– నిందితుడి అరెస్ట్ ఆయుధాలు, బంగారు గొలుసు స్వాధీనం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద కాలనీలో కన్నతల్లిపై మద్యంమత్తులో కన్నకొడుకు ఇనుపరాడ్డుతో హత్యాయత్నం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, దొంగతనానికి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సోమవారం కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుందినీ, బాధితురాలి భర్త వివేకానంద కాలానికి చెందిన కంచర్ల శంకర్ (కామారెడ్డి) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
ఆయన చేసిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు కంచర్ల రాజేష్ (35), మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన తల్లి కంచర్ల గౌరవ్వ (56)తో గొడవకు దిగాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అమ్మి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నేరపూరిత ఉద్దేశంతో ఇనుప రాడ్‌తో ఆమె ముఖం, తలపై పదేపదే దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన మహిళను పెట్రోలింగ్ కారులో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 24 గంటల లోపే నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం దాడికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, బాధితురాలి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ నరహరి, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.



