్యలు తీసుకోండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కోరిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
జూలకంటి నేతృత్వంలో మంత్రిని కలిసిన జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు
నేడు యూనియన్‌ ప్రతినిధులతో సమ్మె డిమాండ్లపై చర్చిస్తామని మంత్రి హామీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్‌ వర్కర్లు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలనీ, 40 రోజులుగా సాగుతున్న సమ్మెకు పరిష్కార మార్గం చూపెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జూలకంటి నేతృత్వంలో గిరిజన పాఠశాలలు, హాస్టల్‌ డైలీ వేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జేఏసీ నేతలు, విద్యార్థి, గిరిజన సంఘాల నేతలతో కూడిన బృందం మంత్రిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు 40 రోజులు సమ్మె చేస్తున్న తీరును వివరించారు.

వర్కర్లు లేకపోవడంతో విద్యార్థులు స్వయంగా వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జీతాలు తగ్గించడం అన్యాయమన్నారు. గిరిజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని మంత్రిని కోరారు. డైలీ వేజ్‌ వర్కర్లకు టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని అప్పటివరకు కలెక్టర్‌ గెజిట్‌ ప్రకారం జీతాలు చెల్లించాలనీ, ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్లకు క్యాటరింగ్‌ పద్ధతిని రద్దుచేసి జీవో 60 ప్రకారం రూ.15,600 జీతం ఇవ్వాలని విన్నవించారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలనీ, కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబంలోని వారసులకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు యూనిఫామ్‌ దుస్తులు ఇవ్వాలని కోరారు. వేతనాలు తగ్గించే జీవో 64, 527లను రద్దు చేయాలని కోరారు. సమ్మెను విరమింపజేసి విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సానుకూలంగా స్పందిస్తూ.. 23న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సమ్మెకు నాయకత్వం వహిస్తున్న జేఏసీ ప్రతినిధులతో, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరుపుతామనీ, వారి డిమాండ్లను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటా మని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో హాస్టల్‌ డైలీ వేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు బి మధు, ఎం పాపారావు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌ నాయక్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ధర్మానాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -