ఐద్వా సీనియర్ నాయకులు టి.జ్యోతి
14వ జాతీయ మహాసభల ఆడియో పాటలు ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల నేపథ్యంలో అందుబాటులోకి తెచ్చిన ఆడియో పాటలు బాగున్నాయనీ, మహిళా ఉద్యమాలు, సమస్యల్ని ప్రతిభింభించేలా ఉన్నాయని ఐద్వా సీనియర్ నాయకులు టి.జ్యోతి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో పీఎన్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆడియో పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మహిళలు సాధిస్తున్న విజయాలకు, సవాళ్లపై చేస్తున్న పోరాటాలకు ఐద్వా అండగా ఉంటుందని తెలిపారు. ఐద్వా మహిళలను ఏ విధంగా చైతైన్య పరుస్తున్నది, మహాసభలకు కదిలిరావాలనే సందేశాలతో పాటల రచన చాలా బాగుందని ప్రశంసించారు.
ఈ పాటలను ప్రముఖ రచయిత కాకం అంజన్న రచించగా ప్రజానాట్యమండలి సమర్పణలో రికార్డ్ చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సోషల్ మీడియా ఇంఛార్జ్ బండారు రవి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఐద్వా అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, పీఎన్‌ఎం రాష్ట్ర నాయకులు ఎన్.మారయ్య, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, కర్నిక శంకర్, యాటల సోమన్న, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్ ఆశాలత, రాష్ట్ర నాయకులు ఎం.స్వర్ణలత, డి.ఇందిర, కవిత, సీఐటీయూ నాయకులు పద్మశ్రీ పాల్గొన్నారు.



