Magazines

గని కార్మికుడి గుండెల్లో ‘సినిమా’ కల..!

2 గంటల క్రితం

cinema’ dream
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది నవం 08, 2026 | 3 నిమిషాల చదవడం

సినిమా రంగంలో అడుగు పెట్టడం ఒక ఎత్తయితే, అక్కడ నిలదొక్కుకోవడం ఇంకో ఎత్తు. అవకాశాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూడటం, తీరని ఆర్థిక ఇబ్బందులు, గుర్తింపు కోసం నిరంతర పోరాటం, అనుకోని మోసాలు, అవమానాలు, ఊహించని ప్రమాదాలు.. ఇలా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆ యువకుడు తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఒకవైపు సింగరేణి బొగ్గు గని కార్మికుడిగా ఒళ్లు హూనమయ్యే బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు వెండితెరపై తన ముద్ర వేయాలన్న మక్కువతో నిరంతరం శ్రమిస్తున్నారు. డ్యాన్సర్‌గా మొదలైన ప్రయాణం యాంకర్‌గా, రచయితగా, నటుడిగా సాగి.. ఇప్పుడు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు 37 ఏండ్ల దుభాష్‌ రాకేష్‌.


https://navatelangana.com/sopati---sopathi-21/a-mine-workers-heart-holds-a-cinema-dreamకళాకారుల గడ్డగా పేరొందిన గోదావరిఖనిలో 1989 మే 28న జన్మించిన రాకేష్‌.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌లో పెరిగారు. సింగరేణి కార్మికుడు దుభాష్‌ చంద్రయ్య, పద్మ దంపతులకు ఆయన మొదటి సంతానం. సెంటనరీ కాలనీలోని ప్రగతి స్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన రాకేష్‌.. కరీంనగర్‌ పారమిత కళాశాలలో ఇంటర్‌, పెద్దపల్లి గాయత్రి కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ బ్రిలియంట్‌ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆరో తరగతి నుంచే రాకేష్‌కు డ్యాన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఈ మక్కువే ఆయనను బుల్లితెర వైపు నడిపించింది. 2002లో జెమినీ టీవీ ‘డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌’ కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్ సోహైల్‌తో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఎంబీఏ పూర్తయ్యాక యాంకరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని విస్సా ఛానెల్‌లో ‘పంచ్‌ ఫంచ్‌’, రాజ్ మ్యూజిక్‌లో, అలాగే వినూత్న వంటల కార్యక్రమం ‘కుకింగ్‌ ఫీల్డ్‌’కు యాంకర్‌గా వందకు పైగా ఎపిసోడ్‌లు నడిపించారు.

గని కార్మికుడి గుండెల్లో ‘సినిమా’ కల..!యాంకరింగ్ నుంచి వెండితెర రచన దాకా..

బుల్లితెరపై రాణిస్తున్న సమయంలోనే రాకేష్‌కు రచనపై ధ్యాస మళ్లింది. ‘జబర్దస్త్‌ ఫన్నీ అన్న’ ప్రోత్సాహంతో జెమినీ టీవీ ‘జూలకటక’ కార్యక్రమానికి రచయితగా, నటుడిగా పనిచేసి మెప్పించారు. ఈ ప్రయాణంలో తెలంగాణ యాస పట్ల కొందరు చిన్నచూపు చూసినా, తన ప్రాంతీయ నేపథ్యాన్నే బలంగా మలుచుకుని ముందుకు సాగారు. 2018లో శేష్మతో వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలు పెరగడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో సొంతూరికి తిరిగొచ్చారు. అయినా కళపై ఉన్న ప్రేమతో ‘iSmart Idiots’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించగా.. తొలి వీడియోకే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. అలా వందకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లలో నటుడిగా, దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సోహైల్‌ నటించిన ‘బూట్‌కట్‌ బాలరాజు’ సినిమాకు తొలిసారిగా మాటల రచయితగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో రాకేష్‌ రాసిన డైలాగ్స్ విన్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వేదికపైనే ఆయనను ప్రత్యేకంగా అభినందించడం విశేషం.


గని కార్మికుడి గుండెల్లో ‘సినిమా’ కల..!మోసాలు, ప్రమాదాలు దాటుకుంటూ..

ఒకవైపు సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో జనరల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే.. మరోవైపు సినిమా అవకాశాల కోసం గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు తిరుగుతూ నిరంతరం పోరాడారు. ఈ క్రమంలో చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. దర్శకుడిగా అవకాశం ఇస్తామని ఒక నిర్మాత ఆరు నెలలు తిప్పించుకుని చివరకు మోసం చేయడంతో భారీగా ఆర్థికంగా నష్టపోయారు. మరోసారి సినిమా పనులపై వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, లక్షల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. అయినా సరే, ఆయనలోని సినిమా కల మాత్రం చావలేదు.

'డైరెక్టర్ రాకేష్'గా నిలవడమే లక్ష్యం!

ప్రస్తుతం రాకేష్‌ దర్శకత్వంలో రూపొందిన ‘విలేజ్‌ డూడ్స్‌’ అనే వెబ్‌సిరీస్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. అలాగే జెమినీ టీవీ ‘మాస్‌ జాతర’లో సద్దాం టీమ్‌లో ‘బంటి’ పాత్రతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన వద్ద 4-5 సరికొత్త కథలు సిద్ధంగా ఉన్నాయి. సరైన నిర్మాతలు లభిస్తే అద్భుతమైన సినిమాలు తీయాలని భావిస్తున్నారు. "ఎన్ని మోసాలు, ప్రమాదాలు ఎదురైనా నా ప్రయాణం ఆగదు. వెండితెరపై ‘డైరెక్టర్‌ రాకేష్‌’గా పేరు తెచ్చుకోవడమే నా జీవిత ధ్యేయం" అని ధీమాగా చెబుతున్నారు. గని కార్మికుడిగా చెమటోడుస్తూనే, వెండితెరపై దర్శకుడిగా సత్తా చాటాలనుకుంటున్న రాకేష్ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం!



గని కార్మికుడి గుండెల్లో ‘సినిమా’ కల..!





రాజాబాపు ఓదెల , 94932 61367

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్