కల్వకుర్తి పిల్లల జాతర

19 నిమిషాల క్రితం

Kalwakurthi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 4 నిమిషాల చదవడం

‘కొంతమంది వృద్దులు పుట్టుకతో యువకులు’ అంటారు శ్రీశ్రీ. అందుకు నిదర్శనమే కలవకుర్తి బాలోత్సవం. చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చిరు దీపం వెలిగిస్తే ఆ కాంతి సమాజానికి వెలుగునిస్తుందన్న స్ఫూర్తితో పనిచేస్తున్నది. మూడేండ్ల కిందట పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు, సామాజిక సంక్షేమాన్ని కోరే సామాజికవేత్తలు కలిసి ఈ నూతన ఆలోచనకు రూపకల్పన చేశారు. స్వచ్ఛందంగా, నిస్వార్ధంగా బాలోత్సవ కమిటీలో పని చేయడానికి ముందుకు వచ్చారు. వివిధ రంగాలకు చెందిన బృందంతో ప్రణాళిక బద్ధంగా రూపొందించుకొని పనిచేయడం ప్రారంభించారు.


రాష్ట్ర బాలోత్సవ కమిటీ ఆలోచనలను పంచుకుంటూ కల్వకుర్తి పట్టణంలో మండల స్థాయిలో బాలోత్సవ కమిటీ 2024లో ఏర్పడింది. వివిధ కార్యక్రమాలతో విద్యార్థుల్లోకి విస్తృతంగా వెళ్లిన బాలోత్సవం కమిటీ భారీ ఎత్తున ప్రథమ వార్షికోత్సవం నిర్వహించింది. ప్రతి ఏడాది కొత్త అనుభవాలతో ముందుకు పోతున్నది. 2025లో జరిగిన వార్షికోత్సవంలో 2500 మందికి పైగా బాలబాలికలు పాల్గొన్నారు. 2026 డిసెంబరు ఒకటిన జరుపుకోబోయే మూడవ వార్షికోత్సవానికి అదే తరహా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బాలోత్సవం నిర్వహించే కార్యక్రమాలకు ఇదే గీటురాయిగా భావిస్తున్నాము.


రుగ్మతలను రూపుమాపేందుకు

నేటి సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు బాలలపై మంచి కంటే చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపుతున్నాయి. వాటిని అరికట్టడమే బాలోత్సవం లక్ష్యంగా పెట్టుకున్నది. మంచిని స్వీకరిస్తూ చెడుకు దూరంగా ఉండాలని బోధిస్తున్నది. సామాజిక విభేదాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయత, మతోన్మాద ధోరణులు, కులవివక్షత, సెల్‌‌ఫోన్‌ల ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుంది. అలాగే కొందరు పిల్లలు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. ఇటువంటి రుగ్మతలు వారి బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. ఈ సామాజిక రుగ్మతల నుంచి పిల్లల్ని బయట పడేయటానికి, వారిలో విద్యాబోధనతో పాటు వివిధ రూపాలలో అవగాహన కల్పించి ముందుకు నడిపించే బాధ్యతను బాలోత్సవం తీసుకున్నది. నేటి బాలలే రేపటి మానవీయ విలువలు కలిగిన పౌరులుగా, బాధ్యతయుతమైన దేశభక్తులుగా, సమాజం పట్ల అవగాహనాపరులుగా వారిని తీర్చిదిద్దడానికి బాలోత్సవం కమిటీ కృషి చేస్తున్నది.

వివిధ కార్యక్రమాల ద్వారా...

విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి, నాలుగు నుండి ఆరో తరగతి, ఏడవ తరగతి నుండి పదో తరగతి వరకు ఎంచుకొని పాఠశాల చదువులకు ఆటంకం లేకుండా సెలవుల్లో సమ్మర్ స్కూల్స్ నిర్వహిస్తున్నాం. చదువు పట్ల భయాన్ని తొలగించడం, డ్రాపట్స్ కాకుండా చూడటం మా ప్రధార కర్తవ్యం. బోధనా అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం కఠినమైన సబ్జెక్టులను ఆసక్తికరంగా బోధించే విధంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని కృషి చేయడం విశేషం. బడిలో చెప్పే పాఠాలకు భిన్నంగా సాయంత్రం వేళల్లో ఆయా బస్తీలలో విద్యార్థులకు వద్దకు వెళ్లి బొధిస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల సహకారంతో సాయంత్రం ట్యూషన్ సెంటర్లు నిర్వహించడం బాలోత్సవానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. మూఢనమ్మకాలను విడనాడేందుకు, శాస్త్రీయ అవగాహన పెంచేందుకు వివిధ రంగాల సామాజికవేత్తలు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలమిత్రుల కమిటీలను బాలోత్సవ కమిటీల ద్వారా ఏర్పాటు చేసి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి వారిలోని ప్రతిభకు సాన పెడుతున్నాము. బాలోత్సవం అందుకు తగిన విధంగా పోటీలు నిర్వహించి ప్రోత్సాహకరంగా దాతల సహకారంతో బహుమతులనందిస్తున్నది. అంతే కాదు వేసవి సెలవుల్లో స్కూలు ముగింపు సందర్భంగా పిల్లలను నాగార్జునసాగర్ లాంటి చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్లి వాటి విశేషాలు తెలియజేస్తున్నాము. వారు తిలకించిన ప్రదేశాలపై చర్చా గోష్టి నిర్వహించి వారిలోని జ్ఞాపకశక్తిని పెంపొందిస్తున్నాము.

శాస్త్రీయ అవగాహనతో...

మార్కులే గీటురాయిగా భావిస్తున్న సమాజంలో సామాజిక, మానవీయ విలువలు నేర్పే ప్రయత్నం చేస్తున్నాం. కులం, మతం పేరుతో లేత మొగ్గల మనసులను వీడదీయకుండా చట్టపట్టాలు వేసుకొని దేశస్తులంతా నడవవలెను అనే విధంగా పాటలు, మాటలు, పద్యాలు, వేమన శతకాలు, చిన్న చిన్న కథల రూపంలో వారికి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణపై కృషి చేస్తున్నాం. శాస్త్రీయ అవగాహనతో నూతన ఆవిష్కరణలకు, ఆలోచనలకు రూపం కల్పిస్తున్నాం. హేతువాద దృక్పథాన్ని రగిలిస్తున్నాము. జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ అంబేద్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వీర పాండ్య కట్ట బ్రహ్మన్న, మహాత్మా గాంధీ, సుందరయ్య వంటి మహనీయుల చరిత్రను చిట్టి పొట్టి మాటలతో వారిలో అవగాహన కల్పిస్తున్నాము. వ్యాసరచన పోటీలు నిర్వహిస్తూ వారిలో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నాం.

పిల్లల జాతర

జానపద, శాస్త్రీయ నృత్య గురువులతో శిక్షణ ఇప్పించి పండుగల సమయాలలో పట్టణంలో, పల్లెల్లో అభ్యుదయ గీతాలను జోడించి నృత్య ప్రదర్శన ద్వారా సామాజిక ఐక్యతను నెలకొల్పొతున్నాం. బాలోత్సవం చేస్తున్న కార్యక్రమాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు తగువిధంగా సహకారం అందిస్తున్నారు. స్థానిక గ్రామ చరిత్రతో పాటు పట్టణ, రాష్ట్ర, దేశ చరిత్రను కూడా వారికి అర్థమయ్యే విధంగా బోధిస్తున్నాము. కల్వకుర్తి మండలంలోని దాదాపు 40 ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతి నవంబర్ మాసంలో గత రెండేండ్లుగా ‘పిల్లల జాతర’ పేరుతో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నాం. చిత్రలేఖనం, కళలు, సైన్స్ ఎగ్జిబిషను, జానపదం, శాస్త్రీయ నృత్యాలు, గ్రామీణ బతుకమ్మ పోటీలు, క్విజ్, వ్యాసరచన, వకృత్వం, పర్యావరణ పరిరక్షణ గ్రామీణ సమస్యలపై స్కిట్స్, చేడు వ్యసనాలనకు లోనైతే బాల్యాన్ని ఏవిధంగా చిద్రమవుతుందో లాంటి పది నిమిషాలకు మించని నాటికలు, పాటలు, నృత్యరూపకాల ద్వారా సమాజానికి తెలియజేసే కృషి బాలోత్సవం చేస్తున్నది. దేశభక్తులైన మహాత్మాగాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, జ్యోతిబాయ్ పూలే, రాణి రుద్రమదేవిల ఏకపాత్రాభినయాలతో వేలాదిమంది విద్యార్థులు స్ఫూర్తి పొందుతున్నారు. బాలోత్సవం కార్యక్రమాలను నిర్వహించేందుకు బాలల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నాము. విజేతలైన వారందరికీ ప్రముఖులచే జ్ఞాపికాలను అందజేసి ప్రోత్సహిస్తున్నాం.

సహకరిస్తున్న వారికి వందనాలు

బాలోత్సవ కార్యక్రమాల విజయం వెనుక కల్వకుర్తి అభ్యుదయవాదులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, మేధావుల తోడ్పాటు ఎంతో వుంది. ఆర్ధికంగా, హార్ధికంగా ఎంతో సహకరిస్తున్నారు. పిల్లల ఎదుగుదలను కాంక్షిస్తూ స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కూడా గత మూడేండ్లుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో బాలోత్సవం కార్యక్రమాలు సమాజం మార్పు కోసం తోడ్పడాలనే ఆశ భావంతో సహకారం అందిస్తున్నట్లు పలువురు అంటున్నారు. ఇక 2026 డిసెంబర్ 1న కల్వకుర్తి మూడవ పిల్లల జాతర కోసం సిద్ధమవుతున్నది.


కెవి, 9440854149

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్