Magazines

అవగాహనే రక్షణ

11 గంటల క్రితం

అవగాహనే రక్షణ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 7 నిమిషాల చదవడం

(అక్టోబర్‌ ‌నెల రొమ్ము కాన్సర్ అవగాహనా మాసం)
రొమ్ము క్యాన్సర్‌ అనే మాట వినగానే చాలామంది మహిళల్లో భయం మొదలవుతుంది. క్యాన్సర్‌ అంటే ప్రాణాంతక వ్యాధని, ఒకసారి వస్తే జీవితమే ముగిసిపోతుందని కొందరు భావిస్తారు. మరికొందరు రొమ్ములో చిన్న గడ్డ కనిపించినా అది క్యాన్సరేమో అని ఆందోళన చెందుతారు. ఇంకొందరు భయంతో అసలు వైద్యుడి దగ్గరకే వెళ్లరు. మన సమాజంలో మహిళలు తమ ఆరోగ్యం విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వారు తమకు ఏదైనా సమస్య వస్తే మాత్రం పట్టించుకోరు.

రొమ్ము క్యాన్సర్‌ అంటే ఏమిటి?

మన శరీరం కోట్లాది కణాలతో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా శరీరంలోని కణాలు ఒక క్రమపద్ధతిలో పెరుగుతాయి, విభజన చెందుతాయి. అవసరం లేని కణాలు నశిస్తాయి. ఈ ప్రక్రియను నియంత్రించడానికి మన శరీరంలో అనేక వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కణాల్లోని జన్యుపదార్థంలో మార్పులు ఏర్పడి వాటి పెరుగుదలపై నియంత్రణ తగ్గిపోతుంది. అప్పుడు ఆ కణాలు అవసరానికి మించి విభజన చెందుతూ పెరుగుతాయి. ఇలా నియంత్రణ లేకుండా పెరిగే కణాలు ఒక గడ్డగా ఏర్పడవచ్చు. అయితే శరీరంలో ఏర్పడే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కాదు. కొన్ని గడ్డలు క్యాన్సర్‌ కానివి. వీటిని నిరపాయమైన గడ్డలు అంటారు. మరికొన్ని గడ్డలు చుట్టుపక్కల కణజాలంలోకి చొచ్చుకుపోయి, శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. వీటిని క్యాన్సర్‌ గడ్డలు అంటారు. రొమ్ములో పాలు తయారయ్యే గ్రంథులు, పాలనాళాలు, కొవ్వు కణజాలం, రక్తనాళాలు, ఇతర కణజాలాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువగా పాలనాళాల్లో లేదా పాలు తయారయ్యే గ్రంథులకు సంబంధించిన కణాల్లో ప్రారంభమవుతుంది. ప్రారంభ దశలో క్యాన్సర్‌ రొమ్ముకే పరిమితమై ఉండవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు తరువాత చంకలోని శోషరస గ్రంథులకు, మరింత ముదిరినప్పుడు శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అందుకే వ్యాధిని సాధ్యమైనంత ముందుగా గుర్తించడం ఎంతో ముఖ్యం.

రొమ్ము క్యాన్సర్‌ ఎంత సాధారణం?

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. అదే ఏడాదిలో సుమారు 6.7 లక్షల మంది ఈ వ్యాధితో మరణించారు. భారతదేశంలో కూడా రొమ్ము క్యాన్సర్‌ ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. గతంలో ఈ వ్యాధి ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపించేదని భావించేవారు. కానీ ఇప్పుడు భారతదేశంతో సహా అనేక దేశాల్లో కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తోంది. అయితే రొమ్ము క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరగటానికి ఒకే కారణం లేదు. జనాభా పెరగడం, ఆయుర్దాయం పెరగడం, జీవనశైలి మార్పులు, కొన్ని ప్రమాద కారకాలు, వ్యాధిని గుర్తించే పరీక్షలు అందుబాటులోకి రావడం వంటి అనేక అంశాలు ఇందులో పాత్ర పోషిస్తాయి.

ఎందుకు వస్తుంది?

రొమ్ము క్యాన్సర్‌ రావడానికి ఒకే ఒక్క కారణం ఉండదు. వయసు, జన్యుపరమైన లక్షణాలు, హార్మోన్ల ప్రభావం, కుటుంబ చరిత్ర, జీవనశైలి, పర్యావరణ పరిస్థితులు వంటి అనేక అంశాలు వ్యాధి ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని ప్రమాద కారకాలను మనం మార్చలేం. మరికొన్నింటిని జీవనశైలి మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు. ముందుగా మనం మార్చలేని ప్రమాద కారకాల గురించి తెలుసుకుందాం.

వయసు పెరగడం: వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా 50 ఏండ్ల తర్వాత ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ. అయితే 30 లేదా 40 ఏండ్ల వయసులో కూడా రొమ్ము క్యాన్సర్‌ రావచ్చు. అరుదుగా అంతకంటే చిన్న వయసులోనూ కనిపించవచ్చు. అందువల్ల వయసుతో సంబంధం లేకుండా రొమ్ములో కొత్త మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర: కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి రొమ్ము క్యాన్సర్‌ రావడం, చిన్న వయసులో క్యాన్సర్‌ నిర్ధారణ కావడం, రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్లు తరతరాలుగా కనిపించడం వంటి పరిస్థితుల్లో జన్యుపరమైన ప్రమాదాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే రొమ్ము క్యాన్సర్‌ వచ్చిన మహిళల్లో చాలామందికి కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉండదు. అందువల్ల మా కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్‌ లేదు కాబట్టి నాకు రాదని భావించడం సరైంది కాదు. అలాగే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉందని ప్రతి మహిళకు తప్పనిసరిగా వస్తుందని కూడా కాదు.

జన్యుపరమైన మార్పులు: మన శరీరంలోని కొన్ని జన్యువులు కణాల పెరుగుదలను నియంత్రించడంలో, దెబ్బతిన్న జన్యుపదార్థాన్ని మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. వాటిలో BRCA1, BRCA2 అనే జన్యువులు ముఖ్యమైనవి. ఈ జన్యువుల్లో కొన్ని హానికరమైన మార్పులు వారసత్వంగా సంక్రమిస్తే రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అయితే ప్రతి మహిళకు జన్యు పరీక్షలు అవసరం లేదు. కుటుంబ చరిత్ర ఆధారంగా ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యుడు భావించినప్పుడు జన్యు సలహా, అవసరమైతే పరీక్షలు సూచిస్తారు.

హార్మోన్ల ప్రభావం: మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ వంటి హార్మోన్లు అనేక ముఖ్యమైన పనులు నిర్వహిస్తాయి. ఈ హార్మోన్లు రొమ్ము కణజాలంపై కూడా ప్రభావం చూపుతాయి. చిన్న వయసులోనే నెలసరి ప్రారంభం కావడం, ఎక్కువ వయసులో మెనోపాజ్‌ రావడం వంటి పరిస్థితుల్లో జీవితకాలంలో ఈస్ట్రోజెన్‌ ప్రభావం ఎక్కువకాలం ఉండవచ్చు. దీనివల్ల రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం కొంత పెరగవచ్చు. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి మహిళకు క్యాన్సర్‌ వస్తుందని అర్థం కాదు.

మార్చుకోగల ప్రమాద కారకాలు

 శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

 శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనికోసం రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి.

 వైద్యుల సలహా లేకుండా హార్మోన్‌ మందులు వాడకూడదు.

 మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. అయితే ఒక ముఖ్యమైన అపోహను తొలగించుకోవాలి. చక్కెర తింటేనే క్యాన్సర్‌ వస్తుందని, చక్కెర పూర్తిగా మానేస్తే క్యాన్సర్‌ కణాలు చనిపోతాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అలాగే ఏదైనా ఒక పండు, కూరగాయ లేదా మూలిక క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తుందని చెప్పడం కూడా సరైంది కాదు.

 బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదే సమయంలో తల్లికి కూడా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

స్వయంగా పరిశీలించుకోవాలి

ప్రతి మహిళ తన రొమ్ముల సాధారణ రూపం, ఆకృతి గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. దీనిని రొమ్ములపై అవగాహన లేదా బ్రెస్ట్‌ అవేర్‌నెస్‌ అంటారు. అద్దం ముందు నిలబడి రొమ్ముల ఆకృతి, చర్మం, చనుమొనల్లో ఏవైనా కొత్త మార్పులు ఉన్నాయా అని గమనించవచ్చు. స్నానం చేసేటప్పుడు లేదా పడుకున్నప్పుడు రొమ్ము, చంక ప్రాంతాల్లో కొత్తగా గడ్డలు ఉన్నాయా అని సున్నితంగా పరిశీలించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. నిర్దిష్ట పద్ధతిలో ప్రతి నెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ మరణాలు తగ్గుతాయని బలమైన ఆధారాలు లేవు. అందువల్ల స్వీయ పరీక్షను మామోగ్రఫీకి ప్రత్యామ్నాయంగా భావించకూడదు. అలాగే ప్రతిరోజూ రొమ్ములను పరీక్షించుకుంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెలసరి ముందు రొమ్ములు కొంత బరువుగా, నొప్పిగా అనిపించవచ్చు. నెలసరి తరువాత ఈ మార్పులు తగ్గవచ్చు. మెనోపాజ్‌ తర్వాత మహిళలు కూడా తమ రొమ్ముల్లో కొత్త మార్పులను గమనించాలి.

గడ్డ కనిపిస్తే ఏం చేయాలి?

రొమ్ములో గడ్డ కనిపించగానే క్యాన్సర్‌ అని నిర్ణయించుకోవద్దు. అలాగే అది సాధారణ గడ్డ అయి ఉంటుందని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుడిని సంప్రదించడం మొదటి పని. వైద్యుడు మహిళ వయసు, లక్షణాలు, కుటుంబ చరిత్ర, గడ్డ స్వభావం వంటి వివరాలను తెలుసుకుంటారు. అవసరాన్ని బట్టి రొమ్ములను పరీక్షించి అల్ట్రాసౌండ్‌, మామోగ్రఫీ లేదా ఇతర పరీక్షలు సూచించవచ్చు.

ఎప్పుడు చేయించుకోవాలి?

మామోగ్రఫీ ఎప్పుడు ప్రారంభించాలి, ఎంత తరచుగా చేయించుకోవాలి అనే విషయంలో వివిధ దేశాల వైద్య సంస్థల మార్గదర్శకాల్లో కొంత తేడా ఉంది.

భారత ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాల్లో 30 ఏండ్లు పైబడిన మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ లక్షణాల గురించి అవగాహన కల్పించడం, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది ద్వారా క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఉంది. అందువల్ల ప్రతి మహిళ ఒకే వయసులో మామోగ్రఫీ ప్రారంభించాలనే నియమం అన్ని సందర్భాల్లో వర్తించదు. వయసు, కుటుంబ చరిత్ర, రొమ్ము సాంద్రత, గత పరీక్షల ఫలితాలు, వ్యక్తిగత ప్రమాద స్థాయి వంటి అంశాలను బట్టి వైద్యుడితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌కు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే చికిత్స ఫలితం క్యాన్సర్‌ రకం, దశ, కణాల లక్షణాలు, మహిళ మొత్తం ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్‌ చికిత్స, కీమోథెరపీ, హార్మోన్‌ చికిత్స, లక్ష్యిత ఔషధ చికిత్స, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలు ఉంటాయి.

చికిత్స సమయంలో ఎదురయ్యే సమస్యలు

క్యాన్సర్‌ చికిత్స శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపవచ్చు. శస్త్రచికిత్స వల్ల శరీర ఆకృతిలో మార్పులు రావచ్చు. కీమోథెరపీ సమయంలో కొందరికి జుట్టు రాలడం, వికారం, అలసట, ఆకలి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని చికిత్సల వల్ల నెలసరి, సంతానోత్పత్తి సామర్థ్యం, ఎముకల ఆరోగ్యం వంటి అంశాలు కూడా ప్రభావితమవచ్చు. అయితే ఈ దుష్ప్రభావాలు అందరికీ ఒకేలా ఉండవు. చికిత్స పద్ధతి, మందుల రకం, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతాయి. ప్రస్తుతం అనేక దుష్ప్రభావాలను తగ్గించడానికి మందులు, సహాయక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల చికిత్స సమయంలో ఎదురయ్యే సమస్యలను వైద్యులకు తెలియజేయాలి. క్యాన్సర్‌ చికిత్సను స్వయంగా ఆపకూడదు.

చికిత్స తర్వాత...

అనేక మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత తమ కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవితాలను కొనసాగిస్తున్నారు. అయితే చికిత్స పూర్తయిన తరువాత కూడా వైద్యుల సూచనల ప్రకారం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. కొన్ని మందులను ఏండ్ల తరబడి ఉపయోగించాల్సి రావచ్చు. శారీరక శ్రమ, సమతుల ఆహారం, తగినంత నిద్ర, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం ముఖ్యమైనవి. కొంతమందికి చికిత్స తర్వాత అలసట, చేతి వాపు, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉండవచ్చు. వీటికి కూడా తగిన వైద్య సహాయం తీసుకోవాలి. క్యాన్సర్‌ చికిత్స తర్వాత జీవితం అంటే కేవలం వ్యాధి లేకుండా ఉండటం మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన సహాయం అందించడం కూడా ముఖ్యం.

ఆరోగ్య వ్యవస్థ బాధ్యత కూడా ఉంది

రొమ్ము క్యాన్సర్‌ గురించి మాట్లాడేటప్పుడు మహిళల వ్యక్తిగత బాధ్యతను మాత్రమే ప్రస్తావించడం సరిపోదు. సరైన సమయంలో పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన రోగనిర్ధారణ సేవలు, అవసరమైన మందులు, శస్త్రచికిత్సలు, రేడియేషన్‌ చికిత్స అందుబాటులో ఉండాలి. క్యాన్సర్‌ అనుమానం ఉన్న మహిళలకు పరీక్షల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకూడదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు సరైన మార్గదర్శకత్వం, అవసరమైన ఆసుపత్రులకు పంపించే వ్యవస్థ ఉండాలి. చికిత్స ఖర్చుల వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, సామాజిక భద్రతా చర్యలు ఉపయోగపడాలి. క్యాన్సర్‌ నియంత్రణ అనేది కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. ఇది ముఖ్యమైన ప్రజారోగ్య బాధ్యత కూడా.

మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి

మన సమాజంలో చాలామంది మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలకు జ్వరం వచ్చినా, భర్తకు ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ తమకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రం పనులు పూర్తయ్యాక చూద్దామని వాయిదా వేస్తారు. రొమ్ములో గడ్డ కనిపించినా, చనుమొన నుంచి స్రావం వచ్చినా, చర్మంలో మార్పులు కనిపించినా కొందరు నెలల తరబడి పట్టించుకోరు. ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు. మీ ఆరోగ్యం కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమైనది.




డా. ఎం. రమాదేవి ప్రొఫెసర్‌ & విభాగాధిపతి శరీర ధర్మశాస్త్ర విభాగం గాంధీ వైద్య కళాశాల

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్