సినిమా పూర్తి అయింది. పాటలు ఆడియో విడుదల అయ్యాయి. ప్రివ్యూ కూడా అయింది. మరుసటి రోజు విడుదల కావలసిన ఆ తెలుగు సినిమా ఆగిపోయింది. కారణం తెలియదు. అసలు విషయానికి వస్తే.. సువర్ణలతా వారి సాంఘిక చిత్రం అని ఘనంగా ప్రచారం చేసుకుని, ఆ సంస్థపై నిర్మించిన ఒక తెలుగు చిత్రం ‘సువర్ణమాల’. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం కాళ్ళకూరి సదాశివ రావు. ఇది ఈయనకు చివరి చిత్రం. ఈ సినిమాకు ఆయన పదేండ్ల విరామం తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం. ఈ చిత్రానికి మాటలు, పాటలు దర్భా వెంకట కృష్ణమూర్తి. సంగీతం సమకూర్చింది అద్దేపల్లి రామారావు. కుటుంబ విలువలు, ప్రేమ, సామాజిక అంశాల చుట్టూ తిరిగే ఒక పాతతరం సాంఘిక కథా చిత్రం ఈ ‘సువర్ణమాల’. బహిరంగ మార్కెట్లో షేర్స్ కూడా విక్రయించి ఈ ‘సువర్ణమాల’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నటించిన ముఖ్య తారాగణం సురభి బాల సరస్వతి, సూర్యనారాయణ, జోషి, ముదిగొండ లింగమూర్తి, దొరస్వామి, రామకృష్ణ శాస్త్రి, అనసూయ, లలిత తదితరులు నటించారు.
సురభి బాల సరస్వతి వివాహం అయిన తర్వాత నటించిన రెండవ చిత్రం ఇది. ఈ చిత్రంలో హీరో సూర్యనారాయణ. ఇతను
02 జనవరి 1948 న విడుదలైన ‘రత్నమాల’ చిత్రంలో చిన్న పాత్రైనా ప్రాధాన్యత కలిగిన పాత్ర ధరించాడు. రత్నమాల చిత్రం భరణీ పిక్చర్స్ తొలి చిత్రం. భానుమతి నాయిక. అక్కినేని నాగేశ్వరరావు హీరో అయినా, ఆ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు.
ఇక సూర్యనారాయణ అనే వ్యక్తి ఒక బ్యాంక్ ఉద్యోగి. ఇతను మద్రాసులో పట్ట పగలు హత్యకు గురయ్యాడు. కారణాలు మాత్రం తెలియదు. ఇక ఈ ‘సువర్ణమాల’ చిత్రం విడుదల తేదీని 15 ఆగస్టు 1948గా ప్రకటించి, ముందు రోజు అంటే 14 ఆగస్టు 1948న మద్రాసులో ప్రివ్యూ కూడా ప్రదర్శించారు. ప్రాసెసింగ్ ఫిలిం దొరక్క సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించినా, ఈ సినిమా ఆ తర్వాత కూడా వెలుగు చూడలేదు. ఇదీ ఈ ఆగిపోయిన ‘సువర్ణమాల’ చలన చిత్రం సంగతి.
పంతంగి శ్రీ వాస రావు,
9182203351



కామెంట్లు (0)