నవతెలంగాణ – వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో గురువారం జరిగిన మాజీ నక్సలైట్ హత్య కేసు సంచలనంగా మారింది. తండ్రిని 46 ఏండ్ల క్రితం హత్య చేసిన వ్యక్తిపై కొడుకు ప్రతీకారం తీర్చుకున్న ఘటనగా వెలుగులోకి వచ్చింది. తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట్‌కు చెందిన మాజీ నక్సలైట్, బీఆర్‌ఎస్ నాయకుడు బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దయ్య (58) గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ కోసం రావాలని జగిత్యాల నివాసి జక్కుల సంతోష్ పిలవడంతో, నర్సయ్య ఇంటి నుండి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అగ్రహారం సమీపంలోని గుట్టల వద్ద రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతుడి కుటుంబం వ్యక్తం చేసిన అనుమానాల పై సంతోష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా ప్రధాన నిందితుడు సంతోష్ స్వయంగా జగిత్యాల టౌన్ పీఎస్‌లో లొంగిపోయాడు. హత్య చేసినట్లు ఆయన అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సుమారు 46 ఏళ్ల క్రితం అండర్‌గ్రౌండ్ సమయంలో నర్సయ్య పార్టీ ఆదేశాల మేరకు సంతోష్ తండ్రి, పెద్దన్నను హత్య చేసినట్టు, ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంతోష్‌కు తెలిసినట్లు తేలింది. సంతోష్, నర్సయ్యకు అభిమాని అంటూ దగ్గరవుతూ.. ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం రచించినట్టు అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రం అగ్రహారం గుట్టకు మోసగించి పిలిపించి, నర్సయ్యను దారుణంగా హతమార్చి, అనంతరం జగిత్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంఘటన వివరాలు తెలిపిన సంతోష్ ను వేములవాడ పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.



