ప‌ల్లీ.. బ‌ఠానీలు...

14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

మాట్లాడ‌టం, ప్ర‌సంగించ‌టంలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్టైల్‌. ఈ శైలికి సంబంధించి ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు వేసే పంచ్ డైలాగుల‌కు స‌భికులు పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వ‌టం ఖాయం. ఈ కోవ‌లో మొద‌ట చెప్పుకోవాల్సింది మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో మాట్లాడే ఆయ‌న నోటి నుంచి అల‌కోవ‌గా సెటైర్లు జాలువారుతుంటాయి. గ‌ల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ... నేను రాజ‌కీయాల నుంచి రిటైర్ అయ్యాను, కానీ నో టైర్‌డ్‌... ఊప‌ర్ షేర్వాణీ, అంద‌ర్ ప‌రేషానీ... లాంటి వ్యంగ్యాస్త్రాల‌ను ఆయ‌న సంధించేవారు. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం... త‌నదైన మేన‌రిజంతో బ‌హిరంగ స‌భ‌ల‌ను, మీడియా స‌మావేశాల‌ను ర‌క్తి క‌ట్టించేవారు. ప్రెస్ కాన్ఫ‌రెన్సు మొద‌లు పెట్ట‌గానే... మాట్లాడుకుందామా? మ‌రి...అనే ప‌దంతో ఆయ‌న ప్రారంభించేవారు. ఏదైనా ప్ర‌శ్న అడిగితే... ఏం చేద్దామంట‌వు మ‌రి.. నేను నియంత‌గా లేక‌పోతే మా పార్టీ వాళ్లే న‌న్ను కోఠిలో అర్థ రూపాయికి అమ్మేస్త‌రు... అంటూ ఎదుటి వారిని మాట్లాడ‌కుండా చేసేవారు. ఇక ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం వ్యంగ్యాస్త్రాలు, విమ‌ర్శ‌నాస్త్రాలు, వాగ్బాణాల‌ను సంధించ‌టంలో దిట్ట‌. కాక‌పోతే ఒక్కోసారి మోతాదుకు మించి, రాయ‌కూడ‌ని భాష‌లో ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న ఒంటికాలి మీద శివాలెత్తుతుంటారు. ఆ క్ర‌మంలో ఇటీవ‌ల ఆయ‌న కాషాయ పార్టీపై వేసిన ఓ సెటైర్ మ‌స్తు పేలింది. మా కాంగ్రెస్ స‌భ పెట్టిన‌ప్పుడు ఆ స‌భ‌లో.. ప‌ల్లీలు, బ‌ఠాణీలు అమ్మేవాళ్లంత సంఖ్య‌లో కూడా మీరు లేరు. అలాంటిది మీరా.. మ‌మ్మ‌ల్ని ఓడించేది..? అంటూ సీఎం వ్యాఖ్యానించ‌టంతో జ‌నం బిగ్గ‌ర‌గా న‌వ్వుతూ హ‌ర్ష‌ధ్వానాలు చేశారు.
- బి.వి.య‌న్‌.ప‌ద్మ‌రాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్