Saturday, October 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసోంబేరి వార్తలు

సోంబేరి వార్తలు

- Advertisement -

ఆకాశవాణి, కాకపోతే దూరదర్శన్‌, అదీ కాకపోతే ఇంకో టీవీఛానల్‌, ఏదైతేనేం వార్తలు చదువుతున్నది సోంబేరి. సోంబేరి వార్తలకు స్వాగతం. ఈ సోంబేరి నా ఇంటిపేరో, లేక నాపేరో కూడా తెలియదు. నాకు తెలుసుకునేంత ఓపిక, తీరిక లేదు. నిజంగానే అవి దొరికితే కాస్త విశ్రాంతి తీసుకుంటాను ఆ దొరికే సమయంలో. సమయాన్ని పొదుపు చేయడంలో నా తరువాతే ఎవరైనా, ఎందుకు పొదుపు చేస్తానని అడగొచ్చు, ముందే చెప్పాను కదా విశ్రాంతి తీసుకోవ డానికని. అది సంగతి. నిన్న ఫలానా చోట జరిగిన పడవ ప్రమాదంలో గజ ఈతగాళ్లు అందరినీ రక్షించారు. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఆ రక్షింపబడ్డవాళ్లలో ఈత వచ్చిన వ్యక్తి కూడా ఒకరుండడం. ఈత వచ్చినా సోమరితనంవల్ల, గజ ఈతగాళ్లను చూసినందువల్ల సదరు వ్యక్తి ఈతకొట్టలేదని తెలుస్తోంది. సోంబేరులకు ఈ వార్త అమితానందంగా ఉంటుందని సంఘ కార్యదర్శి ప్రకటించారు. ఇలాంటి వార్తలు మీ మీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఓపిక ఉన్నవాళ్లచేత మాకు ఆ వార్త పంపితే వాటి వివరాలు చెబుతాము. మీ విశ్రాంతికి ఆటంకం కలిగించడం మాకేమాత్రము ఇష్టం లేదు.

కొందరిని సోంబేరి అంటారు కాని ప్రతి మనిషిలోనూ సోంబేరి ఉంటుంది లేక ఉంటాడు. ఇంత నిక్కచ్చిగా ఎలా చెబుతున్నావని ఎవరైనా అడగొచ్చు. రోజూ ఎవరు ఎంతకు లేస్తారు అన్న విషయం చూస్తే తెలిసిపోతుంది. ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేచేవాళ్లు ఇందులోకి రారు. తొందరగా పడుకొని లేటుగా లేచేవాళ్లకే సోంబేరులనే బిరుదివ్వాలి అంతే. సోమరి తరగతికి చెందిన వాళ్లు ఎక్కడున్నా అందరికళ్లలో పడతారు, అందరి మాటల్లో వస్తుంటారు, వాళ్లు కదలకున్నా. అదీ సంగతి. ఒకరాజుకు, బహుశా ఆయన కూడా సోంబేరి అయివుండవచ్చు, ఒక అనుమానమొచ్చింది. అదేమంటే తన దేశంలో అసలుసిసలైన సోమరిపోతు ఎవరో తెలుసుకోవాలనిపించింది. ముగ్గురు సోమరులను కనిపెడతారు సైనికులు. ముగ్గురినీ పిలవండి అందులో ఒకడికి బహుమానమిస్తాను అంటాడు రాజు. సరే ముగ్గురినీ పిలుస్తారు. ఇద్దరే వస్తారు. ఆ రానివాడి గురించి రాజు అడుగుతాడు, బహుమానం తీసుకునేంత ఓపికలేదని సమాధానం పంపిస్తాడు.

అప్పుడు రాజుకి నిజమైన సోమరిపోతు అర్హత అతనికే ఉందని అర్థమైపోతుంది. బహుమానం తీసుకొని అతని ఇంటికే పోతాడు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. సోమరిపోతులైన భర్తలు, భార్యలు, కొడుకులు, కోడళ్లు, పనివాళ్లు, రైతులు, రాజులు ఇలా. పాపం గాడిదపైన సోమరిపోతన్న అపవాదు పడింది. మళ్లీ గాడిద చాకిరి అనడంలో కూడా దానిపేరే వాడుకుంటారు. సోమరిపోతు నక్క కథలు కూడా చదివే ఉంటారు. ఎవరో వేటాడితే తనుపోయి తింటుంది. అలా ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడేవాటిని పరాన్న జీవులంటారు. కొత్తవిషయాలు తెలుసుకోవడం సోమరులకు ఇష్టముండదని చాలామంది అపోహ పడుతుంటారు. అది వాస్తవం కాదు. వాళ్లూ విషయాలు తెలుసుకుంటారు కాని ఎవరికీ చెప్పరంతే. ఎందుకంటే ఓపిక ఉండదు కాబట్టి. ఇప్పుడు సెల్లు కాని, కంప్యూటర్‌ కాని తీసుకొండి ఉదాహరణకు. దాని మెమొరీ ఎంత ఎక్కువ నిండిపోతే అంత నిదానంగా పనిచేస్తుందది. అందుకే ఆ మెమోరీని ఎంత ఖాళీ పెడితే అంత మంచిది. ఈ విషయం తెలీనివాళ్లు దొరికిన చెత్తనంతా వాటిల్లో నింపేస్తుంటారు.

ఈరోజు నెట్‌వర్క్‌ బాగాలేదండి, నెట్‌ చాలా నిదానంగా ఉందండి అని అపవాదులేస్తుంటారు, మా సోంబేరులమీద వేసినట్టే. ఈ సోమరితనం ఆదిమానవుల్లో కనబడదు. అప్పుడు అందరూ కష్టపడి పనిచేసేవాళ్లు తరువాత్తరువాత మానవులు అన్నివిధాలా అభివృద్ధి చెంది, వ్యవసాయం కనుక్కొని ఆతరువాత మిగులు ఏర్పడడంతో దాన్ని కొందరు తమ చేతుల్లోకి తెచ్చుకొని అందరిమీదా అధికారం చెలాయించడం నేర్చుకున్నారు. వాళ్లనే పెట్టుబడిదారులని, భూస్వాములని అంటారు. తమాషా ఏమిటంటే ఇప్పుడు వీళ్లే కొందరిని సోమరి పోతులని అనడం. పని చేయించుకోవడంలో వీళ్లు సోమరులుగా ఉండరు. పది రూపాయలు ఖర్చుపెడితే ఇరవై సంపాదించాలని చూస్తుంటారు. రాజకీయాలు, ఇతర ఆధిపత్య స్థానాలెలాగైతే వారసత్వంగా వస్తున్నాయో ఈ పెట్టుబడిదారుల వారసత్వం కూడా అలాగే కొనసాగుతోంది. దేశాల మీద ట్రంపుకంపుగా పన్నులు పెంచడం కూడా దీనికిందికే వస్తుంది. దేశాలపై దాడులు ముఖ్యంగా సంపాదన కొల్లగొట్టడం కోసం చేసేది, చేస్తున్నది కూడా సోమరులేనని మా అభిప్రాయం. చమురు దేశాలపైపడి యుద్ధాలు చేయడం కూడా ఇలాంటిదే.

డబ్బు ఒక్కసారి సంపాదిస్తే చాలునని, అదే తరువాత డబ్బుని సంపాదించుకుంటుందని వ్యక్తిత్వవికాస పుస్తకాల్లో రాస్తుంటారు. నీ సోమరితనం మొదట వదిలేయమని, అప్పుడే నీవు బాగుపడతావనీ చెబుతారు. కోటీశ్వరుల గురించి రాస్తారు. తరతరాలుగా వస్తున్న సంపద గురించి మాత్రం రాయరు. దానిజోలికి అస్సలు పోరు. పై పై పూతలు పూసి ఎదగడానికి అందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు ఉన్నాయని రాస్తారు. పి.పి.పి కాలేజీల్లో ఎవ్వరు ఏ సీటైనా కొనుక్కోవచ్చునని ఈ మధ్య కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడ ఉన్నోళ్లకే పట్టం కట్టే ప్రయత్నాలు. ప్రభుత్వాలుండేది ప్రయివేటువాళ్లను ప్రోత్సహించడానికేనని ‘సీతమ్మ’ పదే పదే చెబుతున్నారు. అంటే సోంబేరులను ప్రత్సహించే ప్రభుత్వాలు కూడా ఉంటాయన్నది ఇక్కడ తేలే విషయం. ఈ సోంబేరితనం సంస్థాగతమైందని గమనించాలి. సోంబేరికి వినడమే కాని మాట్లాడడం బరువని కొందరి తీర్మానం. కానీ సోంబేరి అనుకుంటూ ఇన్ని వార్తలు ఎలా చెప్పానని అనుకుంటున్నారా? అక్కడే …..కాలేశారు… ఇదంతా ఎ.ఐ. సహకారం, పెదవుల కదలిక కూడా అదే. ఉంటాను నిద్దరొస్తోంది.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -