Sunday, May 18, 2025
Homeసోపతిఅలక మంచమెక్కిన అమ్మాయిపాట

అలక మంచమెక్కిన అమ్మాయిపాట

- Advertisement -

మన తెలుగు సినిమాపాటల్లో అలకలు తీర్చే పాటలు చాలానే ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ అలకను తీరుస్తూ పాడే పౌరాణికగీతాలు కావచ్చు. లేదా.. ఓ భర్త భార్య అలకను తీరుస్తూ పాడేవి, ప్రేమికుడు ప్రేయసి అలకను తీరుస్తూ పాడేవి, అన్న చెల్లెలి అలకను తీరుస్తూ పాడేవి.. పిల్లలు తల్లిదండ్రుల అలకలు తీరుస్తూ పాడేవి.. ఇలా సందర్భం ఏదైనా అలకపాటకున్న ఆ అందమే వేరు. అన్ని పాటలతో పోల్చి చూస్తే అలకపాటలు మరింత వయ్యారంగా, గారాబంగా కనిపిస్తుంటాయి. అందమైన ప్రేమజంట పాడుకునే ఓ అలకపాట 2021 లో బి. కిషోర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకారం’ సినిమాలో పెంచల దాస్‌ రాసిన ఆ పాటనిపుడు చూద్దాం.
పెంచల దాస్‌ రాయలసీమ ప్రాంతానికి చెందిన జానపద గాయకుడు, గీతరచయిత. రాయలసీమ మాండలికపదాలతో ఎంతో అద్భుతంగా ఈ పాట రాశాడు. ఈ పాటలో శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ లు కూడా బాగా నటించారు. అలిగి ఉన్న కథానాయిక ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను బుజ్జగిస్తూ, బతిమిలాడుతూ హీరో శర్వానంద్‌ ఈ పాట పాడుతుంటాడు. పాట మొత్తం కొంటె పదాలతో, హాయి తొణికిసలాడే మాటలతో సాగుతుంటుంది.
హీరోయిన్‌ హీరోతో గొడవపడి, అలిగి చెరువు కట్టమీద నుంచి వయ్యారంగా నడుచుకుంటూ పోతుంటుంది. ఆ సమయంలో హీరో ఈ పాట పాడుతాడు.
హీరో భావాలు నచ్చి, ఆయన విధించిన నియమ నిబంధనలకు లోబడి, తన తల్లిదండ్రులను కాదని, సుఖజీవితాన్ని వదులుకొని, హీరో కోసం అతని ఊరికి వచ్చేస్తుంది హీరోయిన్‌. అతనితో కలిసి వ్యవసాయం చేస్తూ కష్టపడుతుంది. అతనితో కలిసి బతకడానికి నిర్ణయించుకుంటుంది. ఏదో చిన్న గొడవతో అలకలోకి జారుకుంటుంది హీరోయిన్‌. ఇది ఇక్కడ సందర్భం.
మరి తనకోసం వచ్చిన అమ్మాయి కదా. మరి వచ్చానంటివి. మళ్ళీ ఇపుడు అలిగి వెళ్ళిపోతానంటున్నావు. ఎందుకలా? బాలా.. అంటూ చిలిపిగా, కొంటెగా అడుగుతాడు హీరో. అలా.. నువ్వు చెరువుకట్ట మీద నుంచి వయ్యారంగా చిలకలాగా నడిచిపోతుంటే ఎంతో బాగుంది. భలేగా ఉంది. నీ ఎద మీద ఉన్న పూలరైక కూడా చాలా చాలా బాగుందని అంటాడు. ఆమె ఎద అందాన్ని గురించి, ఆ ఎదకు అందాన్నిచ్చే పువ్వులు గుర్తులుగా ఉన్న రైక గురించి చిలిపి చిలిపిగా చెబుతుంటాడు. ఇదీ జానపదీయుల సరసమంటే.. ఇందులో కట్టమింద పొయ్యే అంటాడు. కట్టమీద అనడు. జానపదుల యాసలో ‘మీద’ అనే పదం, మిందగా, మీనగా ఉచ్చరించడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఆమె వయ్యారి. యవ్వనంలో ఉండి, చెప్పలేనంత అందంగా, సొగసుగా ఉంది. ఎప్పుడూ నవ్వు మొఖంతో ఉండే ఆమె ఇవాళ మాత్రం అలకతో ఉంది. నవ్వుతో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందో ఆ ముఖం అలకలో కూడా అంతే అందంగా ఉందట.. ముక్కు మీద కోపంతో చిరాకుపడే అందమైన అందమట అది.
పిచ్చి కోపంతో, తిక్కరేగి ఆమె అలక అనే నులకమంచాన్ని ఎక్కిందట. ఎంత బాగుంది కదా ఈ ప్రయోగం. తిక్కరేగడం అనే పదం మనం తరచుగా వాడే పదమే. అలక మంచం ఎక్కడం అని అనడం మామూలు విషయమే. ఇది తరచుగా చాలామంది చాలా చోట్ల వాడిన పదమే. కాని అలక అనే నులకమంచంను ఆమెను ఎక్కిందనడం కొత్తగా ఉంది. నులకతాడుతో అల్లిన మంచమని ఇక్కడ అర్థం. నులకమంచం పల్లెటూళ్ళలో కనిపిస్తుంటాయి. ఇది జానపద స్పర్శను తలపిస్తోంది. అంతేకాదు ఆమె అలిగి ఎక్కిన మంచాన్ని హీరో కూడా ఎక్కి ఆమె అలకతీర్చాలనే కొంటె శృంగారం కూడా ఇక్కడ అంతర్లీనంగా కనిపించడం విశేషం.
ఆమెను అలసంద పువ్వుతో పోల్చడం బాగుంది. అలసందను అలచంతగా, అల్చెంతగా మనం పిలుస్తుంటాం. అలా అలసందతీగకు పూసిన పువ్వుగా ఆమెను చూడడం కూడా అందమైన జానపద సొబగును కళ్ళముందుంచుతుంది. అలసంద పువ్వా.. నువ్విలా అగుడు చేయకు అని అంటాడు. ‘అగుడు’ అనే పదానికి ‘అపహాస్యం’, అని, ‘నవ్వులాట’ అని, ‘అల్లరి’ అని చాలా అర్థాలున్నాయి. అంటే.. నువ్వు అలా అలిగివెళ్ళిపోతే నేను ఎలా తట్టుకోగలను. నన్ను వేధించి నువ్వు నవ్వుకోకు అని ఇక్కడ అర్థం.
నీ చూపు అందమైనది. అందునా.. కోపంగా ఉంది కాబట్టి చురుకు చూపు అన్నాడు. ఆ చురుకు చూపుతో పదునైన కత్తుల్ని విసరకు. నేను తట్టుకోలేను. కోపంతో చూసే నీ చూపులు, అలకతో ఉన్న నీ చిలిపి నవ్వులు.. పచ్చి కారమైనా, మాడిన కారమైనా.. ఏది ఏమైనా నీ మూతి విరుపులు భలే బాగున్నాయి.. అని అంటున్నాడు. ముదికారం అనే పదప్రయోగం ఇక్కడ వాడబడింది. ముదికారం అంటే బాగా మాడిన కారమని అర్థం. అంటే.. ఆమె అలకలో ఉంది కాబట్టి బాగా ఎర్రబడి మాడిన కారం అనే అర్థంలో ఆమె చూపులను, నవ్వులను సూచిస్తున్నాడు. అలకలో లేనప్పుడు ఆమెను ఎలా స్వీకరించాడో అలకతో ఉన్నా అలాగే స్వీకరిస్తానన్న అర్థంలో ప్రయోగించాడు.
సరే. నీ అలకతీరాలంటే నేను ఏ మద్దతు ఇవ్వాలి. నేనేం చేయాలి.. నీకు ఏం కావాలి చెప్పు. అని అడుగుతాడు. అంతలోనే చిరునవ్వు నవ్వి, నువ్వు పక్కన లేకుంటే వెన్నెల కూడా నాకు నచ్చదు. నువ్వుంటే చాలు నాకు ఇంకా ఏమీ వద్దు. రా.. వచ్చి నన్ను దగ్గరికి తీసుకో.. నువ్వు నన్ను పట్టించుకోకపోవడం వల్లనే నాకు ఈ కోపం, అలక రెండూ కలిగాయి. నువ్వు ఎప్పుడూ నాతో ఉంటానని చెప్పు.. ఈ అలక చిటికెలోన ఎగిరిపోతుంది. అని ఆ అమ్మాయి ప్రేమగా చెబుతుంది. హీరో కౌగిట చేరుతుంది.
ఇది సినిమా కోసం రాసిన పాటే అయినా ఇందులో ప్రేయసీప్రియుల ప్రేమ, జానపదుల శంగారం, నీటు సరసం కనబడుతున్నాయి. ఈ పాట వింటూంటే పల్లెల్లో భార్యాభర్తల అలక సన్నివేశాలు కళ్ళముందు కనబడతాయి.
పాట:
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే/
కట్ట మింద పొయ్యే అలకల చిలక భలేగుంది బాలా/
దాని ఏదాన ఉండే పూల పూల రైక భలేగుంది బాలా/
నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా/
నీ నవ్వు మొఖం మింద/ నంగనాచి అలక భలేగుంది బాలా/
అరెరెరే తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం/
అలసంద పువ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా/
సురుకూ సూపు సుర కత్తులిసరకే../
చింత ఎలా బాలా కారమైన ముది కారమైన/
నీ మూతి ఇరుపులు భలేగున్నాయి బాలా/
నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను భామ/
ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట/
నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేరా రావా/
ఇంకనైనా పట్టించుకుంటానని మాట ఇవ్వు మావ/
తుర్రుమంటూ పైకెగిరి పోద్ది/ నా అలక చిటికలోనా..

  • డా||తిరునగరి శరత్‌చంద్ర,
    sharathchandra.poet@yahoo.com
    సినీ గేయరచయిత, 6309873682
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -