అక్షరాల వెనుక దాగున్న అంతరంగం

14 నిమిషాల క్రితం

meaning
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అనే కంటే ‘మాటల మడుగు, కాలం వాలిపోతున్న వైపు, డియర్ జిందగీ, యుద్ధకాలపు శోకగీతం’ రచనల ద్వారా తనను అంచనావేయడమే సరైన గుర్తింపు. ‘వాట్ నాట్’ అనిపించే నిలువెత్తు వ్యక్తిత్వం ‘మెర్సీ మార్గరెట్’. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. గాయాలు శరీరానివే కాదు మనసువి కూడా.. అని నిర్ధారించుకుంటే వాటి తాలూకు సంఘర్షణ, అందులోంచి బైట పడటానికి చేసే పెనుగులాట అంతా ఇంతా కాదు. ‘వెలుగు మిగిలిన చోట’ కవిత అనల్ప అక్షరాల్లోని వేదనను అనువదించుకునేందుకు వీలు కల్పిస్తది. సిగ్మండ్ ఫ్రాయిడ్ Defense mechanism (రక్షణ తంత్రాలు) ద్వారా భావోద్వేగాల్ని మనుషులు ఎలా అధిగమిస్తారో చెబుతరు.

అందులో sublimation (ఉదాత్తీకరణం) ఒకటి. మనిషి తనలోని భరించలేని దుక్కాన్ని, అణచివేయబడిన కోరికల్ని సృజనాత్మక కళలు, సాహిత్యం ద్వారా వెలువరిస్తూ తాత్విక స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తడు. ఇది ఒక రకమైక ఊరట కల్పించే అంశం. అంతరంగంలోని వేదనను అక్షరాల్లోకి మళ్లించడం తద్వారా ఉద్వేగాల్ని అదుపులో వుంచడం sublimation (ప్రతికూల భావోద్వేగాలని నిర్మాణాత్మక క్రియల వైపు మళ్లించడం) అనే‌ రక్షణతంత్రం చేసే పని. మనుషులు దూరమయ్యాక జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయనే కవి మాటలు అక్షర సత్యం. అలాగని చీకటిని ఆశ్రయించడం వల్ల వేదన తీవ్రరూపాన్ని ధరిస్తది. అప్పుడు ఆశావహ దృక్పథం ఒక్కటే మనిషిని ముందుకు నడిపించగలదు. ఈ దృక్పథం సూర్యుడి నమ్మకం, వెయ్యి నక్షత్రాలతో చీకటిని కుట్టుకోవడం మొదలైన వాటి ద్వారా బలపర్చడం కనిపిస్తది.


వెలుగులు అస్తమించవని ప్రకటించడం ద్వారా జ్ఞాపకాల రూపంలో సజీవంగా మనసులో మెదులుతుంటారనే విషయాన్ని స్పష్ట పర్చడం చూస్తాం. దీన్ని కళ్ళలోంచి జారిపోవడం, జ్ఞాపకాలుగా ఉదయించడంగా కవిత్వీకరించడం గమనిస్తాం. మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తులు దూరమైనప్పుడు జీవితమంతా ‘చీకటి’లాగే అనిపించినా, వారితో మనకున్న అనుబంధం, ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ వెలుగునిస్తూనే ఉంటాయనే సందేశాన్ని యిస్తున్నట్లుగా భావించడానికి అవకాశం వుంది. కవులు ఎంచుకునే వస్తువు సామాజికమైనా, వ్యక్తిగతమైనా అది కవిత్వమవ్వడమే ప్రధానం. వ్యక్తిగతమనుకునే ‘వస్తువు’ను కవులు స్వీయ అనుభవాల్లోంచి, సామాజిక అనుభవాల్లోంచి ఎక్కడి నుంచైనా స్వీకరించవచ్చు. అయితే కవిత్వం చేసే రసవిద్య తెలిసి వుండాలి. కవి ‘మెర్సీ మార్గరెట్’ కవిత్వ రస విద్య తెలిసిన నిపుణురాలైన సృజనకారిణి. మరిన్ని కవిత్వ సంపుటాలుగా విరగబూయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.


వెలుగు మిగిలిన చోట

రాత్రి తన చీకటిని వెయ్యి నక్షత్రాలతో కుట్టుకుంటుంది పగలు మాత్రం ఒక్క సూర్యుడి నమ్మకంతో బతుకుతుంది మనిషి కూడా అంతే! మనసు వెయ్యి జ్ఞాపకాల్ని దాచుకుంటుంది కానీ ప్రేమించిన హృదయం ఒక్క వీడ్కోలుకే జీవితమంతా చీకటిని అలవాటు చేసుకుంటుంది కొన్ని వెలుగులు అస్తమించవు కళ్లలోంచి జారిపోయి జ్ఞాపకాలలో ఉదయిస్తుంటాయి


బండారి రాజ్‌‌కుమార్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్