బాహుబలి ఒకటి, రెండు, పుష్ప ఒకటి, రెండు, కార్తికేయ ఒకటి, రెండు, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇలా అన్నీ రెండు సీక్వెళ్లు వస్తున్న నేటి రోజుల్లో సోంబేరి వార్తలు..2.. రావడం తప్పేమీ కాదు, సమయానుకూలంగా ఉంటుందని నిద్రలో వచ్చిన ఆలోచన. సోంబేరులకు నిద్రలో ఆలోచనలు వస్తాయన్న విషయం కూడా అందరికీ తెలపవచ్చు. వాళ్లను పని చేయనివాళ్లుగా అనుకోవచ్చు కాని వారి మెదడు పనిచేస్తుందన్న విషయం తెలపడం ముఖ్యం. ఇతరుల కష్టాన్ని బాగా దోచుకుని, దాచుకొని, ఆపై దానితో తిరిగి సంపాదించి రాజులైన వాళ్లు, నవాబులైన వాళ్లు మధిర సేవిస్తూ, హుక్కాలు పీలుస్తూ క్రీడల్ని తిలకించేవాళ్ళు పూర్వం. మల్ల యుద్ధాలు, కత్తి యుద్ధాలు చేసుకొని ఎవరో ఒకరు చనిపోయేంతవరకు ఆట కొనసాగుతుంది. సోంబేరులు చూస్తుంటే కష్టపడేవాళ్లు పోట్లాడి చనిపోయేవారు.. ఇది కొత్తగా చెప్పేది కాదు, చరిత్రలో ఉంది.
స్పార్టకస్ కథ చదివితే మనకింకా విషయాలు తెలుస్తాయి. అతను బానిసలను కూడగట్టి రోమన్లపై ఎలా యుద్ధాలు చేశాడో తెలుస్తుంది. కాబట్టి సోంబేరులపై కష్టం చేసేవాళ్ల పోరు తరతరాలుగా వస్తోందని తెలుసుకోవాలి. ఈ మధ్యే ఒక వాట్సప్ సందేశం వచ్చింది. అదేమంటే ఏ పనీ చేయకుండా ఉండడమంత కష్టమైన పని వేరే లేనే లేదన్నది దాని సారాంశం. ఏమీ చేయడం లేదంటూనే దాన్ని ‘పని’ అని ఎందుక న్నారబ్బా అని ఆలోచన అటుపోయింది. పని చేసినా చేయకున్నా దాన్ని పని అంటారని, అది క్రియా పదమని అర్థమయింది. కాబట్టి నిష్క్రియ కూడా ఒక క్రియేనన్నమాట. ఒక చాకోలేట్ ప్రచారంలో కూడా ఒక్కోసారి ఏ పనీ చేయకుండా కూడ ఉండొచ్చు అని ఒక వ్యాపార ప్రకటన. ఏమంటే ఒకతను వందరూపాయల చాకోలేట్ తింటూ చెబుతాడా మాట. ఇంతకీ దాన్ని కొని తింటున్నాడా లేక ఎవరైనా ఇచ్చారా అన్నది అవసరమిక్కడ. తన కష్టార్జితంతో కొనుక్కొని ఉంటే ఏ సమస్యా లేదు.
జార్జ్ బెర్నార్డ్ షా మూర్ఖులని వాడాడు కాని దాని బదులు సోంబేరులని రాసుకుంటే ఒన మంచి విషయం తెలుస్తుంది. అదేమంటే పదకొండు సోంబేరులాడుతుంటే పదకొండువేల సోంబేరులు తిలకించే ఆట క్రికెట్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడది లక్షలు దాటి, కోట్లకు పోయింది మీడియా చలువ వల్ల. తిలకించేవాళ్లంతా సోంబేరులా అని కోపం వద్దు. ఏదో కాస్త సేదతీరుదామని ఈ ఆట చూస్తున్నామని చెప్పొచ్చు. తప్పకుండా రిలాక్స్ కమ్మనే చెప్పాలి ఈ స్పీడు యుగంలో. అయితే ఆ సేదతీరాక ఏమిచేస్తారన్నదే అసలైన ప్రశ్న. తరువాత ప్రజలకు పనికొచ్చే ఒక పని కాని, రాత కాని, లేదా ఆ పనులు చేసేవాళ్లకు సహకరించడం కాని చేస్తున్నారా అధ్యక్షా అన్నది ఇక్కడ ప్రశ్న. చాలా కొద్దిమంది మాత్రమే చేస్తున్న పని అది. సమాజం గురించి ఆలోచించడం కూడా ఒక పనే మరి. ఇక పెద్దల సభల్లో రెండు మూడు పింఛన్లు తీసుకొని హాయిగా నిద్రపోయేవాళ్లు, అసలు సభలకే రాకుండా జీతం తీసుకొని, ఆపై పింఛన్ తీసుకొనే వాళ్ళు మనకేమీ కొత్త కాదు. కానీ కష్టజీవులకు సంబంధించిన అంటే వాళ్ళకు వ్యతిరేకంగా పెట్టే బిల్లులకు వీళ్ల మద్దదు ఉంటుంది. చెమట విలువ తెలీకుండా ఏసీ గదుల్లో ఉన్న వీళ్లను సోంబేరులంటే తప్పేమిటని మా మిత్రుడు అంటుంటాడు.
ఇంకో తమాషా ఏమిటంటే ఆ రెండు మూడు పింఛన్లు తీసుకునే వీళ్లు మాకు కొత్తపెన్షన్ వద్దు పాత పెన్షనే కావాలి అని ఉద్యో గులు పోరాడుతుంటే వాళ్లకు న్యాయం చేయాలని వీళ్లకు అనిపించనే అనిపించదు. ఇప్పుడు చెప్పండి ఎవరు సోంబేరులో. మహిళా సాధికారత బిల్లూ అంతే ఆకాశంలో సగం, భూమిలో సగం అంటూనే మూడోవంతు మాత్రం ఇచ్చేటట్టుగా బిల్లు పాసయింది. మరి అమలు విషయం? అది సోంబేరి తనమా లేక భయమా? ఇక స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం యాభైశాతం ఇచ్చామంటున్నారు కాని వెనుకనుండి నడిపేదెవ్వరు? వాళ్లపని వాళ్లు చేయడానికి అవకాశం ఇస్తే తామెంత చురుగ్గా ఉంటారో మహిళలు చూపుతారు. సోంబేరితనం పెంచే ఏ.ఐ విషయానికొస్తే ఇంకెన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు రోబోలు కూడా చూశాం. ఇంకా వెనక్కుపోయి చూస్తే యంత్రాలు రావడం, ఆ తరువాత కంప్యూటర్లు రావడం ఇవన్నీ ఒక వరుసలో జరుగుతున్నాయన్న విషయం మనం కాస్త సోమరితనాన్ని వదిలి గమనించాలి, విషయాలు లోతుగా తెలుసుకోవాలి. ఏ.ఐ వల్ల ఉద్యోగాలు పోవడం మొదలైంది.
కంప్యూటర్లవల్ల, రోబోలవల్ల కూడా మనుషులు తమ పనులు కోల్పోయారు. పారిశ్రామిక విప్లవం వచ్చి యంత్రాలు వచ్చేసరికి కార్మికుల అవసరం తగ్గింది. అలాగే పొలాల్లో పనిచేసే యంత్రాల వల్ల వ్యవసాయ కార్మికులకు పనిపోయింది. ఇది ఇక్కడితో ఆగదు. ఏ.ఐ తరువాత ఇంకొకటి రానేవస్తుంది. అయితే ఈ కృత్రిమ తెలివి, కంప్యూటర్లు, రొబోలు, యంత్రాలు ఇలా ఒక్కొక్కటి ఎవరి కడుపులు నింపుతున్నాయి, ఎవరి పొట్టలు కొవ్వుతో పెంచుతున్నాయి గమనించాలి. ఎవరి కడుపులు మాడుతున్నాయి? ఇది కూడా పెద్ద ప్రశ్న. మంచిపనులు చేసేవారికి ఎక్కువగా సోంబేరితనం ఉంటుందేమో కాని, సమాజాన్ని తమకిష్టమొచ్చినట్టు వాడుకునే దగాకోరులు తమ పనులవరకు చాలా చురుకుగా ఉండి చేసుకుంటారని తెలుసుకోవాలి. ఇవన్నీ చూసే జనాలు సోంబేరులు కానంతవరకు ఎటువంటి ప్రమాదమూ లేదు. అలా తమ పబ్బం గడుపుకునేవారిని గద్దె దించడం చాలా ముఖ్యం. అది చురుకైన ప్రజల బాధ్యత కూడా.
జంధ్యాల రఘుబాబు
9849753298