మనోవికాస సోపానాలు

15 నిమిషాల క్రితం

Development
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

కథలు అందరూ చెబుతారు కానీ ప్రభావవంతమైన, విజయవంతమైన కథలు రాయగలిగేది మాత్రం కథ ఉనికిని సామాజిక ప్రయోజనంతో నిబద్ధం చేయగలిగిన వారే. అలాంటి కథకులలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు ఒకరు. వీరు చిత్తూరు జిల్లా పుత్తూరు శల్యవైద్యకుటుంబానికి చెందినవారు. శల్య వైద్యులు ఎముకలకు చికిత్స చేస్తే, ఆ కుటుంబానికి చెందిన కృష్ణస్వామి రాజు తమ కథల ద్వారా మనసుకు వైద్యం చేస్తూ మనో వికాసానికి బాటలు వేస్తున్నారు. అలాంటి వంద మనోవికాస కథలతో కూడిన పుస్తకం ‘ధర్మో రక్షతి రక్షితః’ పెరుగు కన్నా పెరుగులో ఉన్న నెయ్యికి విలువెలా ఎక్కువో, మనిషి కన్నా మనిషిలో ఉన్న మంచితనానికే విలువెక్కువ. ఆ మంచితనాన్ని పెంచి, మనిషి తనాన్ని తట్టి లేపడమే ఈ కథల లక్ష్యం. సంపుటి పేరులోనే దాని ప్రయోజనం దాగి ఉంది. ధర్మాన్ని ఆచరించాల్సిన ఆవశ్యకతను చెబుతోంది.


మనిషి భౌతికంగా ఎంత ఎదిగినా, మానసికంగా పరిణతి చెందకపోతే ఆ జీవితానికి అర్థం, పరమార్ధం ఉండదు. భయం, అపనమ్మకం, అసూయ, నిరాశ, స్వార్థం వంటి ప్రతికూల ఆలోచనలను జయిస్తేనే నిజమైన వికాసం సాధ్యం. ఈ సత్యాన్ని చిన్న చిన్న కథల్లో, సరళమైన భాషలో తెలియజేస్తున్నారు కృష్ణస్వామి రాజు. ఈ కథా సంపుటం - మంచి తనం, మానవత్వం, సహృదయత, సానుకూలత, నీతి, నిజాయితీ, భక్తి కేంద్రంగా సాగుతూ ఆశకు, స్వేచ్ఛకు హద్దులు పెడుతుంది. తల్లిదండ్రులకు సేవను, దాన గుణాన్ని చాటుతుంది, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది, మానవ సంబంధాలు మెరుగుపడే మార్గాన్నిసూచిస్తుంది, అతివేగం అనర్ధదాయక మంటుంది. ఇలా ఎన్నో చెబుతుంది, వాటిని ఆచరించమంటుంది. ఈ కథల్లో సమాజంలోని మంచిని వదిలి, చిన్న లోపాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసే ప్రబుద్ధులు,


తన ధాన్యాన్ని దొంగలించడానికి వచ్చిన దొంగల ఆకలి గురించి కూడా మంచిగా ఆలోచించగలిగిన మానవత్వం కలిగిన రైతులు, ప్రస్తుతంలో కాకుండా గతం, భవిష్యత్తులలో జీవిస్తూ, ఇతరులతో పోల్చుకుంటూ బుర్రను చెత్తబుట్టలాగా చేసుకునే యువకులు. ఆసుపత్రిలో రోగుల బంధువులకు ప్రతి రోజు అన్నం పెట్టే కరుణామయులైన నర్సులు, జీవిత సత్యాలను ప్రత్యక్ష ఉదాహరణల ద్వారా తెలియజేసి కనువిప్పు కలిగించే గురువులు, పండితులు, సాధువులు - ఇలా ఎన్నో పాత్రలు తారసపడతాయి. మనల్నిఆలోచింపచేస్తాయి. ఇందులో - లౌకిక వ్యవహారాల్లో మనల్ని ప్రభావితం చేసే, ప్రలోభ పెట్టే అంశాలు చాలా ఉంటాయి. వాటి వ్యామోహంలో పడి మన వ్యక్తిత్వాన్ని, సహజ స్వభావాన్ని వదులుకోకూడదు అనే సందేశం ఉంది. మనం చేసే కర్మలు ఎప్పటికీ చెడవు. అవి మనతోటే ఉంటాయి.


చెడు కర్మలు ఆచరిస్తే చెడు ఫలితాన్ని అనుభవించక తప్పదు అనే హెచ్చరిక ఉంది. మన మనసుకు మించిన పెద్ద గురువు లేడు. ఎప్పటికప్పుడు మనకు మంచి, చెడులను చెప్పేది మనసే. కాబట్టి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి అనే బోధ ఉంది. ఇదీ ఈ కథల్లో కనిపించే వస్తు వైవిధ్యం, విస్తృతి. ఈ విధంగా ఒత్తిడితో కూడిన నేటి జీవితంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికి అవసరమైన మానసిక బలాన్ని, మనో వికాసాన్ని అందించడంలో ఈ కథలు ముందుంటాయి. సమాజంలోని విభిన్న మనస్తత్వాలు, మనుషుల అనర్థపు ఆలోచనలు, వాటన్నిటిని గాడిలో పెట్టే ప్రయత్నమే - ఈ ధర్మో రక్షతి రక్షితః.


డా.కొణిదల శోభ, 93936 62821

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్