Saturday, January 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకొందరి కడుపుల్లో విషం

కొందరి కడుపుల్లో విషం

- Advertisement -

అది మూసీ కాలుష్యం కంటే ప్రమాదకరం
వికారాబాద్‌ అడవుల్లో వదిలేస్తే వారి మనస్సులు బాగుపడతాయి
ఓ పక్క మూసీ..మరోపక్క ఫ్లోరైడ్‌తో నల్లగొండ జిల్లా ప్రజలకు శిక్ష
గోదావరి నుంచి 20 టీఎంసీలు తీసుకొస్తాం
తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలు వాడుతాం
మూసీలో ఐదు టీఎంసీలను నిరంతరం పారిస్తాం
మూసీ ప్రక్షాళనపై పూర్తి డీపీఆర్‌ వచ్చాక సభలో చర్చిస్తాం
అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తాం
గుజరాత్‌లో సబర్మతీ ప్రక్షాళనలో 60 వేల కుటుంబాల తరలింపు
గుజరాత్‌, యూపీల్లో బీజేపీ ప్రభుత్వాలు నదుల ప్రక్షాళన చేస్తుంటే అడ్డుకుంటున్నామా?
తెలంగాణలో బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నది?
రియల్‌ ఎస్టేట్‌ ఒక ఇండస్ట్రీ..మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
హైదరాబాద్‌ నగరం ఓల్డ్‌ సిటీ కాదు ఒరిజినల్‌ సిటీ : మూసీ పునరుజ్జీవంపై శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి
హరీశ్‌రావు, అక్బరుద్దీన్‌ ఓవైసీ, బాలునాయక్‌, మల్‌రెడ్డి, దానం, శంకర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపుల్లో దాగి ఉన్న విషం అత్యంత ప్రమాదకరం. ఎందుకు విషం కక్కుతున్నారు. వారి కండ్లల్లోనూ విషముంది. వాటితో చూస్తే ఖతమే. దానిని కప్పిపుచ్చుకోవడానికి కండ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వివరాలు చెబుతుంటే కోపం ఎందుకు వస్తుంది? మీ సభ్యులైన అంబర్‌పేట్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు సహకరిస్తమంటున్నారు. వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. అసలు మీరు మూసీ ప్రక్షాళన చేయాలంటున్నారా? వద్దంటున్నారా? చెప్పండి. వాళ్లకు చేయొద్దని ఉంది. అంబర్‌పేట శ్మశానవాటిక నుంచి మృతదేహాలు కొట్టుకొస్తుంటే, కంపెనీల కాలుష్యం వస్తుంటే దాని మధ్యే పేదలు ఎల్లకాలం నివసించాలా? ఇది మీకు పట్టదా? కాంట్రాక్టులు ఇచ్చుడు..కమీషన్లు కొట్టుడు..ఫామ్‌హౌజ్‌లలో పోయి పండేటోళ్లకు నా గురించి మాట్లాడే అర్హత లేదు. మేం 80 వేల పుస్తకాలు చదవలేదు. డీపీఆర్‌ పూర్తయ్యాక మూసీ ప్రక్షాళనపై సభలో చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుంటార. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలతో మాట్లాడుతాం.

ఇలా అందరి అభిప్రాయాలను తీసుకునే ముందుకెళ్తాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘గుజరాత్‌లో సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌కోసం అక్కడి బీజేపీ ప్రభుత్వం 60 వేల కుటుంబాలను తరలించింది. యూపీలో గంగా ప్రక్షాళన చేపట్టారు. ఇప్పుడు ఢిల్లీలో యుమునా నది ప్రక్షాళన కోసం పని మొదలుపెట్టారు. గుజరాత్‌, యూపీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ ఏమైనా అడ్డుకున్నదా? బీజేపీ వాళ్లు ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని సీఎం ప్రశ్నించారు. రెండు రోజుల విరామం అనంతరం శీతాకాల సమావేశాలు పున:ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై బీఆర్‌ఎస్‌ పక్ష ఉపనేత హరీశ్‌రావు, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, సభ్యులు బాలూనాయక్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్‌, శంకర్‌, కాలేరు వెంకటేశ్‌, రామ్మోహన్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌ మాట్లాడారు. వారికి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చే క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు.

మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూఘాట్‌ నిర్మించారనీ, కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు కట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ నగరానికి శాశ్వత వరద సమస్య పరిష్కారానికి నిజాం సర్కారు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టులను నిర్మించిందని తెలిపారు. అవి ఇప్పటికీ హైదరాబాద్‌ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. ఆ గర్భ శ్రీమంతుల ఫామ్‌హౌజ్‌ల డ్రయినేజీని ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లలో కలుపుతుంటే ఉక్కుపాదం మోపి అడ్డుకున్నామన్నారు. తనను రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరని, ఇంకా ఏదేదో అని విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ కూడా ఒక ఇండస్ట్రీ అనీ, దానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకుంటున్నాయనీ, లండన్‌ థేమ్స్‌ రివర్‌, న్యూయార్క్‌, జపాన్‌, సౌత్‌ కొరియా, సింగపూర్‌ పర్యటనల్లో తమకు ఇదే అర్థమైందని తెలిపారు.

మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని సీఎం అన్నారు. ఒకప్పుడు అదే నీళ్లు తాగిన అక్కడి ప్రజలు ప్రస్తుతం కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కళేబరాలు కలిసి వచ్చే నీళ్లతో అనారోగ్యాల పాలవుతున్నారనీ, మూసీ పరీవాహక ప్రాంతంలో పండే పంటలు, కూరగాయలు తిన్న మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యుల నివేదికలు ఎత్తిచూపుతున్నాయని వివరించారు. మూసీని ప్రక్షాళన చేయాలని నల్లగొండ జిల్లా ప్రజలు తమను వేడుకున్నారన్నారు. ఆ జిల్లా ప్రజల మాటలను విన్నాక, ప్రపంచ నగరాలను చూశాక మూసీలో శుద్ధమైన నీటిని ప్రవహింపజేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కన్సల్టెన్సీలను నియమించుకుని మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పామనీ, ఈసా, మూసా కలిసే బాపూఘాట్‌ వద్ద వీ షేప్‌లో గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నామని తెలిపారు.

అక్కడ నుంచి 20 టీఎంసీలను తరలించి అందులో 15 టీఎంసీలు నగర అవసరాలకు, మిగతా ఐదు టీఎంసీలను మూసీలో నిరంతరం ప్రవహింపజేసేందుకు వాడుతామని వివరించారు. గాంధీ సరోవర్‌కు మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు రూ.4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందనీ, గాంధీ సరోవర్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లభించిందని తెలిపారు. 200 ఎకరాలను అడగ్గా ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన 55 ఎకరాలను కేంద్రం ఇచ్చిందనీ, మిగతాది కూడా ఇచ్చేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూత్రపాయ అంగీకారం తెలిపారని చెప్పారు. గత పాలకుల మాదిరిగా కేసుల నుంచి తప్పించుకోవడానికి కేంద్రంతో సఖ్యతగా ఉండట్లేదనీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో మెలుగుతున్నామని స్పష్టం చేశారు. తమది హిడెన్‌ ఎజెండా కాదనీ, అభివృద్ధి ఎజెండా అని తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నైట్‌ ఎకానమీని అభివృద్ధి చేస్తామన్నారు.

అనారోగ్యం బారిన మూసీ పరివాహక ప్రజలు
పాతబస్తీని తామెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదనీ, ఓల్డ్‌సిటీ ఒరిజినల్‌ సిటీ అని సీఎం నొక్కి చెప్పారు. హైటెక్‌ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సైబరాబాద్‌ సిటీకి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే పునాది వేసిందని చెప్పారు. రాబోయే 20 ఏండ్లలో పట్టణీకరణ 75శాతానికి పెరుగుతుందన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటే వాళ్లు అలాగే ఉండాలన్నట్లుగా విపక్షం ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. మంచిరేవుల దగ్గర మూసీ పరివాహకంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేస్తామనీ, అట్లాగే మూసీ పరివాహక ప్రాంతంలో గురుద్వార్‌, మసీదు, చర్చిలను నిర్మించి మత సామరస్యాన్ని చాటబోతున్నామని తెలిపారు.

డీపీఆర్‌ సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషసన్‌ ఇచ్చి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్‌ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి కావాలో చెప్పాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి తరలించే పేదలకు బ్రహ్మాండమైన కాలనీలు నిర్మిస్తామనీ, మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్ష నేతలు కడుపుల్లో విషం పెట్టుకుని మాట్లాడొద్దని చురకలు అంటించారు. బహుషా వారి మనస్సులు బాగు కావాలంటే వికారాబాద్‌ అడవుల్లో కొంత కాలం విడిచిపెడితే బాగుంటుందేమో అని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -