ఎన్నో ఏళ్ళుగా అంతరంగంలోకి కనుమరుగయిపోయిన భావాలు, అభిప్రాయాలు, ఆసక్తులు, ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఇవే వ్యక్తుల కెరీర్ పాత్లను నిర్దేశిస్తాయి. వాటిని పరిశోధించ గల్గితే కెరీర్ పాత్ను కనుగొనటం సులభం.
ఏ రకమైన కెరీర్ను ఎంచుకోవాలో తెలియని అయోమయపు స్థితిలో పడి పోయినపుడు యువకులు మరింత పరిశీలనాత్మక దృష్టిని అలవర్చుకోవల్సి వుంటుందని అమెరికాకు చెందిన కెరీర్ కౌన్సెలర్లు జోడీ గాథోర్డ్, కార్డెల్ ఫిలిప్స్లు అంటున్నారు. కెరీర్ ఎంచుకోవడం ఒక ప్రధాన సమస్యగా మారి, అడవిలో దారితప్పిన బాటసారిలా తడబడే పరిస్థితి ఎదురైనపుడు వ్యక్తులు ఒకసారి వెనక్కి తిరిగి తమ బాల్యాన్ని గమనించాలి. మనం బాల్యదశలో వున్నపుడు పలు రకాల ఆటలను ఆడుతుంటాం. ఆయా ఆటల్లో వివిధ రకాల పాత్రలను పోషిస్తూవుంటాం. వాటిల్లో కొన్ని పాత్రలు మనలను బాగా ఆకట్టుకుంటాయి. మన అభిమాన పాత్రలు రూపొందుతాయి. ఈ అభిమాన పాత్రలే మనలో వున్న అసమాన ప్రతిభలకు నిదర్శనాలని ఈ కౌన్సెలర్లు అంటున్నారు. అవి మన కెరీర్ పాత్రను సుస్పష్టమైన విధానంలో సూచిస్తాయని అంటున్నారు. కెరీర్ రంగంలో కొంతమంది డాన్సర్లుగా, మరికొంతమంది పారిశ్రామికవేత్తలుగా, ఇంకొంతమంది రోదసీ పరిశోధకుల్లా ఎదుగుతున్నారంటే కారణం వారి వారి బాల్యదశల్లో ఆయా కెరీర్కు సంబంధించిన పోకడలు కల్గిన ఆటలను ఆడటమే ప్రధాన కారణమని అంటున్నారు. బాల్యదశలో ప్రతివ్యక్తి తన మనసును మరింత ఎక్కువగా రంజింపచేసే ఆటలనే ఆడతాడు. సరదాగా అన్పించే ఆటలకే ఎక్కువ మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో రేపటి ఉజ్వల భవితకు కారణమయ్యే ఆసక్తిని పెంపొందించుకుంటారు.
డైలమా ఎందుకు ?
బాల్యదశలో ఏర్పడిన ఆసక్తులు, పెద్దయ్యాక కూడా అదే సాంద్రతతో ప్రతివ్యక్తి మనసులోనూ సుస్ధిరంగా వుంటాయి. అంచేత ఒక కోణంలోంచి పరిశీలిస్తే ఏ వ్యక్తి
అయినా తనకు నచ్చిన కెరీర్ను ఎంచుకోవడంలో ఏ విధమైన ఇబ్బందిని ఎదుర్కోనవసరం లేదు. తనకు నచ్చినదాన్ని గుర్తించడంలో అతనికి ఎటువంటి అభ్యంతరపు వుండరాదు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా వుంటున్నాయి. కెరీర్ను ఎంచుకునే విషయంలో ‘పాత్’ (మార్గం) స్పష్టంగానే విదితమవుతూ వున్నా, దాన్ని ఎంచుకోవటానికి డోలాయమానస్థితి (డైలమా) ఎదురవుతోంది. ఎందుకిలా జరుగుతోందని పరిశీలించినపుడు, బాల్యదశలో ఏర్పడిన ఆసక్తులు క్రమేపీ మసకబారుతూ వుండటమే కారణం కావచ్చన్న అభిప్రాయం శాస్త్రజ్ఞులలో బలపడుతోంది.
సెల్ఫ్ ఎస్టీమ్ లోపించడం
తన కిష్టమైనదేమిటో తనకు బాగా స్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ, తనకు నచ్చిన కెరీర్ను ఎంచుకునే విషయంలో మనిషి డోలాయమానస్థితిని ఎదుర్కొంటున్నాడంటే (డైలమా) అందుకుగల కారణాలలో మొదటిది సెల్ఫ్ ఎస్టిమ్ లేకపోవడమేనని శాస్త్రజ్ఞులు అంటున్నారు. బాల్య దశలో ఎసెర్టివ్ నెస్, సెల్ఫ్ ఫ్రైడ్, సెల్ఫ్ ఎస్టీమ్ వంటి మనోభావాల ప్రదర్శనకు అవరోధాలు చాలా చాలా తక్కువ. పిల్లలు ఏం చేసినా అందరూ హర్షిస్తారు. ఎదుగుతూ వున్న నేపథ్యంలోనే వారి ప్రవర్తనకు ‘నియంత్రణ’ వేటు పడ్తుంది. క్రమంగా పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ లోపించడం పరిణమిస్తుంది. ఫలితంగా తనకు నచ్చిన దానిని ‘నచ్చింది’ అని దృఢంగా ప్రకటించే వైఖరి సన్నగిల్లుతుంది. కొంతమందిలో ఇది ఎంత ఎక్కువగా ఏర్పడుతుందంటే, సెల్ఫ్ ఇమేజ్ లోపం వల్ల కలిగే తీర్మానాలు, అవి ఆ లోపం కారణంగానే ఉత్పన్నమయినాయనే సంగతిని కూడా యువకులు గ్రహించలేని స్థితిలో పడి పోతారు.
ఇతరుల ఆకాంక్షలు
బాల్యదశపు ఆసక్తి మసకబారి పోవటానికి మరో కారణం ఒక వ్యక్తి చుట్టూ వున ఇతర వ్యక్తుల ఆకాంక్షలు. ముఖ్యంగా ఆ వ్యక్తి జీవితంతో ముడి పడి వున్న వ్యక్తుల ఆకాంక్షలు, తల్లిదండ్రులు, లేదా బాగా దగ్గరయిన బంధువులు వీరి ఆకాంక్ష కారణంగా వ్యక్తిగత ఇష్టాలను పక్కకు నెట్టడం జరుగుతుంది. ‘నేను ఇంజనీర్ నవుతా’ అని అంటే ‘నీ మొహం... నీ కసలే లెక్కలు రావు. నువ్వేం చేయగలవ్’ అంటూ నిరుత్సాహపరుస్తూ, ‘డాక్టర్ అవ్వు...! నీకు అదే బెస్టు’ అని మార్గం మళ్ళించే పెద్దల మాటలు చేయవల్సిన డామేజిని చేసేస్తాయి. అతనిని డాక్టర్గా చూడాలన్నది తండ్రి ఆకాంక్ష. అంచేత అతని దృష్టిలో అతని కుమారుడు ఇంజనీర్ కాడు.. కాలేడు. ఈ విధంగా బాల్యదశలో ఏర్పడే ఆసక్తులు క్రమేపీ అంతరంగంలో సమాధి చేయబడతాయి. వాటి ఉనికే ఉందో లేదో తెలియనంత స్థాయిలో పరిస్థితి మారిపోతుంది.
డా.హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్







కామెంట్లు (0)