Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమానవీయ కోణంలో భూ సమస్యల పరిష్కారం

మానవీయ కోణంలో భూ సమస్యల పరిష్కారం

- Advertisement -

తిరుమలగిరి మండలంలో కొత్తగా 4వేల ఎకరాలకు పట్టాలు
రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
దశాబ్దాల కాలంగా భూములను సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని భూ సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలను జఠిలం చేయొద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో 40-50 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు కొర్రీలు పెడుతున్నారన్నారు.

ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుమలగిరి (సాగర్‌) మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించామన్నారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం 235 సర్వే నెంబర్లను ఎంపిక చేసినట్టు చెప్పారు. మొత్తం 23వేల ఎకరాల్లో సర్వే నిర్వహించి.. అందులో 12వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు. ఇందులో 8వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 4 వేల ఎకరాలు పాసుపుస్తకాలతో సాగులో ఉన్నాయని వివరించారు. మిగిలిన 4037 ఎకరాలకు సంబంధించి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ సర్వేలో 2936 ఎకరాలకు సంబంధించి 3069 మంది వద్ద బోగస్‌ పాసు పుస్తకాలు ఉన్నట్టు గుర్తించి వాటిని రద్దు చేశామని తెలిపారు.

వీరికి రైతు భరోసా, రైతుబీమా తదితరాలు రద్దు చేశామన్నారు. సర్వేలో భాగంగా 7వేల ఎకరాల అటవీ భూమిని గుర్తించామని, ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కె.జానారెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కె.జయవీర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌, రెవెన్యూ శాఖ సెక్రెటరీ డిఎస్‌.లోకేష్‌కుమార్‌, పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సి.సువర్ణ, నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -