Magazines

అందమైన బాల్యం పిల్లల జన్మహక్కు

1 గంట క్రితం

A beautiful childhood is the birthright of children.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 4 నిమిషాల చదవడం

ప్రకృతి ఒడిల ఉడతలు, పిట్టల వలే పిల్లలు కూడా అరుపులు, కేకలు వేస్తూ, సీటీలు కొడుతూ ఆడుతుంటే ఆ అల్లరి మనల్ని మురిపించి, మైమరిపించేది. చిన్నతనం ఎవరికైనా జ్ఞాపకాల అనుభూతి. ఒకప్పుడు పిల్లల ఆట-పాటలకు గడియారాలుండేవి కావు. వారి ఆటలకు హద్దులుండేవి కావు. ఆనందం, ఆహ్లాదం మాత్రమే ఉండేవి. ఎనుకటి పిల్లలు స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటలు ఆడేవారు. ఆటల తోటి పిల్లలకు మానసిక ఉల్లాసం, వ్యాయమం దొరికేది. శరీరనికి చక్కటి ఎదుగుదల నిచ్చేవి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. పిల్లలకు ఆటలు ప్రేమానురాగాలను, ఆత్మీయతను పంచేవి. లోకం తీరును, సంస్కృతిని ఎలుగెత్తి చూపేవి. మానవత్వం, సానుభూతి, స్పందించే గుణం, గౌరవం, విలువలు వంటివి పిల్లలు ఆడి, పాడి నేర్చుకోనేవారు. ఆ కాలంలో సదువులందు, ఆటలందు, పెద్దలతోనూ పిల్లలకు సంతృప్తి కరమైన జీవితం ఉండేది. ఇదంతా ఒకప్పటి ముచ్చట.


ఇయాల పొరుగు, పాశ్చాత్య ఆటలొచ్చాయి. సాంకేతిక సదువులంటూ, ర్యాంకుల కోసం, గెలుపు-ఓటముల నడుమన పిల్లలను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుండ్రు. ఒత్తిడిని తగ్గించ ఏదైన ఆటలాడుదామంటే అవి కేవలం పోటీలకే పరిమితం అయినాయి. ఇయ్యాల ‘కాసుల ఆటలు, కంప్యూటర్ ఆటలు, కత్తి ఆటలు, కడతేర్చే ఆటలు’ అందరికీ అవకాశం లేదు. అవి కొందరికే పరిమితం అయ్యాయి. ఆటలు పిల్లల ఆర్థిక, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

మారుతున్న పరిస్థితులతోపాటు పాశ్చాత్య ఆటలొచ్చి మన పిల్లల జీవన విధానంపైన, బాలల భవితవ్యం పైన కాల నాగుల్లా కాటేస్తుంటే ‘బాలమిత్ర’ భయపడి పోయింది. ‘చందమామ’ను సాగనంపినం.

​A beautiful childhood is the birthright of children.ఆటలకు దూరమై...

నీతి కథలు నీట ముంచినం. తట్లు (పొడుపు కథలు) తుడ్సుక పోయినయి. పిల్లల్లో ఆనందం, ఆహ్లాదం పత్తా లేకుండ పోతున్నాయి. పిల్లలు క్రమంగా తమ బాల్య స్వభావాన్ని కోల్పోతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఆటలకు దూరమై పోతున్నారు. ఈ కారణంగా వాళ్లల్లో బద్దకం, భయం, అనారోగ్యం పెరిగి, ఆత్మ విశ్వాసం కొరవడడం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు పిల్లలకు రాకూడదని ముందుచూపుతోటి భారత రాజ్యాంగం ఆర్టికల్-24 ద్వారా పిల్లలకు హక్కులు కల్పించింది. ఈ హక్కులను గమనిస్తే, పిల్లల వికాసం కోసం వారిలో ఉన్న శక్తి సామార్థ్యాలు, నైపుణ్యాలను బయటకు తీసి పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు పరచవలసిన విషయాన్ని సమాజం గుర్తించుకోవాలి.

​అవగావాన కల్గిఉండాలి

జీవించడం, ఆహారం పొందడం, విద్య, వైద్యం, వినోదం, విశ్రాంతి తీసుకోవడం, సామాజిక భద్రత కల్పించడం వంటి పిల్లల హక్కులను ఐక్య రాజ్య సమితి 1989న ప్రతిపాదిస్తుంది. ఇట్టి హక్కులను భారత ప్రభుత్వం 1992న ఆమోదించిన సంగతి అందరూ తెలుసుకోవాలి. వాటి అమలు తీరును పర్యవేక్షించాలి. బాల్యవివాహాల హక్కుల చట్టం - 2006 ప్రకారం చిన్నతనంలో పెండ్లి చేస్తే వచ్చే అనర్థాలను అవగాహన కలిగివుండాలి. బాల్య వివాహాలు జరపకుండా బాధ్యత వహించాలి. లైంగిక వేధింపుల నిషేధ చట్టం - 2012 గురించి తెలిసి వుండాలి. ఈ చట్టాలను ఆతిక్రమిస్తే, వచ్చే చట్ట పరమైన చిక్కులపైన అవగావాన కల్గిఉండాలి. సమాజం క్రమశిక్షణ తోటి మెలగాలి. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం -2009 ప్రకారంగా 6 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు ఉచిత నిర్భంద విద్యను అందించాలి. బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి, వారిని బడిలో చేర్పించి, విద్యను వారి మానసిక స్థితిని బట్టి బోధించాలి. పిల్లలను పనిలో పెట్టరాదన్న సమాచారం తెలిసి ఉండాలి. పిల్లలు చెడు వ్యసనాలకు గురి కాకుండా, వాటి వలన కలిగే అనర్థాలను కౌన్సెలింగ్ శిక్షణల ద్వారా తెలియ పరచాలి. వారు క్రమశిక్షణతో మెలగటానికి తోడ్పాటును అందించాలి.

​వికలాంగ బాలల హక్కులు

వికలాంగ బాలల స్థితిగతులు హీనంగా, బహు ఘోరంగా ఉంటాయి. పిలిచే పిలుపు మొదలు కొని, చూట్టూ వున్న సమాజం చూసే విధానం వరకు నిర్లక్ష్యం. వికలాంగ పిల్లలకు అవమానాలు ఎక్కువ, ఆదరణ తక్కువ. పిలుపు వెటకారం, చూసే విధానం చులకన. సానుభూతి ఎక్కువ. చేయూత తక్కువ. ఇంకా వికలాంగ బాలల హక్కులు పరిశీలిస్తే, సాధారణ పిల్లల్లాగే వీరి శక్తి సామర్య్థాలను, నైపుణ్యాలను గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించి వారి హక్కులను కాపాడి అమలు పరచాలని 2006 డిసెంబర్‌ 13‌న ఐక్యరాజ్యసమితి తీర్మానం చేస్తే, భారత సర్కార్‌ 2007 అక్టోబర్‌ 7‌న ఆమోదించింది. ఈ చట్టంలో చెప్పినవి కచ్చితంగా అమలు జరపాలని భారత సర్కార్‌ ‘దివ్వాంగుల హక్కుల చట్టం - 2016’ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారంగా ఆధరణ కరువై ఆట పాటలకు దూరమైన వికలాంగ పిల్లలను గుర్తించి, సాధారణ తోటి పిల్లలతో సమానంగా ఆడి, పాడి, సమాన అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా శిశుసంక్షేమ, వికలాంగ సంక్షేమ శాఖలు సమన్వయం తోటి ముందుకి నడవాల్సిన అవసరం ఎంతో వుంది.

A beautiful childhood is the birthright of children.ప్రత్యేక సౌకర్యాలు

బ్రెయిలీ లిపి, సైన్ ‌భాష పైన వికలాంగ పిల్లలకు, తల్లిదండ్రులకు, చుట్టుముట్టు వున్న సమాజానికి అవగాహన కల్పించే ప్రాముఖ్యతను సర్కార్‌ ‌గుర్తించాలి. ప్రత్యేకమైన విద్యను బోధించుటకు, ప్రత్యేక శిక్షణ పొందిన వారి చేతనే విద్యను అందించాలి. క్రీడా నిర్వహణ కోసం అర్హతలుండి, అనుభవం కల్గి, ప్రత్యేక శిక్షణ పొందిన పీయిటీలను బడిలో నియమించాలి. వికలాంగులను ఎక్స్‌‌పోజర్‌, పిక్‌‌నిక్‌‌లకు తీసుకుపోవడంతో పాటు సాధారణ పిల్లల తోటి సమానంగా వీరు కూడా సైన్స్‌ ‌ఫెయిర్‌‌లో పాల్గొని, వాటిని నడిపించేందుకు ప్రోత్సహించాలి. అవసరం మేరకు సాంకేతిక పరమైన ప్రణాళికలు రూపొందించి, సాంకేతిక పరమైన శిక్షణ ఇప్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లల వికాసం కోసం ప్రత్యేక వసతులు కలిగిన పార్కులను నిర్మాణం చేసే దిశగా సర్కారు చర్యలు చేపట్టాలి. వీరిని పెండ్లిళ్లకు, జాతరలకు, ఇతర కార్యక్రమాలల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలి. సాధారణ పిల్లలతోటి సమానంగా అవకాశాలు కల్పించి, ఆడి పాడి స్వేచ్ఛను, హక్కులను పొందడం కోసం, వారు ఆత్మగౌరవంతో కూడిన జీవనం గడిపేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలి.

విద్యా ప్రమాణాలు

పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించవలసిన అవసరం ఎంతో వుంది. భౌతిక, ప్రయోగాత్మక పద్ధతితో కూడిన జ్ఞానాన్ని విద్య ద్వారా అందించాలి. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించేట్టు ప్రోత్సహించాలి. సంస్కారవంతమైన విద్యను బోధించడం ద్వారా పిల్లల్లో ఆసక్తి, ఆలోచనలను ప్రేరేపించవచ్చు. చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, సాంకేతిక పరిజ్ఞానం అందించాలి. సోదర భావం, శీలత, విధేయత, దేశభక్తి భావాలను పిల్లల్లో పెంపొందించాలి. సమస్యలు వచ్చినప్పుడు, వాటిని అధిగమించడానికి కావలసిన నైపుణ్యాలను నేర్పించాలి. సమాజం పట్ల బాధ్యతను, విలువలు, గౌరవం తెలియజేసే విధంగా విద్యను బోధించాలి.

సామాజిక బాధ్యత

పిల్లలు స్వేచ్ఛగా ఆడి పాడి చదువుకొనేందుకు మంచి వాతావరణం కల్పించాలి. పిల్లల వికాసం కోసం వారి హక్కులు తెలుసుకుని గౌరవించాలి. పెద్దల ఆశయాలను పిల్లలపై రుద్దకూడదు. వారి ఇష్టం మేరకే సదువులు చెప్పించాలి. ర్యాంకుల కోసం పిల్లలను ఒత్తిడికి గురిచేయకూడదు. పిల్లలు నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రోత్సహించాలి. రోగాల బారిన పడిన పిల్లలను గుర్తించి, వైద్యం అందించి, రక్షణ కల్పించి కాపాడాలి. పిల్లలకు ఆనందం, ఆహ్లాదంతో పాటు ఆలోచింపజేసే భౌతిక, ప్రయోగాత్మక సినిమాలు తీసే అవసరం గుర్తించాలి. శాస్త్రీయ విధానాల సంస్కృతికంగా తీర్చిదిద్దాలి. భారత తొలి ప్రధాని పండిట్‌ ‌జవహర్‌‌లాల్‌ ‌నెహ్రూ ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని చెప్పిన సంగతిని మరవకూడదు. పిల్లల నడుమ కుల, మత, రాగ ద్వేషాల ప్రభావం పడకుండా, తారతమ్యాలు లేకుండా సామాజిక ప్రమాణాలు తెలియజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుటకు సమాజం నడుం కట్టాలి. సమానత్వం, శాంతి భావనలను కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నవసమాజ నిర్మాణం కోసం ‘అందమైన బాల్యం పిల్లల జన్మహక్కు’ అని గుర్తించి హక్కులను గౌరవించి పిల్లలు ఆత్మగౌరవంతో కూడిన జీవనం గడిపేందుకు ప్రోత్సహించడం సామాజికంగా అందరి బాధ్యత.

మల్లెపువ్వు బాలస్వామి, 9989611481

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్