నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలోని మోతే మండలంలో భూమి వివాదం కారణంగా తండ్రిని గొడ్డలితో హత్య చేసిన కేసులో కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మరబోయిన గంగయ్య అనే 35ఏళ్ల రైతును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.శుక్రవారం స్థానిక యస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు.
ఈనెల 2 వ తేదీన మోతే మండలంలోని విభళాపురం గ్రామ శివారులో నిమ్మరబోయిన వెంకన్న (60) అనే రైతు రక్తపు గాయాలతో రోడ్డుపక్కన పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు మోతే పోలీసులు అక్కడికి చేరుకుని వెంకన్నను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. వెంకన్న కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోతే పోలీసులు హత్య కేసు (ఐపిసి 302) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తదుపరి విచారణలో వెంకన్న కుటుంబానికి చెందిన 4.29 గుంటల భూమి విషయంలో కొడుకులు, తండ్రి మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని పోలీసులు గుర్తించారు.
భూమి సమస్యను పెద్దమనుషుల సమక్షంలో చెరో వాటాలు కేటాయిస్తూ అగ్రిమెంట్ చేసినప్పటికీ, వెంకన్న తన వాటా భూమిని అమ్మేశాడన్న ఆగ్రహంతో గంగయ్య తండ్రి పై కక్ష పెంచుకున్నాడు. జూలై 2న వెంకన్న ఒంటరిగా ప్రయాణిస్తుండగా బైక్‌పై గొడ్డలి తీసుకుని వెంబడించిన గంగయ్య, హెల్మెట్ ధరించి గుర్తు తెలియకుండా గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుడిని జూలై 4వ తేదీ ఉదయం మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, రక్తపు మరకలున్న గొడ్డలి, హెల్మెట్, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు.
మోతే ఎస్ఐ యాదవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ భూమి వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుడిపై రౌడీ షీటు కూడా తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతే ఎస్ఐ యాదవేందర్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.