Monday, December 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుత్వరలో తెలంగాణలో సర్‌

త్వరలో తెలంగాణలో సర్‌

- Advertisement -

బీహార్‌లో బీఎల్‌ఓలు ఆదర్శంగా నిలిచారు
‘సర్‌’ నిరంతర ప్రక్రియ
ఆధార్‌ గుర్తింపు కార్డే.. పౌరసత్వ నిర్ధారణ కాదు
దాన్ని ఓటర్‌ కార్డుతో లింక్‌ చేయలేం
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ వెల్లడి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
త్వరలో తెలంగాణలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌.ఐ.ఆర్‌) ప్రక్రియను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ తెలిపారు. దీనికి బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఏటా ఓటర్ల జాబితాల సవరణ ఉంటుందనీ, కొత్తగా వచ్చే ఓటర్లు, మరణించిన, బదిలీ అయినవారి వివరాలతో మారుతూనే ఉంటాయన్నారు. ‘సర్‌’ నిరంతర ప్రక్రియ అని స్పష్టంచేశారు. ఇప్పటికి 13 రాష్ట్రాల్లో ఆ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే ‘సర్‌’కు అందరూ సహకరించాలని కోరారు. భారత ఎన్నికల వ్యవస్థలో బీఎల్‌వోలదే కీలకపాత్ర అని చెప్పారు. ఓటర్‌ కార్డులకు ఆధార్‌ను లింక్‌ చేయాలనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఆధార్‌ కార్డు కేవలం గుర్తిపు కార్డు మాత్రమేననీ, పౌరసత్వ గుర్తింపునకు రుజువు కాదని తేల్చిచెప్పారు. దాన్ని ఓటర్‌ గుర్తింపు కార్డుకు లింక్‌ చేయడం కుదరదని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ (బీఎల్‌వో)తో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

దీనికి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్ఞానేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా శుద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఇటీవల బీహార్‌ లో విజయవంతంగా పూర్తయిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. భారత ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణకు బీఎల్‌వోలే వెన్నెముక అని చెప్పారు. వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా శుద్ధి విజయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రపంచం మొత్తం భారతదేశ ఎన్నికల నిర్వహణను ఆసక్తిగా గమనిస్తున్నదని తెలిపారు. బీహార్‌లో భారీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదనీ, రీపోలింగ్‌, రీకౌంటింగ్‌ అవసరం రాకపోవడం విశేషమని అన్నారు.

ఈ విజయానికి కారణమైన బీహార్‌ బీఎల్‌వోలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తెలంగాణ విస్తీర్ణం కెనడా కంటే పెద్దదని పేర్కొన్నారు. సమగ్ర ఓటర్ల జాబితా శుద్ధి పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల పరిపాలన ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతోందన్నారు. పలువురు బీఎల్‌వోలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలను వివరించారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య, జిల్లాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాలు తదితర వివరాలను వివరించారు. సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వరరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, సీనియర్‌ డిప్యూటీ సీఈసీ పవన్‌కుమార్‌ శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ఓటర్లే దేశానికి దారి చూపుతున్నారు
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉండటానికి పట్టణ ఓటర్ల నిరాసక్తతే ప్రధాన కారణమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఉత్సాహం గా క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగిస్తూ దేశానికి దారి చూపుతున్నారని తెలిపారు. భారతదేశంలో ఎన్నికలు పూర్తిగా దేశ చట్టాల ప్రకారమే నిర్వహిస్తున్నామనీ, ఆ చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. ‘ఇంటర్నేషనల్‌ ఐడియా’కు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మనదేశానికి చైర్మెన్‌ పదవి లభించిందని తెలిపారు. ఇది భారత ఎన్నికల సంఘం ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, వినూత్న ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందిందనడానికి నిదర్శనమని చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -